Kalyandurg: కళ్యాణదుర్గంలో ఘనంగా యోగా డే.. విద్యార్థులతో ఆసనాలు వేసిన ఎమ్మెల్యే!
Kalyandurg: కళ్యాణదుర్గంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. యోగా ప్రాముఖ్యతపై అవగాహన.
Kalyandurg: కళ్యాణదుర్గంలో ఘనంగా యోగా డే.. విద్యార్థులతో ఆసనాలు వేసిన ఎమ్మెల్యే!
Kalyandurg: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రజావేదికలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొని యోగా ఉపాసకులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి వివిధ యోగా ఆసనాలు వేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ కొంత సమయం యోగాకు కేటాయిస్తే అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉండటంతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చని సూచించారు.
ఉదయాన్నే సూర్యభగవానుడికి నమస్కరించి యోగా ప్రారంభించడం భారతీయ సంస్కృతిలో భాగమని ఎమ్మెల్యే తెలిపారు. 70 ఏళ్లకు పైబడిన వయసులో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకు 18 గంటలపాటు చురుకుగా పనిచేయగలగడం వెనుక ఆయన నిత్య యోగా సాధన ప్రధాన కారణమని అన్నారు. ఎంతటి పనిభారం ఉన్నా అలసట లేకుండా ఉండేందుకు యోగా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
ఇటీవల రాళ్లనంతపురం గ్రామంలోని పాఠశాలను సందర్శించిన సందర్భంగా విద్యార్థులు యోగా మ్యాట్లు కావాలని కోరడం తనను ఆకట్టుకుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చిన్న వయసులోనే యోగా పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెరగడం సంతోషకర విషయమన్నారు. యోగా ద్వారా క్రమశిక్షణ, ఏకాగ్రత, ఆరోగ్యం మెరుగుపడతాయని వివరించారు.
అలాగే కళ్యాణదుర్గం పట్టణ ప్రజలకు యోగా సాధన కోసం నగరవనంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయించే అంశంపై జిల్లా కలెక్టర్, అటవీ శాఖ అధికారులతో చర్చించి అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అనంతరం యోగా గురువులను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వసంత్‌బాబు, కంబదూరు తహసీల్దార్ బాలకిషన్, మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్, పోలీసు సిబ్బంది, యోగా శిక్షకులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు మరియు పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి.




