Kalyanadurgam: కళ్యాణదుర్గంలో ఘనంగా 'మెగా పీటీఎం–4.0'

Kalyanadurgam: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్వహించిన మెగా పిటిఎం 4.0 లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు.

P.Sudhakar, Anantapuram
Published on: 24 July 2026 5:43 PM IST
Kalyanadurgam
X

Kalyanadurgam: కళ్యాణదుర్గంలో ఘనంగా 'మెగా పీటీఎం–4.0'

Kalyanadurgam: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్యతరగతి విద్యార్థులకు కూడా కార్పొరేట్ స్థాయి విద్యతో పాటు ఆధునిక సౌకర్యాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎం–4.0 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు.

విద్యార్థుల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే అన్నారు. పిల్లలను సెల్‌ఫోన్లకు దూరంగా ఉంచి వారి చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తల్లిదండ్రులకు సూచించారు. అలాగే ఉపాధ్యాయులు పాఠ్యాంశాల బోధనతో పాటు క్రమశిక్షణ, సమయపాలన, మంచి నడవడిక వంటి విలువలను కూడా విద్యార్థులకు అలవర్చాలని కోరారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధే మెగా పీటీఎం కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.

'తల్లికి వందనం' పథకం కింద ఇప్పటికే 95 శాతానికి పైగా అర్హులైన తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు వెల్లడించారు. మిగిలిన లబ్ధిదారులకు కూడా వచ్చే నెలలోగా ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 42.70 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.10,120.78 కోట్లు జమ చేసి, 67.47 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందినట్లు వివరించారు.

గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల విద్యను మరింత ప్రోత్సహించేందుకు ఎస్సార్సీ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.4 కోట్ల వ్యయంతో ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతులు, ఇంటర్ చదువుతున్న 6,500 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. అలాగే పదో తరగతిలో 500 మార్కులు సాధించిన ఏడుగురు విద్యార్థులను ఘనంగా సన్మానించి, ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణాన్ని ఆగస్టు 15లోగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ వసంత్‌బాబు, డీఎస్పీ రవిబాబు, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ వైపీ రమేష్, మార్కెట్ యార్డు చైర్మన్ గోళ్ల లక్ష్మీదేవి రమేష్, ఎంఈవో బాబు, ప్రధానోపాధ్యాయులు, పాఠశాల కమిటీ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మెగా పీటీఎం–4.0 ద్వారా పాఠశాలలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య సమన్వయం మరింత బలోపేతమై, విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపుదలకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడ్డారు.

P.Sudhakar, Anantapuram

P.Sudhakar, Anantapuram

Next Story