Kadiri: ఫ్యామిలీ కౌన్సిలింగ్‌తో కదిరిలో ఒక్కటైన 40 కుటుంబాలు!

Kadiri: కదిరిలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా 40 కుటుంబాలు ఒక్కటయ్యాయి; ఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మెల్యే కందికుంట ముఖ్య అతిథులుగా పాల్గొని దంపతులను అభినందించారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 28 Aug 2026 10:43 AM IST
Kadiri
X

Kadiri: ఫ్యామిలీ కౌన్సిలింగ్‌తో కదిరిలో ఒక్కటైన 40 కుటుంబాలు!

Kadiri: కుటుంబ వివాదాలను ప్రారంభ దశలోనే పరిష్కరించి, అవి విడాకులు, పోలీస్ కేసులు లేదా కోర్టు వివాదాల వరకు వెళ్లకుండా చూడటమే ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ల ప్రధాన ఉద్దేశమని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.

గురువారం సాయంత్రం కదిరి పట్టణంలోని పీవీఆర్ ఫంక్షన్ హాల్‌లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకుని కలిసి జీవించేందుకు నిర్ణయించుకున్న జంటలను అభినందించేందుకు కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,

శ్రీ సత్య సాయి జిల్లాలోని ప్రతి పోలీస్ సబ్-డివిజన్‌లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశామని, మొదటి సెంటర్‌ను కదిరిలో ప్రారంభించామని తెలిపారు.

భార్యాభర్తల మధ్య, అలాగే ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడే వివాదాలను ఈ సెంటర్ల ద్వారా పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఇరువర్గాల మాటలను విని, సమస్యకు కారణాలను గుర్తించి, చర్చలు, సహనం, పరస్పర అవగాహన ద్వారా పరిష్కారం చూపుతున్నామని తెలిపారు.

కుటుంబ వివాదాలను కేవలం చట్టపరమైన కోణంలో చూడకుండా, సమస్యకు గల కారణాలను అర్థం చేసుకుని, సాధ్యమైనంత వరకు కుటుంబాలను కాపాడేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తోందని ఎస్పీ చెప్పారు.

కదిరి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా ఇప్పటివరకు 40 కుటుంబాలను తిరిగి ఒక్కటి చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృషి చేసిన డీఎస్పీ, న్యాయవాదులు, పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు ఇతరులను ఎస్పీ అభినందించారు.

కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ మాట్లాడుతూ, జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందించారు. ఇలాంటి కౌన్సిలింగ్ ద్వారా చిన్నచిన్న కుటుంబ సమస్యలు పెద్ద వివాదాలుగా మారకుండా నివారించవచ్చని తెలిపారు.

భార్యాభర్తలు పరస్పర అవగాహన, సహనం, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే కలిసి తిరిగి ఒక్కటైన జంటలను అభినందించి, వారు సంతోషంగా కుటుంబ జీవితాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీమతి అంకిత సురాన, డీఎస్పీ శివన్నారాయణ స్వామి, న్యాయవాది నరసింహులు, కదిరి టౌన్ సీఐ వెంకటేశ్వర్లు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి శ్రీమతి భానుజాతో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది, ప్రముఖులు పాల్గొన్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story