Somuladoddi: అనంతపురం సోములదొడ్డి ఇస్కాన్‌లో అంబరాన్నంటిన కృష్ణాష్టమి సంబరాలు
Somuladoddi: అనంతపురం సోములదొడ్డి ఇస్కాన్ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
Somuladoddi: అనంతపురం సోములదొడ్డి ఇస్కాన్‌లో అంబరాన్నంటిన కృష్ణాష్టమి సంబరాలు
అనంతపురం జిల్లా: సోములదొడ్డి గ్రామంలో వెలసి ఉన్న ఇస్కాన్ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా భక్తులందరికీ ఇస్కాన్ ప్రభుజీ మురళీకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు.ఉదయం 4 గంటల 30 నిమిషాలకే స్వామివారికి మంగళహారతితో జన్మాష్టమి వేడుకలు ప్రారంభమయ్యాయి.
అనంతరం ఉదయం 8 గంటలకు శృంగార దర్శనం ప్రారంభమైంది.శ్రీకృష్ణుడి దర్శనం కోసం వేలాది మంది భక్తులు ఇస్కాన్ ఆలయానికి తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది.జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక హోమం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు శ్రీకృష్ణుడికి ఇష్టమైన ఉట్ల ఉత్సవం, 5 గంటలకు హనుమంత వాహన సేవ నిర్వహించనున్నారు.
రాత్రి 10 గంటల తర్వాత రాధాకృష్ణులకు ప్రత్యేక అభిషేకం చేపట్టనున్నారు. రోజంతా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో జన్మాష్టమి వేడుకలు కొనసాగనున్నాయి.ఈ ఒక్కరోజే సుమారు లక్ష మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని ఇస్కాన్ ప్రభుజీ మురళీకృష్ణ తెలిపారు.
ఇక రేపు ఇస్కాన్‌కు అత్యంత ముఖ్యమైన రోజుగా ఆయన తెలిపారు. అంతర్జాతీయ కృష్ణచైతన్య సంఘం స్థాపకులు, ఆచార్యులు అభయ్ చరణారవింద భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.
రేపు ఉదయం 11 గంటలకు ప్రభుపాదుల వారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి, అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేపట్టనున్నారు.మధ్యాహ్నం 3 గంటలకు రాధాకృష్ణులను రథంపై పురవీధులు తిరుగనున్నారు.
ఈ ఏడాది అనంతపురంలో జగన్నాథ రథయాత్ర జరగకపోవడంతో రాధాకృష్ణుల రథోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ ప్రభుజీ తెలిపారు.మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రారంభమయ్యే రథయాత్ర... టవర్ క్లాక్, శ్రీకంఠం సర్కిల్, పాత ఊరు మీదుగా సాగి... కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న గోశాల వద్ద ముగియనుంది.
అనంతరం గోశాల వద్ద భక్తులకు భోజన ప్రసాదాల వితరణ నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని... గురువుగారి, శ్రీకృష్ణ పరమాత్మ కృపకు పాత్రులు కావాలని ఇస్కాన్ ప్రభుజీ మురళీకృష్ణ కోరారు.




