Kalyanadurgam: కళ్యాణదుర్గంలో వరుస చోరీలు ఛేదన.. నలుగురు అరెస్ట్!

Kalyanadurgam: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వరుస చోరీల కేసులను పోలీసులు ఛేదించారు.

P.Sudhakar, Anantapuram
Published on: 5 Aug 2026 8:58 AM IST
Kalyanadurgam
X

Kalyanadurgam: కళ్యాణదుర్గంలో వరుస చోరీలు ఛేదన.. నలుగురు అరెస్ట్!

Kalyanadurgam: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో సంచలనం సృష్టించిన వరుస ఇంటి చోరీల కేసులను టౌన్ పోలీసులు ఛేదించారు. నాలుగు మంది నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ పి. జగదీష్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, కళ్యాణదుర్గం ఎస్‌డీపీవో సి. రవిబాబు పర్యవేక్షణలో టౌన్ సీఐ వి. హరినాథ్, రూరల్ సీఐ సి. నీలకంఠేశ్వర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు మంగళవారం మధ్యాహ్నం అనంతపురం రోడ్డులోని శ్రీ అక్కమ్మ బస్ షెల్టర్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నాయి.

అరెస్టైన వారిలో బోయ నరసింహ అలియాస్ నరమోడు (25), పిట్టి తిప్పేస్వామి అలియాస్ అశోక్ (38), బోయ మధుసూదన్ (25), బలిజ అచ్చయ్య (29) ఉన్నారు. వీరంతా బెట్టింగ్‌తో పాటు ఇతర చెడు వ్యసనాలకు బానిసలై డబ్బు కోసం చోరీలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

పోలీసుల కథనం ప్రకారం.. ఈ ఏడాది జనవరి 24, ఏప్రిల్ 24, మే 4 తేదీల్లో కళ్యాణదుర్గం పట్టణంలోని మారెంపల్లి కాలనీ, పార్వతినగర్, ఒంటిమిద్ది ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాత్రి వేళల్లో ఇనుప రాడ్లతో తాళాలు బద్దలు కొట్టి ఇళ్లలోకి ప్రవేశించారు. అనంతరం బంగారు ఆభరణాలు, నగదు దోచుకుని పరారయ్యారు. సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.

నిందితుల వద్ద నుంచి ఒక బంగారు నెక్లెస్ (2 తులాలు), ఒక బంగారు సాదా చైన్ (1 తులం), రెండు జతల బంగారు కమ్మలు, ఒక బంగారు ఉంగరం, ఒక వెండి నడుము గొలుసు (126 గ్రాములు), వెండి ఉంగరం, నాలుగు జతల వెండి మెట్టెలతో పాటు ఇతర ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న వాటిలో దాదాపు 6 తులాల బంగారం, 20 తులాల వెండి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు వెల్లడించారు. వరుస చోరీల కేసులను ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. పట్టణంలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.

P.Sudhakar, Anantapuram

P.Sudhakar, Anantapuram

Next Story