Anantapur: సూపర్ సిక్స్ పథకాలతో సూపర్ హిట్ కూటమి పాలన

Anantapur: అనంతపురం అర్బన్ విజయోత్సవ సభలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కీలక వ్యాఖ్యలు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వివరణ.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 21 Jun 2026 1:20 PM IST
Anantapur
X

Anantapur: సూపర్ సిక్స్ పథకాలతో సూపర్ హిట్ కూటమి పాలన

Anantapur: అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సభలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో పాటు పెద్ద ఎత్తున అధికారులు, రైతులు పాల్గొన్నారు.

అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హాజరయ్యారు. నియోజకవర్గ పరిశీలకుడు దేవేంద్రప్ప, మున్సిపల్ కమిషనర్ జస్వంత్ కుమార్, అగ్రికల్చర్ ఏడీ విద్యావతితో పాటు కూటమికి చెందిన పలువురు ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గత రెండేళ్లలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిపై ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ.. గత రెండేళ్ల కాలంలో అనంతపురం నగరంలోనే 180 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.

"కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమ, అభివృద్ధి విప్లవం ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు గారు ముందుగా సూపర్ సిక్స్ హామీల అమలు పైనే ప్రధానంగా దృష్టి సారించారు. మెగా డీఎస్సీ, పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునః ప్రారంభం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు వంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాం."

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం పది లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిందని ఎమ్మెల్యే విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుభవంతో మళ్లీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని కొనియాడారు. సీబీఎన్ బ్రాండ్ ఇమేజ్, మంత్రి నారా లోకేష్ కృషితో రాష్ట్రానికి 25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, దీనివల్ల 20 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని వివరించారు.

పుట్టపర్తి వంటి ప్రాంతంలో 5th జనరేషన్ యుద్ధ విమానాల తయారీ పరిశ్రమను తీసుకువచ్చామని, జిల్లాలోనే లక్ష కోట్లకు పైగా పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని తెలిపారు.ఇంత అభివృద్ధి జరుగుతున్నా వైసీపీ నాయకుల కళ్లకు కనిపించడం లేదని ఎమ్మెల్యే దగ్గుపాటి మండిపడ్డారు. అభివృద్ధి జరగలేదని భావిస్తే తాము బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.

తాము జగన్మోహన్ రెడ్డిలా అవినీతి చేయలేదని, 4 వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం డబ్బుంతా తాడేపల్లి ప్యాలెస్‌కే వెళ్లిందని ఆరోపించారు. రెండేళ్ల కూటమి పాలనపై జిల్లా స్థాయి బహిరంగ సభ విజయవంతం కావడాన్ని ఓర్వలేకే, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కలెక్టర్‌పై అనవసర విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, ఎస్ఐఆర్ కార్యక్రమంలో బీఎల్ఓలను బెదిరిస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హెచ్చరించారు.

మొత్తానికి, అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం దూసుకుపోతోందని, భవిష్యత్తులో అనంతపురం నియోజకవర్గాన్ని మరింత మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story