Kalyandurg: ఒంటిమిద్దిలో విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ!

Kalyandurg: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు 'అమిలినేని విద్యాచక్రం' కింద ఒంటిమిద్ది జెడ్పీ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు.

P.Sudhakar, Kalyanadurgam
Published on: 5 Sept 2026 1:14 PM IST
Kalyandurg
X

Kalyandurg: ఒంటిమిద్దిలో విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ!

Kalyandurg: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఒంటిమిద్ది గ్రామంలో అమిలినేని విద్యాచక్రం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలు, నాయకులు ఘన స్వాగతం పలికారు.

విద్యార్థులు బ్యాగులు మోసుకుంటూ కిలోమీటర్ల కొద్దీ నడిచి పాఠశాలలకు వెళ్లడం చూసి చలించిపోయానని ఎమ్మెల్యే తెలిపారు. వారి ప్రయాణ కష్టాలను తగ్గించాలనే ఉద్దేశంతో 9, 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైకిళ్లు అందిస్తున్నామని చెప్పారు. ఎస్సార్సీ సంస్థ సహకారంతో సుమారు రూ.5 కోట్ల వ్యయంతో 7,300 సైకిళ్లు అందిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు ఎమ్మెల్యే నివాళులర్పించారు. పాఠశాలలు దేవాలయాలతో సమానమని, విద్యార్థులు చదువుకునే పవిత్రమైన ప్రాంగణాల్లో అసాంఘిక కార్యకలాపాలకు తావు ఉండకూడదని స్పష్టం చేశారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇటీవల హనుమరెడ్డిపల్లి వద్ద రైతుల లో-వోల్టేజ్ సమస్యపై జరిగిన నిరసనను కూడా ఎమ్మెల్యే ప్రస్తావించారు. రైతుల సమస్య తెలుసుకుని విద్యుత్ శాఖ ఎస్సీతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో లో-వోల్టేజ్ సమస్యలు రాకుండా అవసరమైన సబ్‌స్టేషన్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

రూ.179 కోట్లతో ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీరు అందించే పథకాన్ని ప్రారంభించామని, ప్రతి ఇంటికీ తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే బీటీపీ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

P.Sudhakar, Kalyanadurgam

P.Sudhakar, Kalyanadurgam

Next Story