Nallacheruvu: మహిమ గల రాగి చెంబుల పేరుతో మోసం!
Nallacheruvu: శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువులో మహిమ గల రాగి చెంబుల పేరుతో కోట్ల మోసానికి స్కెచ్. 8 మంది నిందితుల అరెస్ట్, కారు, ఫోన్లు స్వాధీనం.
Nallacheruvu: మహిమ గల రాగి చెంబుల పేరుతో మోసం!
Nallacheruvu: మహిమ గల రాగి చెంబులు పేరుతో అమాయక ప్రజలను నమ్మించి లక్షల రూపాయలు దోచుకునేందుకు సిద్ధమైన ఎనిమిది మంది నిందితులను నల్లచెరువు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 4 రాగి చెంబులు, 2 టార్చ్ లైట్లు, 8 మొబైల్ ఫోన్లు, ఒక మారుతి బలెనో కారు, హోండా మాస్ట్రో స్కూటీతో పాటు రూ.3,200 నగదును స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, IPS ఆదేశాల మేరకు, కదిరి సబ్ డివిజన్ పోలీసు అధికారి జె. శివనారాయణ స్వామి మరియు కదిరి రూరల్ సీఐ పి. నాగేంద్ర పర్యవేక్షణలో, నల్లచెరువు ఎస్ఐ సి.టి. మగ్బుల్ బాషా విశ్వసనీయ సమాచారంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, ఇందుకూరిపల్లి గ్రామ శివారులోని ఫామ్ హౌస్‌పై దాడి నిర్వహించారు.
విచారణలో ప్రధాన నిందితుడు ప్రత్యేక రసాయనాలను రాగి చెంబులపై పూసి, టార్చ్ లైట్‌ను చెంబుకు దగ్గరగా వెలిగించగానే బల్బు ఫిలమెంట్ కాలిపోవడాన్ని "మహిమ"గా ప్రచారం చేస్తూ, ఆ చెంబులకు అతీంద్రియ శక్తులు ఉన్నట్లు నమ్మించి లక్షల రూపాయలకు విక్రయించి అమాయకులను మోసం చేసేందుకు కుట్ర పన్నినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ తరహాలో గతంలో కూడా పలువురిని మోసం చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు తెలిపారు.
నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 318(4) రీడ్ విత్ 3(5) కింద కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.




