Kadiri: కదిరి స్థానిక ఎన్నికల్లో 100% గెలుస్తాం: ఎమ్మెల్యే కందికుంట సవాల్
Kadiri: కదిరి స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% విజయం సాధిస్తామని, టిడ్కో ఇళ్లను మార్చిలోగా లబ్ధిదారులకు అందజేస్తామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు.
Kadiri: కదిరి స్థానిక ఎన్నికల్లో 100% గెలుస్తాం: ఎమ్మెల్యే కందికుంట సవాల్
శ్రీ సత్యసాయి జిల్లా: కదిరిలో జరిగిన టీడీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కీలక వ్యాఖ్యలు. కదిరి మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో 100కు 100 శాతం విజయకేతనం ఎగురవేస్తాం. కదిరిలో మూడోసారి కూటమి అభ్యర్థే మున్సిపల్ చైర్మన్ కాబోతున్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కదిరి నియోజకవర్గంలో వందకు వంద శాతం గెలుస్తాం. ఇది ఓపెన్ ఛాలెంజ్.. దమ్ముంటే వైసీపీ నాయకులు ఎదుర్కోండి. స్థానిక ఎన్నికల తర్వాత కదిరిలో వైసీపీ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది. కూటమికి పట్టం కట్టేందుకు కదిరి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు.
వైసీపీ నేతలు ఇంకా భ్రమల్లోనే బతుకుతున్నారు.. వాస్తవ పరిస్థితుల్లోకి రావడం లేదు. అబద్ధాలు, అవాస్తవాలు ప్రచారం చేస్తూ బతుకుతున్న వైసీపీ నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. కులాలు, మతాలను నమ్ముకుని వైసీపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా ఓర్చుకుంటాను.. ప్రజల కోసం పనిచేయడం మాత్రం ఆపను.
జగన్‌కు సిగ్గు, లజ్జ లేకుండా అబద్ధాలు చెప్పడం అలవాటుగా మారింది. కనులారపకుండా అబద్ధాలు చెప్పడంలో జగన్ ఆరితేరిపోయారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేయదు.. అబద్ధాలు చెప్పదు. పోలవరం, అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం. అందులో భాగంగానే కదిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాం. తలుపుల మండలానికి హంద్రీ–నీవా మెయిన్ బ్రాంచ్ కెనాల్ ద్వారా నీళ్లు అందించిన ఘనత మనకే దక్కుతుంది.
అదే కాలువ ద్వారా పులివెందుల ప్రాంతానికి కూడా నీటిని అందిస్తున్నాం. డీఎస్సీ, ఏపీపీఎస్సీకి తేడా తెలియని వ్యక్తి జగన్. డీఎస్సీ జరగకుండా అడ్డుకునేందుకు కోర్టుల్లో 22 కేసులు వేశారు.. ఆ కేసులను కోర్టులు కొట్టివేశాయి.
ఐదేళ్ల వైసీపీ పాలనలో బటన్ నొక్కడం తప్ప ఒక్క మంచి రోడ్డైనా నిర్మించారా? ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. వైసీపీ చేస్తున్న కుట్రలు, దుష్ప్రచారాలను టీడీపీ శ్రేణులు సమర్థవంతంగా తిప్పికొట్టాలి.
గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీల పేరుతో భారీ అవకతవకలు జరిగాయి. జగనన్న కాలనీల్లో కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేదు. కదిరిలో పెండింగ్‌లో ఉన్న TIDCO ఇళ్లను మార్చిలోగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తాం.
త్వరలోనే ఇంటి పట్టాలతో పాటు పక్కా గృహాలను కూడా మంజూరు చేస్తాం. కదిరి బైపాస్ రోడ్డు పనులను త్వరలోనే పూర్తి చేస్తాం. కొందరు తమ ఆస్తులను అడ్డం పెట్టుకుని అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారు. అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేసినా ప్రజల ప్రయోజనాల కోసం పనులను ముందుకు తీసుకెళ్తాం.
సమాజానికి అన్నం పెట్టే అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా ఉంటాం. వైసీపీ నేతల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. మంచి చేస్తే ప్రజలే ఆదరిస్తారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంపై దిశానిర్దేశం, గత 45 రోజులుగా కొనసాగుతున్న “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమంపై మండలాలు, గ్రామాలు, బూత్‌ల వారీగా సమీక్ష నిర్వహించారు.
కార్యక్రమంలో వెనుకబడిన ప్రాంతాల్లో నాయకులు, కార్యకర్తలు వేగం పెంచాలని సూచించారు. వారంలోగా ప్రతి ఇంటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఆదేశించారు. డోర్ టు డోర్ కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేసి My TDP Appలో వివరాలను అప్లోడ్ చేయాలని సూచించారు.
SIRపై ప్రత్యేక దృష్టి
SIR ప్రక్రియలో ప్రతి నాయకుడు, కార్యకర్త శ్రద్ధగా పనిచేయాలి. ప్రతి ఓటును క్షుణ్ణంగా పరిశీలించాలి. అర్హులైన ఓటర్ల పేర్లు సక్రమంగా ఉన్నాయా, అనర్హమైన లేదా నకిలీ ఓట్లు ఉన్నాయా పరిశీలించాలి. బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలి.
స్థానిక ఎన్నికలే లక్ష్యం
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త పనిచేయాలి. ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి బూత్‌లో కూటమి బలాన్ని పెంచాలి. ప్రజలతో నిరంతరం మమేకమై కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
కదిరి నియోజకవర్గంలో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి విజయకేతనం ఎగురవేయడమే లక్ష్యంగా సమష్టిగా పనిచేయాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.




