అశోక్ గజపతిరాజు భూవివాదంపై విచారణకు ప్రభుత్వం ఆదేశం..
Amaravati: విజయనగరంలో అశోక్ గజపతిరాజు భూవివాదంపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. వైసీపీ ఆఫీస్ నిర్మాణం, అప్పటి తహసీల్దార్ పాత్రపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం.
అశోక్ గజపతిరాజు భూవివాదంపై విచారణకు ప్రభుత్వం ఆదేశం..
అమరావతి: విజయనగరంలో మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు సంబంధించిన భూవివాదంపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విజయనగరం పరిధిలోని మహారాజుపేట సౌత్ వార్డులో సర్వే నంబర్ 569లో ఉన్న 4.74 ఎకరాల భూమిలో సుమారు ఎకరా స్థలాన్ని వైసీపీ నేతలు ఆక్రమించారన్న ఆరోపణలపై ప్రభుత్వం దృష్టి సారించింది.
తనకు సంబంధించిన స్థలంలో అక్రమంగా వైసీపీ జిల్లా కార్యాలయ నిర్మాణం చేపట్టారని ఆరోపిస్తూ అశోక్ గజపతిరాజు గతేడాది విజయనగరం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తన వాదనకు మద్దతుగా భూమికి సంబంధించిన పత్రాలు, ఇతర ఆధారాలను కూడా కలెక్టర్‌కు సమర్పించారు. భూమి యాజమాన్య హక్కులు, సర్వే వివరాలు, నిర్మాణానికి సంబంధించిన అంశాలను పరిశీలించాలని ఆయన కోరారు.
ఈ వ్యవహారంపై ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అశోక్ గజపతిరాజు సమర్పించిన ఆధారాలను పూర్తిస్థాయిలో పరిశీలించి విచారణ చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించింది. భూమి వాస్తవ పరిస్థితి, రికార్డుల్లో ఉన్న వివరాలు, సర్వే హద్దులు, నిర్మాణం చేపట్టిన విధానం తదితర అంశాలను పరిశీలించి వారం రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అంతేకాకుండా ఈ వ్యవహారంలో అప్పటి మండల రెవెన్యూ అధికారి ప్రభాకర్‌రావు పాత్రపైనా విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. భూ రికార్డుల నిర్వహణ, సర్వే, హద్దుల నిర్ధారణ, తదితర అంశాల్లో అప్పటి అధికారుల చర్యలు ఎలా ఉన్నాయన్న దానిపై కూడా విచారణ జరగనుంది.
దీంతో విజయనగరంలో వైసీపీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన భూవివాదం మరోసారి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం ఆదేశించిన విచారణలో భూమి హక్కులకు సంబంధించి ఏ అంశాలు వెలుగులోకి వస్తాయి? అప్పటి రెవెన్యూ అధికారుల పాత్రపై ఎలాంటి నివేదిక వస్తుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.




