చేనేతకు ప్రపంచ స్థాయి గుర్తింపుతో ప్రపంచ చేనేత దినోత్సవానికి బీజేపీ పిలుపు..

Amaravati: విజయవాడలో ప్రపంచ చేనేత దినోత్సవ సమ్మేళనం. చేనేత రంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఎంతో ఉందని పేర్కొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్.

Hari Kishan  AP Bureau Chief
Updated on: 5 Aug 2026 5:27 PM IST
Amaravati
X

చేనేతే భారతీయ సంస్కృతికి ప్రతీక.. నేతన్న సంక్షేమమే లక్ష్యంగా,చేనేతకు ప్రపంచ స్థాయి గుర్తింపుతో ప్రపంచ చేనేత దినోత్సవానికి బీజేపీ పిలుపు..

అమరావతి: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, స్వదేశీ ఆత్మను ప్రపంచానికి పరిచయం చేసిన రంగం ఏదైనా ఉందంటే అది చేనేతేనని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ప్రపంచ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి చేనేత సమ్మేళనంలో ఆయన పాల్గొని చేనేత రంగ ప్రాధాన్యం, నేతన్నల సంక్షేమం, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలపై విస్తృతంగా మాట్లాడారు. భవిష్యత్తులో ఆగస్టు 7ను ప్రపంచ చేనేత దినోత్సవంగా గుర్తించేలా అంతర్జాతీయ స్థాయిలో కృషి జరగాలని ఆయన పిలుపునిచ్చారు.

*చేనేత కేవలం వృత్తి కాదు.. భారతీయ ఆత్మకు ప్రతీక*

చేనేతను కేవలం వస్త్ర తయారీ వృత్తిగా చూడలేమని, అది భారతీయ సంస్కృతి, కళాత్మకత, సంప్రదాయం, స్వావలంబనకు ప్రతీక అని పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. వేల సంవత్సరాలుగా భారతీయ జీవన విధానంలో వస్త్రానికి ప్రత్యేక స్థానం ఉందని, పురాణాల నుంచి చరిత్ర వరకు చేనేతకు విశిష్ట గుర్తింపు లభించిందన్నారు. మార్కండేయ మహర్షి నుంచి దేవతల ఆవిర్భావ కథల వరకు వస్త్రం భారతీయ ఆధ్యాత్మికతలో అంతర్భాగమైందని వివరించారు. 'బంగారు పిచుక'గా భారత్‌కు చేనేతే కారణం ఒకప్పుడు ప్రపంచం భారతదేశాన్ని "బంగారు పిచుక"గా పిలవడానికి మన చేనేత ఉత్పత్తులే ప్రధాన కారణమని మాధవ్ పేర్కొన్నారు.

*భారతీయ నేతన్నలు తయారు చేసిన వస్త్రాలు*

ప్రపంచవ్యాప్తంగా అపారమైన ఆదరణ పొందాయని, దేశ ఆర్థిక వ్యవస్థకు చేనేత రంగం కీలకంగా నిలిచిందన్నారు. ప్రపంచ మార్కెట్లలో భారతీయ వస్త్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉండేదని గుర్తుచేశారు.

*బ్రిటిష్ పాలనలో చేనేతపై దాడులు*

భారత ఆర్థిక వ్యవస్థను బలహీనపర్చడానికి బ్రిటిష్ పాలకులు ముందుగా లక్ష్యంగా చేసుకున్న రంగం చేనేతేనని ఆయన పేర్కొన్నారు. నేతన్నలపై అధిక పన్నులు విధించడం, మగ్గాలను ధ్వంసం చేయడం, బెంగాల్ ప్రాంత నేతన్నల బొటనవేళ్లు నరికివేసిన ఘటనలు చరిత్రలో నిలిచిపోయాయని అన్నారు. అయినప్పటికీ భారతీయ చేనేతను పూర్తిగా నాశనం చేయలేకపోయారని, నేతన్నల ఆత్మవిశ్వాసమే ఈ రంగాన్ని నిలబెట్టిందన్నారు.

*స్వదేశీ ఉద్యమానికి చేనేతే బలం*

1905లో ప్రారంభమైన స్వదేశీ ఉద్యమం భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక మలుపు తీసుకువచ్చిందని మాధవ్ వివరించారు. విదేశీ వస్త్రాలను బహిష్కరించి స్వదేశీ చేనేతను ప్రోత్సహించడం ద్వారా జాతీయోద్యమానికి కొత్త ఊపు వచ్చిందన్నారు. మహాత్మా గాంధీ చరఖాను స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రతీకగా మార్చారని, అందుకే ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటున్నామని చెప్పారు.

*ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ చేనేత వైభవం*

ఆంధ్రప్రదేశ్ చేనేతకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని ఆయన తెలిపారు. ధర్మవరం పట్టు చీరలు, పొందూరు ఖాదీ, వెంకటగిరి చీరలు, మంగళగిరి వస్త్రాలు, ఉప్పాడ చీరలు, చీరాల చేనేత, బొబ్బిలి ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా భారతీయ కళా సంపదను చాటుతున్నాయని చెప్పారు. ప్రతి ప్రాంతానికీ ప్రత్యేకమైన నైపుణ్యం, సంప్రదాయం ఉండటం చేనేత వైవిధ్యానికి నిదర్శనమన్నారు.

*మహిళల పాత్ర అమూల్యం*

పత్తి నుంచి వస్త్రం తయారయ్యే ప్రతి దశలో మహిళల కృషి ఎంతో కీలకమని మాధవ్ పేర్కొన్నారు. చేనేత రంగం గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించడమే కాకుండా ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతోందన్నారు. మహిళా సాధికారతలో చేనేత రంగం ముఖ్య పాత్ర పోషిస్తోందని అభిప్రాయపడ్డారు.

*కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు*

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో చేనేత రంగ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ముద్ర రుణాలు, బున్కర్ సంక్షేమ పథకాలు, డిజిటల్ మార్కెటింగ్ వేదికలు, ఈ-కామర్స్ అవకాశాల ద్వారా నేతన్నలకు కొత్త మార్కెట్లు అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. సంప్రదాయ చేనేతను ఆధునిక సాంకేతికతతో అనుసంధానం చేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.

కూటమి ప్రభుత్వ సహకారం

*ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కూడా చేనేత*

కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని మాధవ్ పేర్కొన్నారు. చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సహాయం, ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా నేతన్నలకు అండగా నిలుస్తోందన్నారు. చేనేత రంగం అభివృద్ధికి కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు.

*ధర్మవరం మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్‌తో కొత్త ఆశలు*

అనంతపురం జిల్లా ధర్మవరంలో ఏర్పాటు కానున్న దక్షిణ భారతదేశపు తొలి మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ చేనేత రంగానికి కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉత్పత్తి, నిల్వ, మార్కెటింగ్, ఎగుమతులకు ఒకే వేదిక లభించడం వల్ల నేతన్నలకు మెరుగైన ఆదాయం వచ్చే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.

*ప్రపంచ చేనేత దినోత్సవానికి అడుగులు*

ప్రస్తుతం ఆగస్టు 7ను భారతదేశంలో జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటున్నప్పటికీ, దీనిని ప్రపంచ చేనేత దినోత్సవంగా గుర్తించే దిశగా భారత ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థలు చర్యలు చేపట్టాలని మాధవ్ సూచించారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ చేనేతకు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఈ దిశగా కృషి అవసరమన్నారు.

*యువతకు పిలుపు*

చేనేత రంగం భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని మాధవ్ అన్నారు. ఆధునిక డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా, ఈ-కామర్స్ వేదికలను వినియోగించి భారతీయ చేనేతను ప్రపంచ మార్కెట్లకు తీసుకెళ్లాలని యువతకు పిలుపునిచ్చారు. సంప్రదాయాన్ని ఆధునికతతో మేళవిస్తే చేనేతకు కొత్త శకం ప్రారంభమవుతుందని అభిప్రాయపడ్డారు.

*పోతుల సునీత సూచనలు*

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతుల సునీత మాట్లాడుతూ, చేనేత దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగాల్లో ఒకటని పేర్కొన్నారు. ముఖ్యంగా చీరాల ప్రాంత నేతన్నలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారికి మార్కెట్ అవకాశాలు, ముడిసరుకు అందుబాటు, పవర్‌లూమ్ పోటీ నుంచి రక్షణ అవసరమని అన్నారు. పత్తి రైతులకు ప్రోత్సాహం పెంచితే చేనేత రంగానికి మరింత బలం చేకూరుతుందని సూచించారు. ముద్ర రుణాలు వంటి కేంద్ర పథకాలను నేతన్నలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

*భారీ ర్యాలీతో చేనేతకు మద్దతు*

ప్రపంచ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని రాఘవయ్య పార్క్ నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు నేతన్నలతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ భారీ ర్యాలీ నిర్వహించారు. చేనేత ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, స్వదేశీ వస్త్రాల ప్రాముఖ్యతను చాటి చెప్పే నినాదాలతో ర్యాలీ సాగింది.

*విస్తృతంగా పాల్గొన్న బీజేపీ నాయకులు*

బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, బిట్రా శ్రీమన్నారాయణ, వావిలాల సరళాదేవి, సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, నాగోతు రమేష్ నాయుడు, గుడిసె దేవానంద్, జగ్గరపు శ్రీనివాసరావు, చల్లపల్లి శ్రీనివాసరావు, వీరాంజనేయ ప్రసాద్, పనతల సురేష్, సయ్యద్ బాషా, యామినీ శర్మతో పాటు పలువురు నేతలు, చేనేత కార్మికులు, నేతన్న కుటుంబాలు పాల్గొన్నారు.

*చేనేతకు గుర్తింపు.. నేతన్నలకు భరోసా*

చేనేతను భారతీయ సంస్కృతి, స్వదేశీ స్ఫూర్తి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రతీకగా నిలబెట్టే క్రమంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను బీజేపీ నాయకత్వం ప్రస్తావించింది. చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లు, డిజిటల్ అవకాశాలు, సంక్షేమ పథకాలు, యువత భాగస్వామ్యంతో ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని సమ్మేళనంలో పిలుపునిచ్చారు. ప్రపంచ చేనేత దినోత్సవం ప్రకటన దిశగా కృషి చేయాలన్న డిమాండ్ ఈ సమావేశంలో ప్రధానంగా వినిపించింది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story