Amaravathi: వెలిగొండ ప్రాజెక్టు కల సాకారం – మంత్రి అచ్చెన్నాయుడు హర్షం!

Amaravathi: మూడు దశాబ్దాల వెలిగొండ ప్రాజెక్టు కల సాకారమైందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం.

Hari Kishan  AP Bureau Chief
Published on: 31 Aug 2026 11:05 AM IST
Amaravathi
X

Amaravathi: వెలిగొండ ప్రాజెక్టు కల సాకారం – మంత్రి అచ్చెన్నాయుడు హర్షం!

Amaravathi: మూడు దశాబ్దాలుగా కరువు ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల సాకారం కావడం చారిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. 1996లో వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగానే ప్రాజెక్టు జాతికి అంకితం కావడం ప్రత్యేకతగా పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీరందించాలన్న సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవకు వెలిగొండ ప్రాజెక్టు నిలువెత్తు నిదర్శనమని తెలిపారు.

వెలిగొండ ప్రాజెక్టుతో కరువు ప్రాంత రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సుమారు 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే మహత్తర ప్రాజెక్టుగా వెలిగొండను అభివర్ణించారు. ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాల్లోని రైతులకు ఈ ప్రాజెక్టు వరప్రదాయినిగా మారనుందని చెప్పారు. కృష్ణా నది వరద జలాలను కరువు నేలకు మళ్లించడం ద్వారా రైతుల పొలాలకు జీవం పోస్తున్నామని అన్నారు.

వెలిగొండ ప్రాజెక్టు కేవలం సాగునీటిని అందించడానికే పరిమితం కాదని, కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లోని లక్షలాది మందికి తాగునీటి భరోసా కల్పించే ప్రాజెక్టు అని మంత్రి తెలిపారు. ప్రాజెక్టు ద్వారా చెరువులు నిండడంతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయని, వ్యవసాయానికి కొత్త ఊపు వస్తుందని చెప్పారు. నీటి లభ్యత పెరగడంతో పంటల సాగు విస్తీర్ణం పెరిగి రైతుల ఆదాయానికి కూడా ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.

ఏళ్ల తరబడి కరువుతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల నుంచి ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు జరుగుతున్న వలసలకు వెలిగొండ శాశ్వత పరిష్కారం చూపే జీవనరేఖగా మారుతుందని అచ్చెన్నాయుడు అన్నారు. సాగునీరు అందుబాటులోకి రావడంతో వ్యవసాయంపై ఆధారపడే కుటుంబాలకు స్థిరమైన ఉపాధి లభిస్తుందని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో ప్రాంతీయ అభివృద్ధికి కూడా వెలిగొండ దోహదపడుతుందని చెప్పారు.

ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన నిర్వాసిత కుటుంబాల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని మంత్రి వెల్లడించారు. కేవలం 48 రోజుల్లోనే నిర్వాసిత కుటుంబాలకు రూ.762 కోట్ల పరిహారం అందించడం సీఎం చంద్రబాబు చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయడంతో పాటు ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని చెప్పారు.

రైతుల ఆశలు, ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తున్న ప్రాజెక్టు వెలిగొండ అని అచ్చెన్నాయుడు అన్నారు. సాగునీరు, తాగునీరు, ఉపాధి, ప్రాంతీయ అభివృద్ధికి వెలిగొండ కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు. వెలిగొండ ప్రారంభోత్సవం కేవలం ఒక ప్రాజెక్టు ప్రారంభం కాదని, కరువు సీమ భవిష్యత్తును మార్చే చారిత్రాత్మక ఘట్టమని మంత్రి స్పష్టం చేశారు. మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ వెలిగొండ ప్రాజెక్టు ప్రజలకు అంకితం కావడం కరువు ప్రాంతాల్లో కొత్త ఆశలకు బాటలు వేస్తుందని తెలిపారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story