శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు..

Amaravati: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంత్రులు ఆనం, అనగాని, అనిత సమీక్ష. భక్తుల భద్రత, వసతి, తాగునీరు వంటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి.

Hari Kishan  AP Bureau Chief
Published on: 12 Sept 2026 7:43 PM IST
Amaravati
X

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు..

అమరావతి: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. భక్తుల భద్రత, సౌకర్యాలకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు...

సచివాలయంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, హోం మంత్రి వంగలపూడి అనిత, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో కలిసి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లు, భద్రతా చర్యలపై సమగ్రంగా చర్చించారు.

ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. పట్టువస్త్రాల సమర్పణతో పాటు ధ్వజారోహణం, వాహన సేవలు, చక్రస్నానం వంటి ప్రధాన కార్యక్రమాల సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున దర్శనం, క్యూలైన్లు, తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుధ్యం, వైద్య సేవలు, అత్యవసర సేవలు, వసతి, రవాణా, లగేజీ నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి ఆనం సూచించారు. అవసరమైన చోట అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి, రద్దీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు. భక్తులకు సులభమైన, సురక్షితమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు.

ముఖ్యమంత్రి పట్టువస్త్రాల సమర్పణ సందర్భంగా భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేయాలని మంత్రి సూచించారు. ముఖ్యమంత్రి కార్యక్రమం, సాధారణ భక్తుల దర్శనాలు ఒకదానికొకటి ఆటంకం కలగకుండా సమన్వయం చేసుకోవాలని తెలిపారు. పోలీస్, విజిలెన్స్, టీటీడీ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

బ్రహ్మోత్సవాల సమయంలో సోషల్ మీడియాలో అసత్య ప్రచారం, వదంతులు వ్యాప్తి చెందకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. అధికారిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు భక్తులకు, ప్రజలకు చేరవేయాలని, తప్పుడు ప్రచారాన్ని వెంటనే గుర్తించి ఖండించాలని చెప్పారు. దర్శన సమయాలు, రద్దీ, రవాణా, వసతి తదితర అంశాలపై వాస్తవ సమాచారాన్ని ప్రజలకు అందించడంలో మీడియా సహకరించాలని కోరారు.

అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం, వసతి, తాగునీరు, వైద్య సేవలు, పారిశుధ్యం వంటి ప్రాథమిక సౌకర్యాల్లో ఎలాంటి కొరత లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. రద్దీకి అనుగుణంగా అన్నప్రసాద కేంద్రాల్లో ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రసాదాల లభ్యతను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

బ్రహ్మోత్సవాల విజయవంతమైన నిర్వహణకు టీటీడీ, పోలీస్, విజిలెన్స్, రెవెన్యూ, జిల్లా యంత్రాంగం, వైద్య, పారిశుధ్య, రవాణా తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రులు స్పష్టం చేశారు. సమావేశంలో టీటీడీ ఈవో, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి, తిరుపతి జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితర అధికారులు పాల్గొని ఏర్పాట్లపై వివరాలు అందించారు....

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.