Amaravati: సత్యకుమార్‌కు బీజేపీ కీలక బాధ్యతలు!
Amaravati: ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై బీజేపీ 'సేవా సంకల్ప్ అభియాన్'. దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్‌గా ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ నియామకం.
Amaravati: సత్యకుమార్‌కు బీజేపీ కీలక బాధ్యతలు!
Amaravati: ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’కు సన్నాహాలు ముమ్మరమయ్యాయి. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమానికి దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయ నేత సత్యకుమార్ యాదవ్‌ను పార్టీ జాతీయ నాయకత్వం నియమించింది. దీంతో సత్యకుమార్‌కు బీజేపీలో మరో కీలక బాధ్యత దక్కినట్టయింది.
ప్రజాసేవ, దేశాభివృద్ధి, వికసిత్ భారత్–2047 సంకల్పాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’కు రూపకల్పన చేశారు. బీజేపీ, ఎన్డీయే ప్రభుత్వాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రజా సంక్షేమ, సేవా కార్యక్రమాలను ఈ నెల రోజుల పాటు నిర్వహించనున్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాలు, దేశాభివృద్ధిలో గత 25 ఏళ్లుగా ప్రధాని మోదీ చేసిన కృషిని ప్రజలకు వివరించేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.
ఈ అభియాన్‌లో భాగంగా ప్రజా భాగస్వామ్యాన్ని పెంచేందుకు పలు వినూత్న కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ‘ఆశీర్వాద్ కా దియా’, ‘నమో సేవా గాథ’, ‘ఆంగన్ కా ఉత్సవ్’, ‘కహానీ బద్లావ్ కి’, ‘సేవా జ్యోతి యాత్ర’ వంటి కార్యక్రమాల ద్వారా సేవా భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు వివిధ వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తూ సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్‌గా నియమితులైన సత్యకుమార్‌పై కీలక బాధ్యతలు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో అభియాన్ కార్యక్రమాల ప్రణాళిక, సమన్వయం, అమలు తీరును పర్యవేక్షించడంతో పాటు రాష్ట్రాల మధ్య సమన్వయం సాధించాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేస్తూ కార్యక్రమాలు విస్తృత స్థాయిలో జరిగేలా చూడాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో తమిళనాడులోని తిరుచిరాపల్లిలో మరికాసేపట్లో జరగనున్న రాష్ట్రవ్యాప్త కార్యశాలలో మంత్రి సత్యకుమార్ పాల్గొననున్నారు. అభియాన్ నిర్వహణ, కార్యక్రమాల రూపకల్పన, ప్రజా భాగస్వామ్యం, రాష్ట్రాల వారీగా చేపట్టాల్సిన సేవా కార్యక్రమాలపై ఈ కార్యశాలలో చర్చించే అవకాశం ఉంది.
ఇప్పటికే ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సత్యకుమార్‌కు బీజేపీ జాతీయ స్థాయిలో వరుసగా కీలక బాధ్యతలు అప్పగిస్తోంది.
ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ‘సేవా సంకల్ప్ అభియాన్’ను విజయవంతం చేసే బాధ్యతను అప్పగించడం ద్వారా ఆయనపై పార్టీ నాయకత్వం ఉంచిన నమ్మకం మరోసారి స్పష్టమైంది. నెల రోజుల పాటు జరగనున్న ఈ అభియాన్ ద్వారా మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని ప్రజలతో అనుసంధానిస్తూ, సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.




