AP: ప్రజల అసెంబ్లీగా శాసనసభ.. స్వాతంత్ర్య వేడుకల్లో ప్రజల భాగస్వామ్యం!
AP: అమరావతి శాసనసభ విద్యుత్ దీపాలంకరణలను ప్రజలు స్వయంగా వీక్షించేందుకు అనుమతి కల్పించామని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటేందుకే ఈ నిర్ణయమని డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు తెలిపారు.
AP: ప్రజల అసెంబ్లీగా శాసనసభ.. స్వాతంత్ర్య వేడుకల్లో ప్రజల భాగస్వామ్యం!
AP: స్వాతంత్ర్య వేడుకలను కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజల పండుగగా నిర్వహించాలన్న ఆలోచనకు అమరావతి అసెంబ్లీ వేదికగా నిలుస్తోంది. శాసనసభను విద్యుత్ దీపాలతో అలంకరించడంతో పాటు, ప్రజలందరినీ స్వాతంత్ర్య వేడుకల్లో భాగస్వామ్యం చేయాలన్న స్పీకర్ ఆలోచనకు ఊహించిన దానికంటే మంచి స్పందన లభించిందని డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు (RRR) తెలిపారు.
సాధారణంగా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అసెంబ్లీ భవనం విద్యుత్ దీపాలంకరణతో మెరిసిపోతుంటుందని, అయితే ఈసారి ప్రజలను కూడా వేడుకల్లో భాగస్వాములను చేయాలన్న సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టామని ఆయన చెప్పారు. ప్రజల కోసం అసెంబ్లీ ద్వారాలను తెరవడం మంచి సంప్రదాయానికి నాంది పలుకుతుందన్నారు.
ఈ రెండు రోజుల పాటు ప్రజల కోసం అసెంబ్లీ ప్రాంగణం అందుబాటులో ఉంటుందని తెలిపారు. విద్యార్థులు, యువత, కుటుంబాలతో కలిసి వచ్చే ప్రజలు శాసనసభ ప్రాంగణాన్ని సందర్శించి స్వాతంత్ర్య వేడుకల వాతావరణాన్ని ఆస్వాదించే అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు.
ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు సమావేశమయ్యే శాసనసభను ప్రజలంతా తమదిగా భావించేలా చేయాలన్నదే ఈ కార్యక్రమం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని RRR పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు అసెంబ్లీ ప్రతీక అని, ప్రజలకు దాని పట్ల మరింత అనుబంధం పెంచేలా ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ కలిసి వేడుకలు జరుపుకోవాలన్న మంచి ఆలోచనతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారని తెలిపారు. ప్రజలను ప్రజాస్వామ్య వ్యవస్థతో మరింత మమేకం చేసే ఈ కొత్త సంప్రదాయాన్ని స్వాగతించాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రజల కోసం అసెంబ్లీ తలుపులు తెరుచుకోవడం కేవలం ఒక కార్యక్రమం కాదని.. ప్రజాస్వామ్యానికి ప్రజలే యజమానులన్న భావనను మరింత బలపరిచే ప్రయత్నమని RRR అభిప్రాయపడ్డారు. ప్రజల భాగస్వామ్యంతో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.




