Amaravati: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్రకు కొత్త రెక్కలు!
Amaravati: భోగాపురం విమానాశ్రయంలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కావడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఇదో కీలక ఘట్టమని వెల్లడి.
Amaravati: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్రకు కొత్త రెక్కలు!
Amaravati: ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రెక్కలు తొడిగిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. విమానాశ్రయంలో నేటి నుంచి సేవలు ప్రారంభం కావడం రాష్ట్ర అభివృద్ధి చరిత్రలో ఒక కీలక ఘట్టమని పేర్కొన్నారు.
హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం భోగాపురం విమానాశ్రయంలో విజయవంతంగా ల్యాండ్ కావడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయం కల సాకారం కావడం గర్వించదగ్గ విషయమన్నారు.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో ఈ విమానాశ్రయం నిర్మితమవడం ప్రత్యేకమైన విషయమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇది కేవలం రవాణా సౌకర్యాలను పెంచే విమానాశ్రయం మాత్రమే కాదని, ఉత్తరాంధ్ర ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాల అభివృద్ధికి కీలక కేంద్రంగా మారుతుందని అన్నారు.
భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రకు పెట్టుబడులు మరింతగా వచ్చే అవకాశాలు పెరుగుతాయని పవన్ కళ్యాణ్ అన్నారు. కొత్త పరిశ్రమలు, వ్యాపారాలు, పర్యాటక ప్రాజెక్టులు ఏర్పడితే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. యువత భవిష్యత్తుకు ఈ విమానాశ్రయం ఒక కొత్త అవకాశాల ద్వారం కావాలని ఆకాంక్షించారు.
ఉత్తరాంధ్రలో ఉన్న సహజ వనరులు, సముద్రతీరం, గిరిజన ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలను ప్రపంచానికి మరింత చేరువ చేయడంలో భోగాపురం విమానాశ్రయం కీలక పాత్ర పోషిస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. విమాన కనెక్టివిటీ పెరగడంతో స్థానికంగా వ్యాపారాలు, హోటళ్లు, రవాణా, సేవా రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయని తెలిపారు.
అభివృద్ధి ఫలాలు కేవలం నగరాలకే పరిమితం కాకుండా గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలకు కూడాచేరాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఉత్తరాంధ్ర యువతకు స్థానికంగానే మెరుగైన అవకాశాలు కల్పించే దిశగా ఈ మౌలిక వసతులు ఉపయోగపడాలని చెప్పారు.
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే అత్యుత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా ఎదగాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు, సేవలు అందిస్తూ దినదినాభివృద్ధి చెందాలని కోరుకున్నారు.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం మరింత వేగంగా అభివృద్ధి చెందాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.




