Amaravathi: వరదలు: ఏపీ యాత్రికుల భద్రతపై మంత్రి నారా లోకేష్ సమీక్ష!

Amaravathi: నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై మంత్రి నారా లోకేష్ సమీక్ష. నలుగురు సురక్షితం; ముగ్గురి ఆచూకీ కోసం కేంద్రంతో సమన్వయానికి అధికారుల ఆదేశం.

Hari Kishan  AP Bureau Chief
Updated on: 27 Aug 2026 12:39 PM IST
Amaravathi
X

Amaravathi: వరదలు: ఏపీ యాత్రికుల భద్రతపై మంత్రి నారా లోకేష్ సమీక్ష!

Amaravathi: నేపాల్‌లో వరదల కారణంగా చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికుల క్షేమ సమాచారంపై మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. నేపాల్‌లో చిక్కుకున్న ఏడుగురు ఏపీ యాత్రికుల పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన.. వారి భద్రత, ఆచూకీ కోసం చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు. యాత్రికుల కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఏడుగురు ఏపీ యాత్రికుల్లో నలుగురు సురక్షితంగా ఉన్నట్లు ఏపీ ఢిల్లీ భవన్ అధికారులు మంత్రికి వివరించారు. అయితే మరో ముగ్గురి ఆచూకీ ఇంకా లభించలేదని తెలిపారు. కుప్పం ప్రాంతానికి చెందిన బాల సుబ్రహ్మణ్యం, ఈషా ఫౌండేషన్ గ్రూప్‌కు చెందిన శశికుమార్, రాజ్యలక్ష్మీల ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

మిస్సైన ముగ్గురి ఆచూకీని వీలైనంత త్వరగా కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వినియోగించి యాత్రికుల జాడను గుర్తించాలని సూచించారు. ముఖ్యంగా శశికుమార్ చివరిసారిగా చైనాలోని గైరోంగ్ ఎంబసీ వద్ద కనిపించినట్లు అధికారులు వెల్లడించడంతో.. ఆయన కదలికలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పారు.

మరోవైపు కైలాస మానససరోవర యాత్రకు వెళ్లి నేపాల్ వరదల ప్రభావానికి గురైన కర్నూలు జిల్లాకు చెందిన భాస్కర్ శాస్త్రితో పాటు మరో ముగ్గురు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సురక్షితంగా ఉన్న యాత్రికులను వీలైనంత త్వరగా అక్కడి నుంచి తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని లోకేష్ స్పష్టం చేశారు. వారి ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

యాత్రికుల భద్రతపై భారత రాయబార కార్యాలయం, చైనా, నేపాల్ ఎంబసీలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గైరోంగ్ ఇమ్మిగ్రేషన్ సెంటర్, ఈషా ఫౌండేషన్ సంస్థలతోనూ సమన్వయం చేసుకుంటూ యాత్రికుల సమాచారం సేకరించాలని సూచించారు. పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు సమాచార సేకరణ, సమన్వయ చర్యలను కొనసాగించాలని స్పష్టం చేశారు.

మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేపాల్‌లో చిక్కుకున్న యాత్రికులతో పాటు కైలాస మానససరోవర యాత్రకు వెళ్లిన ఏపీ వాసుల వివరాలను సేకరిస్తోంది. రాష్ట్ర రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) అధికారులు వివిధ మార్గాల్లో సమాచారం సేకరిస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ఈ వ్యవహారాన్ని ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ నిరంతరం మానిటర్ చేస్తున్నారు.

నేపాల్‌లో వరదల పరిస్థితి, రవాణా మార్గాల పరిస్థితి, యాత్రికుల క్షేమ సమాచారం తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర అధికారులు ముందుకు సాగుతున్నారు. ఆచూకీ లభించని ముగ్గురి జాడను గుర్తించడంతో పాటు.. సురక్షితంగా ఉన్న నలుగురు యాత్రికులను స్వస్థలాలకు చేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోంది. యాత్రికుల కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూ, వారి భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు స్పష్టం చేశారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story