Anantapur: అనంతపురంలో రూ.10 వేల కోట్లతో సుజ్లాన్ విండ్ పవర్ ప్రాజెక్ట్!
Anantapur: అనంతపురం జిల్లాలో సుజ్లాన్ సంస్థ రూ.10,000 కోట్ల పెట్టుబడితో 1,325 MW పవన విద్యుత్ ప్రాజెక్టులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు.
Anantapur: అనంతపురంలో రూ.10 వేల కోట్లతో సుజ్లాన్ విండ్ పవర్ ప్రాజెక్ట్!
Anantapur: అనంతపురం జిల్లాలో భారీ స్థాయిలో పవన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బళ్లారి పర్యటనకు చేరుకున్నారు. బళ్లారిలోని జిందాల్ విజయ్ నగర్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మంత్రి లోకేష్‌కు కర్ణాటక మంత్రి నాగేంద్ర, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీలు బీకే పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు ప్రసాద్, అమిలినేని సురేంద్రబాబు, పల్లె సింధూర రెడ్డి, ఏపీఐఐసీ డైరెక్టర్ చల్లా లక్ష్మీ ప్రసాద్, టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉమర్‌తో పాటు పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
బళ్లారి పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ కాసేపట్లో బళ్లారి మండలం హలకుందిలోని సుజ్లాన్ బ్లేడ్ స్టాక్ యార్డును సందర్శించనున్నారు. అక్కడ పవన విద్యుత్ రంగంలో సుజ్లాన్ సంస్థ చేపడుతున్న కార్యకలాపాలను పరిశీలించనున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలం హులికెర గ్రామంలో ఏర్పాటు చేయనున్న సుజ్లాన్ విండ్ పవర్ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు.
పవన విద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు సుజ్లాన్ సంస్థకు చెందిన S144 న్యూ బ్లేడ్ ప్రొడక్షన్ లైన్స్ను కూడా మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అనంతపురం జిల్లాలో పునరుత్పాదక ఇంధన రంగానికి మరింత ఊతం లభించనుందని ప్రభుత్వం భావిస్తోంది.
అనంతపురం జిల్లాలో సుజ్లాన్ సంస్థ సుమారు రూ.10 వేల కోట్ల పెట్టుబడితో 1,325 మెగావాట్ల సామర్థ్యంతో పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. భారీ పెట్టుబడులతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగం అభివృద్ధికి కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా రాయదుర్గం ప్రాంతంలో విండ్ పవర్ సామర్థ్యాన్ని వినియోగించుకోవడంతో పాటు స్థానికంగా పారిశ్రామిక, ఆర్థిక కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 4 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. పవన విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ, అనుబంధ కార్యకలాపాలతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. అదే సమయంలో పునరుత్పాదక ఇంధన రంగంలో కొత్త పెట్టుబడులకు అనంతపురం జిల్లా కేంద్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పరిశ్రమల ఏర్పాటుతో పాటు స్థానికంగా మౌలిక వసతుల అభివృద్ధి, రవాణా, సేవా రంగాల విస్తరణకు కూడా ఊతం లభించనుంది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడం, యువతకు పెద్దఎత్తున ఉపాధి కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్న నేపథ్యంలో సుజ్లాన్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఏర్పడింది.
బళ్లారి పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ చేపట్టనున్న ఈ కార్యక్రమాలు అనంతపురం జిల్లాలో పునరుత్పాదక ఇంధన రంగానికి కొత్త దిశను చూపించనున్నాయి. రూ.10 వేల కోట్ల భారీ పెట్టుబడితో 1,325 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఏర్పాటవుతుండటంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి మరింత ఊపు వస్తుందని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.




