Amaravati: బీసీ రక్షణ చట్టం, 34% రిజర్వేషన్ల దిశగా కూటమి అడుగులు..మంత్రి!
Amaravati: బీసీ భవన్‌లో బీసీ రక్షణ చట్టంపై మంత్రి సవిత అవగాహన సదస్సు. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు, ఆదరణ 3.0 అమలుకు ప్రభుత్వం సన్నాహాలు.
Amaravati: బీసీ రక్షణ చట్టం, 34% రిజర్వేషన్ల దిశగా కూటమి అడుగులు..మంత్రి!
Amaravati: బీసీల ఆత్మగౌరవం, సామాజిక భద్రతకు మరింత భరోసా కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందని మంత్రి సవిత అన్నారు. విజయవాడ గొల్లపూడిలోని బీసీ భవన్‌లో ఆమె నేతృత్వంలో బీసీ రక్షణ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణతో పాటు వివిధ బీసీ సంక్షేమ కార్పొరేషన్ల చైర్మన్లు ఈ సదస్సులో పాల్గొన్నారు.
బీసీలను కులం, వృత్తుల పేరుతో అవమానించడం, దూషించడం, సామాజికంగా బహిష్కరించడం వంటి ఘటనలకు అడ్డుకట్ట వేసేలా బీసీ రక్షణ చట్టాన్ని రూపొందిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. బీసీలపై జరిగే అన్యాయాలకు చట్టపరమైన రక్షణ కల్పించడంతో పాటు బాధితులకు సత్వర న్యాయం అందేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఇందులో భాగంగా జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసే అంశాన్ని ప్రతిపాదిస్తున్నామని, కేసుల దర్యాప్తు రెండు నెలల్లో పూర్తయ్యేలా నిబంధనలు రూపొందిస్తున్నామని వెల్లడించారు.
చట్టం తీసుకురావడం మాత్రమే కాకుండా అది న్యాయస్థానాల్లోనూ నిలబడేలా అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని మంత్రి చెప్పారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల అభిప్రాయాలను తీసుకున్నామని, తాజాగా రాష్ట్రంలోని 156 బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేషన్ల చైర్మన్ల నుంచి కూడా సూచనలు, అభిప్రాయాలు సేకరించామని తెలిపారు. బీసీ వర్గాల నుంచి వచ్చే సూచనలను పరిగణనలోకి తీసుకుని చట్టాన్ని మరింత పటిష్టంగా రూపొందిస్తామని స్పష్టం చేశారు.
బీసీలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక గుర్తింపు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మంత్రి సవిత పేర్కొన్నారు. బీసీల ఆత్మగౌరవం పెరిగేలా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. గతంలో బీసీలు కోల్పోయిన స్థానిక సంస్థల పదవులను తిరిగి వారికి అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను గత వైసీపీ ప్రభుత్వం 24 శాతానికి పరిమితం చేసిందని మంత్రి విమర్శించారు. ఇప్పుడు బీసీలకు తిరిగి 34 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బీసీల ఆర్థిక సాధికారత కోసం ఆదరణ 3.0ను త్వరలో అమలు చేస్తామని మంత్రి ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 90 శాతం అమలు చేశామని, ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అత్యధికంగా లబ్ధి పొందుతున్న వర్గాల్లో బీసీలు ముందున్నారని చెప్పారు.
బీసీలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా అన్ని రంగాల్లోనూ సాధికారత సాధించే స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు. బీసీ రక్షణ చట్టం, 34 శాతం రిజర్వేషన్ల అమలుకు చర్యలు తీసుకుంటున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌కు వివిధ బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు ధన్యవాదాలు తెలిపారు.




