పొగాకు రైతులకు అండగా ప్రభుత్వం... సిండికేట్‌పై కఠిన హెచ్చరిక
Amaravati: పొగాకు రైతులకు న్యాయమైన ధరలు అందేలా ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు. ఉన్నతస్థాయి టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు.
పొగాకు రైతులకు అండగా ప్రభుత్వం... సిండికేట్‌పై కఠిన హెచ్చరిక
అమరావతి: వర్జీనియా పొగాకు కొనుగోళ్లలో రైతులకు న్యాయమైన ధరలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. పొగాకు కొనుగోళ్ల పరిస్థితిపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్నతస్థాయి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, టొబాకో బోర్డు ఛైర్మన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ జిలానీ తదితరులు పాల్గొన్నారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పొగాకు ఆక్షన్ ప్లాట్‌ఫారమ్‌లను వెంటనే ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. ప్రతి కొనుగోలు సంస్థ తప్పనిసరిగా వేలంలో పాల్గొనాలని స్పష్టం చేశారు. రైతులు తీసుకొచ్చిన ప్రతి గ్రేడ్ పొగాకును కొనుగోలు చేయాలని, మంచి నాణ్యత ఉన్న బేల్స్‌పైనా ఉద్దేశపూర్వకంగా ధరలు తగ్గించే ప్రయత్నాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కంపెనీలు పరస్పరం కుమ్మక్కై సిండికేట్‌గా వ్యవహరిస్తే ఏమాత్రం సహించబోమని, అలాంటి ఘటనలు నిర్ధారణ అయితే టొబాకో బోర్డు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పొగాకు కొనుగోళ్లలో రిజెక్షన్ రేటు తగ్గించడంపై కూడా మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. రైతులు తీసుకొచ్చిన పొగాకును అనవసరంగా తిరస్కరించే పరిస్థితులు లేకుండా చూడాలని టొబాకో బోర్డుకు సూచించారు. కొనుగోలు ప్రక్రియ మొత్తం పారదర్శకంగా సాగాలని, ప్రతి ఆక్షన్ ప్లాట్‌ఫారమ్‌పై అధికారులు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహించాలని సూచించారు.
రైతులు కూడా టొబాకో బోర్డు సూచనలను పాటిస్తూ నిర్ణయించిన ఆక్షన్ ప్లాట్‌ఫారమ్‌లకే తమ పొగాకును తీసుకురావాలని ప్రభుత్వం కోరింది. అలా చేస్తే పోటీ వాతావరణంలో మంచి ధరలు లభించడంతో పాటు రిజెక్షన్ రేటు కూడా తగ్గే అవకాశం ఉంటుందని మంత్రి వివరించారు. మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వెంటనే అమ్మకుండా నిల్వ ఉంచాలనుకునే రైతులకు కూడా ప్రభుత్వం అండగా నిలవనుంది. టొబాకో బోర్డు, బ్యాంకర్లతో చర్చించి అవసరమైన రుణ సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పొగాకు రైతుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని మంత్రి అచ్చెన్నాయుడు మరోసారి స్పష్టం చేశారు. కొనుగోళ్ల ప్రక్రియను సహచర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు స్వయంగా పరిశీలిస్తున్నారని తెలిపారు. ఆక్షన్‌లలో ఎక్కడైనా అక్రమాలు, ధరల నియంత్రణ లేదా సిండికేట్ చర్యలు కనిపిస్తే వెంటనే టొబాకో బోర్డు దృష్టికి తీసుకెళ్లి కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. రైతులకు న్యాయమైన ధర అందే వరకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని, పొగాకు కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు సహించబోమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.




