Amaravati: పొగాకు రైతులకు భరోసా.. మార్కెట్‌లో మెరుగైన పరిస్థితులు!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో పొగాకు వేలంలో మెరుగవుతున్న పరిస్థితులు. 'నో-బిడ్'లు తగ్గి ధరలు పెరుగుతున్నాయని, వచ్చే ఏడాది సాగు పరిమితిని 81 మిలియన్ కిలోలకు తగ్గించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి.
Amaravati: పొగాకు రైతులకు భరోసా.. మార్కెట్‌లో మెరుగైన పరిస్థితులు!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో పొగాకు రైతులకు ఊరట కలిగించే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 2025–26 FCV పొగాకు వేలాల్లో ఇటీవల మార్కెట్ పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
‘నో-బిడ్’లు తగ్గుముఖం పట్టడం, కొనుగోలుదారుల మధ్య పోటీ పెరగడంతో ధరల్లో కూడా మెరుగుదల కనిపిస్తోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు, సూచనలకు అనుగుణంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
సెప్టెంబర్ 4 నాటికి 132 వేలం రోజుల్లో 86.59 మిలియన్ కిలోల FCV పొగాకు మార్కెట్ అయినట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుత సీజన్‌కు 142 మిలియన్ కిలోల పంటకు అనుమతి ఉండగా.. వాస్తవ ఉత్పత్తి సుమారు 236 మిలియన్ కిలోలకు చేరిందన్నారు. అధిక ఉత్పత్తి కారణంగా మార్కెట్‌లో భారీగా సర్ప్లస్ ఏర్పడటంతో ధరలపై కొంత ఒత్తిడి నెలకొందని తెలిపారు. ఇప్పటివరకు నమోదైన సగటు ధర కిలోకు రూ.209.83గా ఉందన్నారు.
గత ఏడాది ఇదే సమయానికి 132 వేలం రోజుల్లో 140.27 మిలియన్ కిలోల పొగాకు మార్కెట్ కాగా.. తుది సగటు ధర కిలోకు రూ.248.86గా నమోదైందని అచ్చెన్నాయుడు వివరించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోలుదారుల స్పందన క్రమంగా పెరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం వారానికి సుమారు 10 మిలియన్ కిలోల పొగాకు మార్కెట్ అవుతోందన్నారు.
తగ్గుతున్న నో-బిడ్‌లు
వేలం కేంద్రాల్లో ‘నో-బిడ్’ బేల్స్ శాతం గణనీయంగా తగ్గడం మార్కెట్‌లో సానుకూల సంకేతమని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రోజువారీగా సగటున 11 నుంచి 12 శాతం వరకు నో-బిడ్‌లు నమోదవుతున్నాయని.. కొన్ని వేలం ప్లాట్‌ఫారమ్‌లలో ఈ సంఖ్య 1 నుంచి 2 శాతం కంటే కూడా తక్కువగా ఉందన్నారు. నో-బిడ్‌లు తగ్గడంతో పాటు కొనుగోలు కార్యకలాపాలు పెరగడం, కొనుగోలుదారుల మధ్య పోటీ మెరుగుపడటం వల్ల రైతులకు మెరుగైన ధరలు లభించే అవకాశం ఉందని చెప్పారు.
కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ధరలు
వివిధ వేలం కేంద్రాల్లోనూ ధరలు మెరుగుపడుతున్నాయని మంత్రి వెల్లడించారు. NLS ప్రాంతంలో కిలో పొగాకుకు అత్యధికంగా రూ.329 వరకు ధర లభించిందన్నారు. SLSలో గరిష్ఠ బిడ్ రూ.255 కాగా.. SBSలో రూ.252 వరకు నమోదైందని తెలిపారు. డిమాండ్ ఉన్న గ్రేడ్లు, రకాల పొగాకుకు మార్కెట్‌లో మంచి స్పందన లభిస్తోందన్నారు. ముఖ్యంగా గత నెల రోజులుగా SLS, SBS ప్రాంతాల్లో కొనుగోలు వేగం, ధరల పరిస్థితి వేలం ప్రారంభ దశతో పోలిస్తే మెరుగుపడ్డాయని చెప్పారు.
రైతుల కోసం నిరంతర పర్యవేక్షణ
పొగాకు మార్కెటింగ్ ప్రక్రియను టొబాకో బోర్డు ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులు, తయారీదారులు, ఎగుమతిదారులు, వ్యాపార ప్రతినిధులతో సమన్వయం చేస్తూ కొనుగోళ్లను వేగవంతం చేస్తున్నామన్నారు. నో-బిడ్‌లను తగ్గించడం, కొనుగోలుదారులు నిరంతరం వేలంలో పాల్గొనేలా చూడటం, మార్కెటబుల్ పొగాకును కొనుగోలు చేయడం వంటి అంశాలపై వ్యాపార వర్గాలతో చర్చిస్తున్నట్లు చెప్పారు.
రైతులు, వ్యాపార ప్రతినిధులతో మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేశామని, సీనియర్ అధికారులు వేలం కేంద్రాలను సందర్శిస్తూ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారని తెలిపారు.
వచ్చే ఏడాది సాగుపై నియంత్రణ
ప్రస్తుత సీజన్ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఏడాది పొగాకు సాగు పరిమాణాన్ని భారీగా తగ్గించినట్లు మంత్రి వెల్లడించారు. 2026–27లో ఏపీలో FCV పొగాకు అనుమతించిన పంట పరిమాణాన్ని 142 మిలియన్ కిలోల నుంచి 81 మిలియన్ కిలోలకు తగ్గించినట్లు తెలిపారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగానే ఉత్పత్తి ఉండేలా చూడటం.. భవిష్యత్తులో అధిక సర్ప్లస్ కారణంగా ధరలు పడిపోకుండా చర్యలు తీసుకోవడమే లక్ష్యమన్నారు.
రైతులు అనుమతించిన పరిమాణానికి మాత్రమే సాగు చేసేలా టొబాకో బోర్డు ద్వారా అవగాహన కల్పిస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. వేలం ప్రక్రియ పూర్తయ్యే వరకు పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని, రైతులకు అవసరమైన సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.




