నటుడు ప్రకాష్ రాజ్ తో పాటు ప్రశ్న రావణ్‌పై ఆధారాలతో విరుచుకుపడి విమర్శలు చేసిన మంత్రి దుర్గేష్...

Amaravati: ప్రకాష్ రాజ్, రావణ్ కూటమి ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారంటూ ఆధారాలతో సంచలన ఆరోపణలు చేసిన ఏపీ మంత్రి కందుల దుర్గేష్. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

Hari Kishan  AP Bureau Chief
Published on: 4 July 2026 6:08 PM IST
Amaravati
X

నటుడు ప్రకాష్ రాజ్ తో పాటు ప్రశ్న రావణ్‌పై ఆధారాలతో విరుచుకుపడి విమర్శలు చేసిన మంత్రి దుర్గేష్...

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న విమర్శలు, ప్రతివిమర్శలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో నటుడు ప్రకాష్ రాజ్,ప్రశ్న రావణ్ అలియాస్ జోసఫ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. సోషల్ మీడియాలో కుట్రపూరిత ప్రచారం జరుగుతోందని, దీని వెనుక ఒక వ్యవస్థ పనిచేస్తోందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతూ కొన్ని ఆడియో క్లిప్‌లను కూడా మీడియా కు విడుదల చేశారు..

మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ.. "జస్ట్ ఆస్కింగ్" పేరుతో సోషల్ మీడియాలో ప్రశ్నలు వేస్తున్న ప్రకాష్ రాజ్, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న రావణ్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఇద్దరూ కలిసి పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం, అలాగే రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారని అన్నారు. వీరి వెనుక ఆర్థికంగా సహకరిస్తున్న వ్యక్తులు ఉన్నారని, ఆ కుట్రలో తెర వెనుక ఉన్నవారి వివరాలు కూడా త్వరలో బయటపెడతామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో కుల, మత ఘర్షణలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని మంత్రి వ్యాఖ్యానించారు. దేవుడు నోరు ఇచ్చాడని ఇష్టానుసారం మాట్లాడితే చట్టం ఊరుకోదని, చట్టం తన పని తాను చేసుకుంటుందని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు, అసభ్య వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పోలీసు యంత్రాంగం ఈ వ్యవహారాన్ని పూర్తిగా విచారించాలని కూడా కోరారు.

ప్రకాష్ రాజ్‌ను ఉద్దేశించి మంత్రి పలు ప్రశ్నలు సంధించారు. 2019 నుంచి 2024 మధ్య జరిగిన ఘటనలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. డాక్టర్ సుధాకర్ మరణం, వీధి సుబ్రహ్మణ్యం హత్య, హిందూ దేవాలయాలపై దాడులు వంటి అంశాలపై అప్పట్లో "జస్ట్ ఆస్కింగ్" ఎందుకు చేయలేదని నిలదీశారు. ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రశ్నలు వేయడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై కూడా కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అన్నారు. పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి, గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నారని చెప్పారు. అలాంటి అభివృద్ధి కొందరికి నచ్చడం లేదని, అందుకే ఆయనను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. జాతీయవాదం, సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నందుకే లక్ష్యంగా చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

మొత్తంగా మంత్రి దుర్గేష్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. సోషల్ మీడియా ప్రచారం, రాజకీయ విమర్శలు, భావ ప్రకటన స్వేచ్ఛ, చట్టపరమైన చర్యలు వంటి అంశాలపై మరోసారి రాజకీయ వర్గాల్లో వాదోపవాదాలు మొదలయ్యాయి. మంత్రి చేసిన ఆరోపణలపై ప్రకాష్ రాజ్ లేదా ఇతరుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story