Amaravati: శాంతిభద్రతలపై రాజీపడొద్దు..ఎస్పీలతో హోంమంత్రి అనిత టెలికాన్ఫరెన్స్!

Amaravati: రాష్ట్రంలో గణేష్ ఉత్సవాల వేళ శాంతిభద్రతలపై ఎస్పీలతో హోంమంత్రి అనిత టెలికాన్ఫరెన్స్. సింగిల్ విండో అనుమతులు, సున్నిత ప్రాంతాల్లో బందోబస్తుపై కీలక ఆదేశాలు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 12 Sept 2026 5:56 PM IST
Amaravati
X

Amaravati: శాంతిభద్రతలపై రాజీపడొద్దు..ఎస్పీలతో హోంమంత్రి అనిత టెలికాన్ఫరెన్స్!

Amaravati: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. జిల్లాల ఎస్పీలతో శనివారం ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించి.. రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్షించారు. రానున్న గణేష్ ఉత్సవాల నేపథ్యంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, ఉత్సవాలకు అనుమతుల జారీ, మండపాల ఏర్పాటు, నిమజ్జన ఊరేగింపుల నిర్వహణ తదితర అంశాలపై ఎస్పీలతో చర్చించారు.

గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని మంత్రి సూచించారు. ఉత్సవాల నిర్వహణకు అనుమతులు పొందేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న సింగిల్ విండో విధానంపై ఉత్సవ కమిటీలు, ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని ఎస్పీలను ఆదేశించారు. అనుమతుల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖల మధ్య సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు.

గణేష్ మండపాల ఏర్పాటు నుంచి నిమజ్జన ఊరేగింపుల వరకు పాటించాల్సిన నిబంధనలను ముందుగానే నిర్వాహకులకు తెలియజేయాలని హోం మంత్రి సూచించారు. మండపాల వద్ద భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ భద్రత, నిమజ్జన మార్గాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. నిబంధనలు పాటించేలా నిర్వాహకులతో పోలీసులు సమన్వయం చేసుకోవాలని సూచించారు.

ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీలకు అనిత స్పష్టం చేశారు. ముఖ్యంగా సున్నితమైన ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ అదనపు భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అవసరమైన మేరకు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచించారు. ఊరేగింపులు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు.

ఇదే సమయంలో జిల్లాల్లో శాంతిభద్రతల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని హోం మంత్రి ఆదేశించారు. చిన్న ఘటనలు కూడా పెద్ద సమస్యలకు దారితీయకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలు, వివిధ వర్గాల మధ్య సమన్వయం పెంచడంతో పాటు సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని చెప్పారు.

నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన శాంతిభద్రతల సమీక్ష సమావేశంలో చర్చించిన అంశాలను కూడా హోం మంత్రి అనిత ఎస్పీలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ప్రస్తావించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా జిల్లాల స్థాయిలో పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.

శాంతిభద్రతల పరిరక్షణలో ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని అనిత స్పష్టం చేశారు. ప్రజలకు భద్రత కల్పించడం పోలీసుల ప్రధాన బాధ్యత అని పేర్కొంటూ.. గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా అన్ని జిల్లాల ఎస్పీలు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.