Amaravati: అట్టహాసంగా తొలి ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ప్రారంభం!
Amaravati: మంగళగిరిలో తొలి ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026 ను డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా ప్రారంభించారు. 1900 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.
Amaravati: అట్టహాసంగా తొలి ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ప్రారంభం!
Amaravati: శారీరక దృఢత్వం, మానసిక అప్రమత్తత పోలీసుల విధి నిర్వహణలో అత్యంత కీలకమని డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా పేర్కొన్నారు. నిరంతరం సవాళ్లతో కూడిన విధులు నిర్వర్తించే పోలీసులు ఫిట్‌నెస్, క్రీడలను తమ వృత్తి జీవితంలో అంతర్భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎక్కువ గంటలు పనిచేయడం, క్లిష్ట పరిస్థితుల్లో వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, ఒత్తిడిని తట్టుకోవడం, బృందంగా పనిచేయడం పోలీసు విధుల్లో భాగమని.. వీటన్నింటినీ సమర్థంగా ఎదుర్కొనే శారీరక, మానసిక సామర్థ్యాన్ని క్రీడలు పెంపొందిస్తాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న *ఏపీ స్టేట్ పోలీసు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026’*ను మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ మైదానంలో మంగళవారం డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ ప్రారంభించారు. శాంతి కపోతాలను, బెలూన్లను గాలిలోకి ఎగరవేసి రాష్ట్ర స్థాయి పోలీసు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీసు రేంజ్‌లు, యూనిట్ల నుంచి 1,900 మంది క్రీడాకారులు ఈ పోటీల్లోతలపడుతున్నారు. మరో 450 మంది అధికారులు, కోచ్‌లు, సాంకేతిక అధికారులు, టీమ్ మేనేజర్లు, సహాయక సిబ్బంది ఇందులో భాగస్వాములు కానున్నారు.
క్రీడా పోటీల్లో పాల్గొంటున్న 16 టీమ్ ల నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూరాష్ట్రస్థాయిలో తొలిసారిగా ఇంత పెద్దఎత్తున పోలీసు క్రీడా పోటీలు నిర్వహించడం శాఖకు కీలక మైలురాయని పేర్కొన్నారు. ‘‘గెలుపును వినయంగా స్వీకరించండి.. ఓటమిని పట్టుదలకు పునాదిగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు.
‘‘ఈ సందర్భంలో మీరు క్రీడాకారులైనా.. అన్నింటికంటే ముందు పోలీసులని, మైదానంలోనూ, వెలుపలా మీ ప్రవర్తన పోలీసు శాఖ క్రమశిక్షణ, హుందాతనం, వృత్తి నైపుణ్యాన్ని ప్రతిబింబించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో పోలీసు క్రీడాకారులు సాధించే విజయాలు పోలీసు బలగాలకు స్ఫూర్తినిస్తాయన్నారు. ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది శారీరక దృఢత్వానికి ప్రాధాన్యమిస్తూ క్రీడలను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.
తొలి రాష్ట్రస్థాయి పోలీసు క్రీడా సమ్మేళనాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పోలీసు స్పోర్ట్స్ వింగ్, నిర్వాహక బృందాలను డీజీపీ అభినందించారు. పోటీలకు అవసరమైన వేదికలు, సౌకర్యాలు కల్పించిన రెండు విశ్వవిద్యాలయాల యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు.
‘‘ఆత్మవిశ్వాసంతో పోటీపడండి.. క్రమశిక్షణతో ఆడండి.. గెలుపును వినయంగా, ఓటమిని పట్టుదలతో స్వీకరించండి. అన్నింటికంటే మించి ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ గౌరవాన్ని నిలబెట్టండి’’ అంటూ క్రీడాకారులకు డీజీపీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మీట్ ఫిట్‌నెస్, ప్రతిభ, క్రమశిక్షణ, సమష్టితత్వం, క్రీడాస్ఫూర్తికి వేదికగా నిలిచి భవిష్యత్తులో మరిన్ని విజయవంతమైన క్రీడా సమ్మేళనాలకు బలమైన పునాది వేయాలని ఆకాంక్షించారు.
నాలుగు రోజుల క్రీడా సంబరం
సెప్టెంబరు 1 నుంచి 4 వరకు నాలుగు రోజుల పాటు ఈ క్రీడా సంబరం కొనసాగనుంది. వీఐటీ–ఏపీ విశ్వవిద్యాలయం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్రీడా మైదానాలు పోటీలకు వేదికలుగా నిలుస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) శ్రీ ఎన్. మధుసూదన్‌రెడ్డి, ఐపీఎస్, ఐజీపీలు శ్రీ ఆకే రవికృష్ణ, ఐపీఎస్ (ఈగల్ చీఫ్), శ్రీమతి బి. రాజకుమారి, ఐపీఎస్,(వుమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్), శ్రీ సీహెచ్. శ్రీకాంత్ ఐపీఎస్ (టెక్నికల్ సర్వీసెస్ & ఆపరేషన్స్), శ్రీ కె.వి. మోహన్‌రావు,ఐపీఎస్ (స్పోర్ట్స్ & వెల్ఫేర్), డీఐజీలు శ్రీ అన్బురాజన్,ఐపీఎస్ (స్పోర్ట్స్ & వెల్ఫేర్), శ్రీ ఆర్.ఎన్. అమ్మిరెడ్డి, ఐపీఎస్ (అడ్మిన్), శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్ (ఎస్పీ గుంటూరు) పలువురు సీనియర్ పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




