AP: డీజీపీ నుంచి ఎస్హెచ్ఓల వరకు.. శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు నయా మార్క్ సమీక్ష!
AP: ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలపై సీఎం నారా చంద్రబాబు నాయుడు డీజీపీ నుంచి ఎస్హెచ్ఓల వరకు 1,650 మంది పోలీసు అధికారులతో సచివాలయం నుంచి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
AP: డీజీపీ నుంచి ఎస్హెచ్ఓల వరకు.. శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు నయా మార్క్ సమీక్ష!
AP: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసు శాఖపై మరింత ఫోకస్ పెట్టారు. రాష్ట్ర సచివాలయం నుంచి శాంతిభద్రతలపై పోలీసు శాఖ ఉన్నతాధికారులతో పాటు క్షేత్రస్థాయి అధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డీజీపీ స్థాయి నుంచి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వరకు అధికారులు ఒకే వేదికపైకి రావడం ఈ సమీక్షకు ప్రత్యేకతగా నిలిచింది.
రాష్ట్రవ్యాప్తంగా పోలీసింగ్ వ్యవస్థ పనితీరును క్షేత్రస్థాయి నుంచి సమీక్షించిన సీఎం.. ప్రజలకు పోలీసులపై మరింత నమ్మకం కలిగేలా వ్యవస్థ పనిచేయాలని స్పష్టం చేసినట్లు సమాచారం. నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే నేరం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా పోలీసింగ్ ఉండాలని దిశానిర్దేశం చేశారు.
డీజీపీ నుంచి ఎస్హెచ్ఓల వరకు..
సీఎం నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశానికి డీజీపీ నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్ల వరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అధికారులు హాజరయ్యారు. హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా సమావేశంలో పాల్గొన్నారు.రేంజ్ ఐజీలు, డీఐజీలు, జిల్లాల ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్ఐలు వర్చువల్ విధానంలో సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలోని 1,200కు పైగా పోలీస్ స్టేషన్ల నుంచి ఎస్‌హెచ్ఓలు సహా వివిధ స్థాయిలకు చెందిన సుమారు 1,650 మంది అధికారులు వర్చువల్‌గా పాల్గొన్నారు...ఇంత భారీ స్థాయిలో పోలీసు యంత్రాంగం మొత్తం ఒకేసారి సమీక్షలో పాల్గొనడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పోలీసింగ్‌పై ప్రభుత్వం ఎంత సీరియస్‌గా ఉందో స్పష్టమైంది.
స్టేషన్ పనితీరుపై నేరుగా నజర్
పోలీస్ స్టేషన్ అంటే కేవలం కేసులు నమోదు చేసే కార్యాలయం కాదని.. ప్రజలకు భద్రత, న్యాయం అందించే తొలి కేంద్రంగా పనిచేయాలని సీఎం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రతి పోలీస్ స్టేషన్‌లో నమోదవుతున్న కేసుల సంఖ్య, వాటి దర్యాప్తు తీరు, పెండింగ్ కేసుల పరిస్థితి, నిందితులపై తీసుకుంటున్న చర్యలు వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు...క్షేత్రస్థాయిలో పోలీస్ స్టేషన్ల పనితీరును ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. స్టేషన్ స్థాయిలోనే సమస్యలను గుర్తించి పరిష్కరించగలిగితే శాంతిభద్రతల పరిరక్షణ మరింత సమర్థంగా ఉంటుందని సూచించినట్లు సమాచారం.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు
రాష్ట్రంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి పోలీసు అధికారులను ఆదేశించారు. ఏ వ్యక్తి అయినా.. ఏ వర్గానికి చెందిన వారైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పకూడదని స్పష్టం చేశారు...ప్రజల్లో భయాందోళనలు కలిగించే ఘటనలను ఉపేక్షించకూడదని, చిన్న ఘటనలు పెద్ద సమస్యలుగా మారకముందే పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు.. వివాదాలు, ఘర్షణలకు దారితీసే పరిస్థితులపై నిఘా పెంచాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రాధాన్యం
మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణపైనా సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. మహిళలు, పిల్లలకు రక్షణ కల్పించడంలో పోలీసుల స్పందన వేగంగా, సున్నితంగా ఉండాలని సూచించారు...మహిళలు, బాలికలపై వేధింపులు, దాడులు, ఇతర నేరాల విషయంలో ఫిర్యాదుల స్వీకరణ నుంచి దర్యాప్తు వరకు ప్రతి దశలో అప్రమత్తత అవసరమని సీఎం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. చిన్నారుల భద్రత విషయంలో రాజీ లేకుండా వ్యవహరించాలని అధికారులకు సూచించారు...పాఠశాలలు, కళాశాలలు, మహిళలు ఎక్కువగా రాకపోకలు సాగించే ప్రాంతాలు, ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రదేశాల్లో భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
సైబర్ నేరాలపై మరింత అప్రమత్తత
సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా కొత్త రూపాల్లో విస్తరిస్తున్న నేపథ్యంలో వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. సైబర్ మోసాలు, ఆన్‌లైన్ నేరాలు, డిజిటల్ వేదికల ద్వారా జరిగే మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు.. ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించే వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు...సైబర్ నేరాల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. నేరగాళ్లు కొత్త పద్ధతులు అనుసరిస్తున్నందున పోలీసులు కూడా సాంకేతికంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావాలని సీఎం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
బ్లేడ్, గంజాయి బ్యాచ్‌లపై ఉక్కుపాదం
యువతను ప్రభావితం చేస్తున్న బ్లేడ్ బ్యాచ్‌లు, గంజాయి వినియోగం, అక్రమ రవాణా వంటి అంశాలపైనా సీఎం సీరియస్‌గా స్పందించినట్లు సమాచారం. అసాంఘిక శక్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని అధికారులను ఆదేశించారు...ముఖ్యంగా యువతను తప్పుదోవ పట్టించే మాదకద్రవ్యాల వినియోగం, సరఫరాపై కఠిన నిఘా పెట్టాలని సూచించారు. గంజాయి సరఫరా చేసే నెట్‌వర్క్‌లను గుర్తించి మూలాలను ఛేదించాలని, సరఫరాదారులతో పాటు వాటి వెనుక ఉన్న వ్యవస్థపై కూడా దృష్టి పెట్టాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారానికి చెక్
సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న తప్పుడు ప్రచారాలపైనా పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారం, ప్రజల్లో ఉద్రిక్తతలు సృష్టించే ప్రచారాలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్నందున వాటిపై నిరంతర నిఘా అవసరమని పేర్కొన్నారు...అయితే సోషల్ మీడియా వినియోగంలో చట్టబద్ధమైన భావ వ్యక్తీకరణకు ఇబ్బంది కలగకుండా.. చట్టాన్ని ఉల్లంఘించే కంటెంట్‌పై మాత్రమే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసు వ్యవస్థ వ్యవహరించాల్సి ఉంటుంది. తప్పుడు ప్రచారం వెనుక ఉన్న వ్యక్తులు, వ్యవస్థలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.
కేసుల నమోదుపై ప్రత్యేక సమీక్ష
రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసులపై సీఎం ఆరా తీశారు. కేసులు నమోదు చేయడం, దర్యాప్తు పూర్తి చేయడం, నిందితులను పట్టుకోవడం, చార్జిషీట్లు దాఖలు చేయడం వంటి అంశాల్లో జాప్యం ఉండకూడదని సూచించారు...ప్రజలు పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు వారి సమస్యను వినే విధానం నుంచి.. కేసు పరిష్కారం అయ్యే వరకు ప్రతి దశలో బాధ్యత స్పష్టంగా ఉండాలని సీఎం పేర్కొన్నట్లు సమాచారం. ఫిర్యాదుదారులకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం పెరిగేలా అధికారులు పనిచేయాలని సూచించారు.
ఫీల్డ్‌లోనే పోలీసింగ్ కనిపించాలి
పోలీసులు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సీఎం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో పెట్రోలింగ్ పెంచడం, నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించడం, స్థానిక పరిస్థితులపై నిరంతర సమాచారం సేకరించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు...ప్రతి ఎస్‌హెచ్ఓ తన పరిధిలోని పరిస్థితులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, తమ పరిధిలో నేరాల నియంత్రణకు బాధ్యత వహించాలని సీఎం దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
ప్రజల్లో భద్రతా భావన పెంచడమే లక్ష్యం
మొత్తంగా రాష్ట్రంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడం, నేరాల నియంత్రణ, మహిళలు–చిన్నారుల రక్షణ, సైబర్ నేరాల కట్టడి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం, సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాల నియంత్రణ వంటి అంశాలపై సీఎం సమగ్రంగా దిశానిర్దేశం చేశారు...డీజీపీ నుంచి ఎస్‌హెచ్ఓ వరకు మొత్తం పోలీసు యంత్రాంగాన్ని ఒకే సమీక్షలో భాగస్వామ్యం చేయడం ద్వారా పోలీసింగ్‌పై ప్రభుత్వం నేరుగా పర్యవేక్షణ కొనసాగించబోతోందన్న సంకేతాలు ఇచ్చింది. స్టేషన్ స్థాయిలో పనితీరు మెరుగుపడితేనే ప్రజలకు భద్రతపై నమ్మకం పెరుగుతుందనే లక్ష్యంతో.. క్షేత్రస్థాయి పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేసే దిశగా సీఎం ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.




