శివాని మృతి కలిచివేసింది.. పూర్తి దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..

Amaravati: పోలవరం గిరిజన విద్యార్థిని ముర్రం శివాని మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశం. ధైర్యంగా ఉండాలని విద్యార్థులకు పిలుపు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 27 July 2026 10:27 PM IST
Amaravati
X

శివాని మృతి కలిచివేసింది.. పూర్తి దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..

అమరావతి: పోలవరం జిల్లా ఈర్లపల్లికి చెందిన పదో తరగతి విద్యార్థిని ముర్రం శివాని మృతి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవల రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో వేదికపై ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడిన శివాని ఇక లేరనే విషయం తనను తీవ్రంగా కలచివేసిందని సీఎం పేర్కొన్నారు.

ఆ కార్యక్రమంలో శివాని తన చదువు, ఉన్నత లక్ష్యాలు, భవిష్యత్ ఆశయాల గురించి ఎంతో ఉత్సాహంగా చెప్పిన విషయాలు ఇప్పటికీ తనకు గుర్తున్నాయని చంద్రబాబు అన్నారు. మంచి భవిష్యత్ ఉన్న ఓ గిరిజన విద్యార్థిని ఇంత చిన్న వయసులో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కారణాలు ఏవైనా, తన కలలను సాకారం చేసుకునే అవకాశం రాకముందే శివాని దూరమవడం ఎంతో విచారకరమని పేర్కొన్నారు.

ఈ ఘటనపై సమగ్రంగా, అన్ని కోణాల్లో విచారణ జరపాలని అధికారులను సీఎం ఆదేశించారు. శివాని మృతికి దారితీసిన పరిస్థితులు ఏమిటి, ఎక్కడ లోపాలు జరిగాయి అనే అంశాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని సూచించారు. వాస్తవాలు వెలుగులోకి వచ్చాక తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని విద్యార్థులు, యువతకు సీఎం భావోద్వేగపూర్వక విజ్ఞప్తి చేశారు. జీవితంలో సమస్యలు, ఒత్తిడులు, నిరాశలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. ఎంతటి క్లిష్ట పరిస్థితికైనా పరిష్కారం ఉంటుందని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు.మనసులోని బాధను కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, స్నేహితులు లేదా ఆత్మీయులతో పంచుకోవాలని, అవసరమైతే మానసిక నిపుణుల సలహా తీసుకోవాలని సూచించారు.

విద్యార్థుల భవిష్యత్తు ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని, వారి విద్య, సంక్షేమం, మానసిక ఆరోగ్యానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. శివాని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఆ కుటుంబానికి ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఘటన మరోసారి విద్యార్థులపై పెరుగుతున్న మానసిక ఒత్తిడి, భావోద్వేగ సమస్యలపై సమాజం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story