శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు సమీక్ష..

Amaravati: శాంతిభద్రతలపై బుధవారం సీఎం చంద్రబాబు భారీ సమీక్ష. డీజీపీ నుంచి ఎస్‌హెచ్‌ఓ వరకు 1,300 మంది అధికారులతో వీడియో కాన్ఫరెన్స్. నేరాల నియంత్రణపై దిశానిర్దేశం.

Hari Kishan  AP Bureau Chief
Published on: 11 Aug 2026 10:27 PM IST
Amaravati
X

శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు సమీక్ష..

అమరావతి: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ పెట్టారు. నేరాల నియంత్రణ, మహిళలు, చిన్నారుల రక్షణ, సైబర్ నేరాల కట్టడి, సోషల్ మీడియాలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వంటి అంశాలపై పోలీస్ యంత్రాంగానికి స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు సచివాలయంలో అత్యంత కీలకమైన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు.

సాధారణంగా డీజీపీ, అదనపు డీజీపీలు, ఐజీలు, ఎస్పీల స్థాయిలో జరిగే సమీక్షలకు భిన్నంగా ఈసారి పోలీస్ వ్యవస్థలోని అన్ని స్థాయిల అధికారులను సమావేశంలో భాగస్వాములను చేస్తున్నారు. డీజీపీ నుంచి క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే స్టేషన్ హౌస్ ఆఫీసర్ల వరకు దాదాపు 1,300 మంది అధికారులు ఈ సమీక్షలో పాల్గొననున్నారు. పోలీస్ ఉన్నతాధికారులు సచివాలయంలో ప్రత్యక్షంగా హాజరవుతుండగా.. జిల్లాల్లోని ఇతర అధికారులు, ఎస్‌హెచ్‌ఓలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొంటారు.

క్షేత్రస్థాయి పరిస్థితులపై నేరుగా ఆరా

శాంతిభద్రతల విషయంలో క్షేత్రస్థాయి పరిస్థితులు ఎలా ఉన్నాయి? పోలీస్ స్టేషన్ల పనితీరు ఏ విధంగా ఉంది? ఫిర్యాదుల పరిష్కారం ఎలా జరుగుతోంది? కేసుల నమోదు, దర్యాప్తు, పెండింగ్ కేసుల పరిస్థితి ఏమిటి? వంటి అంశాలపై సీఎం లోతైన విశ్లేషణ చేయనున్నారు. ఇప్పటికే తన వద్ద ఉన్న వివిధ నివేదికలు, పోలీస్ స్టేషన్ల వారీగా నమోదవుతున్న కేసుల వివరాలు, శాంతిభద్రతల నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని అధికారుల ముందే ప్రస్తావించే అవకాశం ఉంది.

దీంతో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు, అధికారుల వద్ద ఉన్న నివేదికల మధ్య వ్యత్యాసాలు ఏమైనా ఉన్నాయా? అనే అంశం కూడా ఈ సమీక్షలో కీలకంగా మారనుంది. కేవలం ఉన్నతాధికారుల నుంచి సమాచారం తీసుకోవడం కాకుండా.. నేరుగా స్టేషన్ స్థాయి అధికారులతో మాట్లాడటం ద్వారా సమస్యల మూలాలను గుర్తించేందుకు సీఎం ప్రయత్నించనున్నారు.

మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం

మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలను మరింత సమర్థంగా అడ్డుకోవడంపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. మహిళల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పోలీస్ వ్యవస్థ పనిచేయాలని స్పష్టం చేయనున్నారు. బలహీన వర్గాలకు రక్షణ కల్పించడం, బాధితుల ఫిర్యాదులను తక్షణమే స్వీకరించడం, నేరాలపై వేగంగా స్పందించడం వంటి అంశాలపై అధికారులకు మార్గదర్శనం చేయనున్నారు.

గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లపై కఠిన చర్యలు

యువతను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న గంజాయి అక్రమ రవాణా, వినియోగం, బ్లేడ్ బ్యాచ్‌ల ఆగడాలపై కూడా సమీక్షలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అసాంఘిక శక్తులు, రౌడీ మూకలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే పరిస్థితి ఎక్కడా ఉండకూడదన్నది ప్రభుత్వ విధానంగా సీఎం స్పష్టం చేయనున్నారు. ప్రజల్లో భయాందోళనలు కలిగించే వ్యక్తులు, గ్యాంగులపై కఠినంగా వ్యవహరించాలని పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించనున్నారు.

సైబర్ నేరాలు.. సోషల్ మీడియాపైనా నజర్

మారుతున్న నేరాల స్వభావానికి అనుగుణంగా పోలీస్ వ్యవస్థను మరింత అప్రమత్తం చేయడంపైనా సీఎం దృష్టి సారించనున్నారు. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించడంపై ప్రత్యేకంగా సమీక్షించనున్నారు. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని ప్రజల్లో భయాందోళనలు సృష్టించే, నేరాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేయనున్నారు.

డీజీపీ నుంచి ఎస్‌హెచ్‌ఓ వరకు 1,300 మంది పోలీస్ అధికారులతో సీఎం చంద్రబాబు నిర్వహించనున్న ఈ సమీక్ష రాష్ట్ర శాంతిభద్రతల వ్యవస్థలో కీలక సమీక్షగా మారనుంది. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను నేరుగా తెలుసుకుని, లోపాలను గుర్తించి, బాధ్యతలను స్పష్టంగా నిర్దేశించడంతో పాటు.. ప్రజలకు మరింత భద్రత కల్పించేలా పోలీస్ యంత్రాంగాన్ని సీఎం సమాయత్తం చేయనున్నారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story