CM Chandrababu: సస్పెండ్ చేస్తా జాగ్రత్త.. సొంత పార్టీ ఎమ్మెల్యేలకే చంద్రబాబు గట్టి వార్నింగ్..!
CM Chandrababu: నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబుపై సీఎం చంద్రబాబు సీరియస్. ఎస్పీ కార్యాలయంలో బైఠాయింపు ఘటనపై ఆగ్రహం. పార్టీ క్రమశిక్షణ తప్పితే సస్పెన్షన్ తప్పదని హెచ్చరిక.
CM Chandrababu: సస్పెండ్ చేస్తా జాగ్రత్త.. సొంత పార్టీ ఎమ్మెల్యేలకే చంద్రబాబు గట్టి వార్నింగ్..!
CM Chandrababu: పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, అవసరమైతే తక్షణమే సస్పెండ్ చేస్తామని ఘాటుగా హెచ్చరించారు. ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు తెచ్చే పనులకు దూరంగా ఉండాలని ప్రజాప్రతినిధులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
అసలు వివాదం ఏంటి?
ఇటీవల పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే అరవిందబాబు చేసిన హంగామా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జిల్లా పోలీసు సెల్ లీగల్ అడ్వైజర్‌గా తాను సూచించిన వ్యక్తిని నియమించాలంటూ ఏకంగా 10 గంటల పాటు ఎస్పీ ఛాంబర్‌లోనే బైఠాయించారు. ఎస్పీ కృష్ణారావుతో వాగ్వాదానికి దిగడమే కాకుండా, ఆర్డర్ కాపీ చేతికి వచ్చేవరకు కదిలేది లేదని భీష్మించుక కూర్చున్నారు. ఉన్నతాధికారులు, మంత్రుల కార్యాలయాల నుంచి ఫోన్లు వచ్చినా ఆయన వెనక్కి తగ్గలేదు.
చంద్రబాబు సీరియస్ వార్నింగ్:
ఈ ఘటనపై ఎమ్మెల్యే అరవిందబాబు వివరణను పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్.. సీఎం చంద్రబాబు ముందు ఉంచారు. దీనిపై స్పందించిన చంద్రబాబు నేతల తీరుపై మండిపడ్డారు.
"కొందరి వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీ ప్రతిష్టను పణంగా పెట్టలేం. గీత దాటితే భరించే ప్రసక్తే లేదు" అని స్పష్టం చేశారు. "రాజకీయాల్లో సుదీర్ఘకాలం ఉండాలనుకుంటే క్రమశిక్షణ తప్పనిసరి. మీరు ఒక్కసారి ఎమ్మెల్యేలుగానే మిగిలిపోవాలనుకుంటున్నారా? అనేది మీరే తేల్చుకోవాలి" అని చురకలంటించారు. ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే పనులు చేస్తే పునరాలోచన లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ హెచ్చరికతో తెలుగుదేశం పార్టీలోని ప్రజాప్రతినిధుల్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. అధికారులతో వ్యవహరించే తీరులో మార్పు రావాలని అధిష్ఠానం గట్టి సంకేతాలు పంపింది.




