AP: ఏపీలో 5 వేల నూతన ఆలయాల నిర్మాణం: సీఎం చంద్రబాబు!
AP: రాష్ట్రవ్యాప్తంగా 5 వేల నూతన ఆలయాల నిర్మాణం, 1000 పురాతన ఆలయాల పునరుద్ధరణ, 28 వేల దేవాలయాల డిజిటలైజేషన్‌పై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
AP: ఏపీలో 5 వేల నూతన ఆలయాల నిర్మాణం: సీఎం చంద్రబాబు!
AP: రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత విస్తరించేలా దేవాలయాల నిర్మాణం, పునరుద్ధరణ కార్యక్రమాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 5 వేల దేవాలయాల నిర్మాణాన్ని ప్రాధాన్యతతో చేపట్టాలని టీటీడీ, దేవాదాయశాఖ అధికారులకు సూచించారు. ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదిత స్థలాలను త్వరితగతిన ఖరారు చేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఆలయ నిర్మాణంతో పాటు వాటి భవిష్యత్ నిర్వహణకు ఇప్పటి నుంచే సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల నిర్మాణం, టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధార్మిక, విద్యా, వైద్య సేవలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపడుతున్న ఆలయ నిర్మాణాల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు.
4,192 ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు
రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 161 నియోజకవర్గాల నుంచి 4,192 ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు అందినట్లు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటికే 967 ఆలయాల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. మిగిలిన ఆలయాల నిర్మాణాన్ని కూడా వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఆలయాలను మూడు కేటగిరీలుగా నిర్మించేలా ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు వివరించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలు, మత్స్యకార ప్రాంతాలు, బలహీన వర్గాల నివాస ప్రాంతాలతో పాటు సాధారణ ప్రాంతాల్లోనూ ఆలయాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు. నిర్మాణానికి అవసరమైన స్థలాలను త్వరగా గుర్తించి, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయంతో వాటిని ఖరారు చేస్తే పనులు వేగంగా పూర్తి చేయవచ్చని అధికారులు సీఎంకు వివరించారు.
శ్రీవాణి నిధులతో ధార్మిక కార్యక్రమాలు
శ్రీవాణి ట్రస్టు ద్వారా సమకూరే నిధులను ఆలయాల నిర్మాణం, ధార్మిక కార్యక్రమాల విస్తరణకు వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆలయాల నిర్మాణం కేవలం భవనాల నిర్మాణంగా కాకుండా హిందూ ధర్మ ప్రచారం, ఆధ్యాత్మిక చైతన్యం, సామాజిక సేవలకు కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని అన్నారు.
వేంకటేశ్వర స్వామిపై ప్రజల్లో ఉన్న విశ్వాసం, భక్తి అపారమని చంద్రబాబు పేర్కొన్నారు. టీటీడీకి అందుబాటులో ఉన్న మానవ వనరులను రాష్ట్రంలోని కొత్తగా నిర్మించే ఆలయాల్లోనూ వినియోగించుకునే విధంగా వ్యవస్థను రూపొందించాలని సూచించారు.
11.8 లక్షల మంది శ్రీవారి సేవకుల సేవలు
ప్రస్తుతం 11.8 లక్షల మంది శ్రీవారి సేవకులు ఉన్నారని సీఎం పేర్కొన్నారు. వీరి సేవలను కేవలం తిరుమలకే పరిమితం చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నిర్మించే ఆలయాల్లోనూ వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
ఆలయాల నిర్మాణం, నిర్వహణలో భక్తుల భాగస్వామ్యాన్ని పెంచాలని అన్నారు. బోర్డు సభ్యులు, భక్తులు, శ్రీవారి సేవకులతో స్థానికంగా ఎగ్జిక్యూటివ్ కమిటీలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నియంత్రణలో, ప్రజల భాగస్వామ్యంతో ఆలయాల నిర్వహణ మరింత సమర్థంగా జరిగేలా వ్యవస్థను రూపొందించాలన్నారు.
ఇతర రాష్ట్రాలు.. విదేశాల్లోనూ శ్రీవారి ఆలయాలు
దేశంలోని ఇతర రాష్ట్రాల రాజధానుల్లోనూ శ్రీవారి ఆలయాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇందుకోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించారు. విదేశాల్లోనూ శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ఆసక్తి ఉందని, మారిషస్ వంటి దేశాలు కూడా శ్రీవారి ఆలయాల నిర్మాణాన్ని కోరుకుంటున్నాయని తెలిపారు.
భవిష్యత్తులో శ్రీవారి ఆలయాలు ప్రపంచవ్యాప్తంగా హిందువులకు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మారేలా కార్యక్రమాలను రూపొందించాలని సీఎం సూచించారు. ఆలయాల ద్వారా ధార్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలన్నారు.
అర్చకులకు ప్రత్యేక శిక్షణ
రాష్ట్రంలో నిర్మించబోయే వేలాది ఆలయాలకు అవసరమైన అర్చకులను ముందుగానే సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పారు. అర్చకులకు ప్రత్యేక శిక్షణ అందించేందుకు కోర్సులను రూపొందించాలని సూచించారు. ఆలయాల్లో విగ్రహాల ఏర్పాటు, పూజా విధానాలు, ఆగమ సంప్రదాయాలు, ఆలయ నిర్వహణ తదితర అంశాలపై సమగ్ర శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించాలని ఆదేశించారు.
అదేవిధంగా ఆలయాలకు అవసరమైన విగ్రహాలను తయారు చేసేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. సంప్రదాయ శిల్పకళను ప్రోత్సహిస్తూ నాణ్యమైన విగ్రహాల తయారీకి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
వెయ్యి పురాతన ఆలయాల పునరుద్ధరణ
కొత్త ఆలయాల నిర్మాణంతో పాటు రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న పురాతన ఆలయాల సంరక్షణపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని వెయ్యి పురాతన దేవాలయాలను గుర్తించి పునరుద్ధరించాలని సూచించారు.
పురాతన ఆలయాల చరిత్ర, నిర్మాణ శైలి, శిల్ప సంపద, స్థల పురాణం తదితర వివరాలను భద్రపరిచి భవిష్యత్ తరాలకు అందించాలని అన్నారు. రాష్ట్రంలోని శివాలయాలు, శక్తి పీఠాల అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
28 వేల ఆలయాల డిజిటల్ డేటా
రాష్ట్రంలోని ఆలయాల సమగ్ర సమాచారాన్ని డిజిటలైజ్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. దేవాదాయశాఖ పరిధిలో ఉన్న 28 వేల ఆలయాలు, టీటీడీ నిర్వహిస్తున్న 65 ఆలయాలు, కొత్తగా నిర్మించబోయే 5 వేల ఆలయాలు.. మొత్తం ఆలయాల నిర్వహణకు ముందస్తు ప్రణాళిక అవసరమని అన్నారు.
ప్రతి ఆలయానికి సంబంధించిన స్థలం, చరిత్ర, ఆదాయం, ఆస్తులు, అర్చకులు, సిబ్బంది, భక్తుల రాక, మౌలిక సదుపాయాలు తదితర వివరాలను డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంచాలని సూచించారు. దీని ద్వారా ఆలయాల నిర్వహణలో పారదర్శకత పెరగడంతో పాటు పర్యవేక్షణ మరింత సులభమవుతుందని సీఎం పేర్కొన్నారు.
అన్నదానం నుంచి హిందూ ధర్మ ప్రచారం వరకు
టీటీడీ నిర్వహిస్తున్న అన్నదానం, ప్రాణదానం, శ్రీవారి సేవకుల సేవలు, ఆలయాల నిర్మాణం వంటి కార్యక్రమాలను హిందూ ధర్మ ప్రచారంతో అనుసంధానించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎన్టీఆర్ ప్రారంభించిన అన్నదానం కార్యక్రమం నేడు గొప్ప సేవా కార్యక్రమంగా మారిందని చంద్రబాబు గుర్తుచేశారు.
అన్నదానం వంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా టీటీడీ సేవలను విస్తరించాలని అన్నారు.
ప్రాణదానం ట్రస్టుకు ప్రత్యేక ప్రాధాన్యం
టీటీడీ ఆధ్వర్యంలోని వైద్య సేవలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. ప్రాణదానం ట్రస్టును టీటీడీ వైద్య సేవలకు బెస్ట్ మోడల్‌గా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
నిపుణులైన వైద్యుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. టీటీడీ పరిధిలోని అన్ని ఆస్పత్రుల వైద్య సేవలను పరస్పరం అనుసంధానించాలని అన్నారు. క్యాన్సర్, కంటి వైద్యం వంటి ప్రత్యేక వైద్య సేవలను విస్తరించడంతో పాటు తిరుపతిలోని ఆయుర్వేద వైద్య సేవలను కూడా మరింత అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
వైద్యులను శ్రీవారి సేవకులుగా మార్చి వైద్య సేవలతో పాటు బోధన, శిక్షణ కార్యక్రమాల్లోనూ వారి నైపుణ్యాలను వినియోగించుకోవాలని సూచించారు. అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు పేదలకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
టీటీడీ విద్యా సంస్థలకు కొత్త రూపు
టీటీడీ పరిధిలోని 33 విద్యా సంస్థల వ్యవస్థను మరింత సమర్థంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు సూచించారు. విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని అన్నారు.
టీటీడీ విద్యా సంస్థల్లో హాస్టల్ సౌకర్యాలను విస్తరించాలని, వాటి సామర్థ్యాన్ని రెట్టింపు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్య, వైద్యం, చారిటీ సేవలను పెద్ద ఎత్తున విస్తరించాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు.
అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణం వేగవంతం
రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాజధానిలో నిర్మించే ఈ ఆలయం ఆధ్యాత్మికంగా ప్రత్యేక గుర్తింపు పొందేలా, భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా అభివృద్ధి చేయాలని సూచించారు.
తిరుపతిని సంపూర్ణ దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి
తిరుమలతో పాటు దిగువన ఉన్న తిరుపతిని కూడా సంపూర్ణ దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు సూచించారు. తిరుమల శ్రీవారి సంప్రదాయాలు, ఆధ్యాత్మికత, పవిత్రతకు అనుగుణంగా తిరుపతిలో ప్రత్యేక వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు.
శ్రీవారి సంప్రదాయాలకు అనుగుణంగా కల్యాణాలు, ఇతర ధార్మిక కార్యక్రమాలు నిర్వహించుకునే వేదికగా తిరుపతిని అభివృద్ధి చేయాలని సూచించారు. నగరంలో ఆధ్యాత్మికత, పవిత్రత ప్రతిబింబించేలా ప్రత్యేక ఎకోసిస్టమ్‌ను రూపొందించాలన్నారు.
నిపుణులైన భక్తులు, ఆధ్యాత్మిక రంగ నిపుణులు, సేవకుల భాగస్వామ్యంతో టీటీడీ సేవలను మరింత విస్తృతంగా ప్రజలకు చేరేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, దేవాదాయశాఖ ఉన్నతాధికారులు వర్చువల్‌గా పాల్గొన్నారు.




