AP: జీవో నెం.9 మార్గదర్శకాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. అధికారులకు సీఎం ఆదేశాలు!

AP: ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు కోచింగ్ సెంటర్లను రాజకీయ ప్రయోజనాలు, ఆందోళనలకు వేదికలుగా మారిస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 15 Sept 2026 6:05 PM IST
AP
X

AP: జీవో నెం.9 మార్గదర్శకాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. అధికారులకు సీఎం ఆదేశాలు!

AP: రాష్ట్రంలోని ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు రాజకీయ కార్యకలాపాలకు, రాజకీయ ప్రేరేపిత ఆందోళనలు, నిరసనలకు వేదికలుగా మారకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పోటీ పరీక్షలకు అభ్యర్థులను సిద్ధం చేయాల్సిన కోచింగ్ సంస్థలు తమ పరిధిని దాటి వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించి, ప్రైవేటు కోచింగ్ కేంద్రాల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు.

ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో ప్రైవేటు కోచింగ్ కేంద్రాల వ్యవహారశైలిపై ప్రభుత్వం దృష్టి సారించింది. కొన్ని కోచింగ్ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వంపై రాజకీయంగా బురదజల్లే ఉద్దేశంతో కొందరు ప్రైవేటు కోచింగ్ కేంద్రాలపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు కూడా వివరించినట్లు ప్రభుత్వం తెలిపింది.

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులను కొన్ని సంస్థల నిర్వాహకులు రాజకీయ పరమైన ఆందోళనలు, నిరసనల్లో పాల్గొనేలా ప్రేరేపిస్తున్నట్టు అధికారులు గుర్తించినట్లు ప్రభుత్వం పేర్కొంది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు కోచింగ్ సంస్థల యజమానులు అభ్యర్థులను రాజకీయ కార్యక్రమాల్లోకి తీసుకెళ్లడం సరికాదని స్పష్టం చేసింది. చదువుపై, పోటీ పరీక్షలపై దృష్టి పెట్టాల్సిన అభ్యర్థులను రాజకీయ కార్యకలాపాలకు ఉపయోగించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.

ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కోచింగ్ కేంద్రాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి, అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా కోచింగ్ సంస్థలు తమ వద్ద శిక్షణ పొందుతున్న అభ్యర్థులపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి తీసుకురాకుండా చూడాలని సూచించారు. అభ్యర్థులను రాజకీయ కుట్రలు, ఆందోళనలు, నిరసనల్లో భాగస్వాములను చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ కోచింగ్ సంస్థల నియంత్రణా నిబంధనలు–2026 ప్రకారం ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు జీవో నెంబర్‌ 9లో పేర్కొన్న మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అన్ని జిల్లాల్లో అధికారులు కోచింగ్ కేంద్రాల నిర్వహణ తీరును పరిశీలించి, నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

మరోవైపు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఎలాంటి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు గురికాకుండా తమ భవిష్యత్తు, లక్ష్యాలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం సూచించింది. కోచింగ్ సంస్థల నుంచి తమపై రాజకీయ పరమైన ఒత్తిడి లేదా ఇతర ఇబ్బందులు ఉంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని పేర్కొంది.

ప్రైవేటు కోచింగ్ కేంద్రాల ప్రధాన ఉద్దేశం పోటీ పరీక్షలకు అభ్యర్థులను సిద్ధం చేయడమేనని, వాటిని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడాన్ని ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేసింది. జీవో నెంబర్‌ 9 మార్గదర్శకాలను ఉల్లంఘించే సంస్థలపై నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని ప్రభుత్వం తేల్చిచెప్పింది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.