AP: హౌసింగ్ ఫర్ ఆల్‌ లక్ష్యంపై సీఎం చంద్రబాబు ఫోకస్‌!

AP: ఆంధ్రప్రదేశ్‌లో 2027 మార్చి నాటికి 5.52 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని గృహ నిర్మాణ సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 15 Sept 2026 6:15 PM IST
AP
X

AP: హౌసింగ్ ఫర్ ఆల్‌ లక్ష్యంపై సీఎం చంద్రబాబు ఫోకస్‌!

AP: రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి సురక్షితమైన, శాశ్వతమైన ఇల్లు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 2029 నాటికి అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు అందించేలా ‘హౌసింగ్ ఫర్ ఆల్’ కార్యక్రమాన్ని సంతృప్తి స్థాయిలో అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

2027 మార్చి నాటికి 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. గృహ నిర్మాణ శాఖపై అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణ పురోగతి, కొత్త ఇళ్ల మంజూరు, ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీ, కేంద్ర పథకాల కింద నిధుల సమీకరణ, పారిశ్రామిక టౌన్‌షిప్‌ల నిర్మాణం వంటి అంశాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు.

వచ్చే నెలలోగా ఇళ్ల గ్రౌండింగ్‌

ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్‌, పీఎం జన్‌మన్‌ సహా వివిధ కేంద్ర, రాష్ట్ర పథకాల కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. వచ్చే నెలలోగా నిర్మాణానికి అర్హమైన ఇళ్లన్నింటినీ గ్రౌండింగ్‌ చేసేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో కూడా భారీగా గృహ నిర్మాణం చేపట్టాలని చెప్పారు. ముఖ్యంగా పట్టణ పేదలు, ఇళ్లు లేని అర్హులైన కుటుంబాలను గుర్తించి వారికి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో 1.50 లక్షల ఇళ్లను నిర్మించాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా నిర్దేశించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లను నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేయడంతో పాటు, కొత్తగా మంజూరయ్యే ఇళ్లను కూడా వెంటనే గ్రౌండింగ్‌ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఇళ్ల నిర్మాణంలో జాప్యానికి కారణాలను గుర్తించి, శాఖల మధ్య సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

డిసెంబరులోగా 2.05 లక్షల ఇళ్లు

2026 డిసెంబరు నాటికి 2.05 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. అనంతరం 2027 మార్చి నాటికి మరో 2.74 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. మొత్తంగా నిర్దేశిత లక్ష్యంలో 5.52 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసేలా పనులను వేగవంతం చేయాలని చెప్పారు.

ఇళ్ల నిర్మాణం కేవలం మంజూరు దశలోనే నిలిచిపోకుండా, గ్రౌండింగ్‌, నిర్మాణ పురోగతి, పూర్తిస్థాయి గృహ ప్రవేశం వరకు నిరంతర పర్యవేక్షణ ఉండాలని సీఎం సూచించారు. ప్రతి దశకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని అధికారులు పనిచేయాలని ఆదేశించారు.

18.72 లక్షల ఇళ్లకు మంజూరు

రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో పాటు ఇతర పథకాల కింద ఇప్పటివరకు 18.72 లక్షల ఇళ్లు మంజూరైనట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వీటిలో 13.20 లక్షల ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయినట్లు తెలిపారు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 16.11 లక్షల ఇళ్లకు గాను 11.31 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని అధికారులు వివరించారు.

అదేవిధంగా ఏపీ టిడ్కో పరిధిలో 2.61 లక్షల ఇళ్లకు గాను 1.88 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని సీఎంకు తెలిపారు. మిగిలిన ఇళ్ల నిర్మాణాన్ని కూడా వేగవంతం చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం సూచించారు.

కొత్తగా 75 వేల ఇళ్ల మంజూరు

భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త ఇళ్ల మంజూరుపైనా ప్రభుత్వం దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 2027 డిసెంబరు నాటికి 75 వేల కొత్త గృహాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదే సమయంలో మరో 1.50 లక్షల ఇళ్లను పైప్‌లైన్‌లోకి తీసుకురావాలని సూచించారు.

కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖలతో సమన్వయం పెంచుకుని రాష్ట్రానికి అవసరమైన కేటాయింపులు, అదనపు ఇళ్ల మంజూరు పొందాలని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర పథకాల ద్వారా గరిష్ట ప్రయోజనం పొందేలా రాష్ట్ర అధికారులు సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

ఇళ్ల స్థలాల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి

ఇళ్ల స్థలాలు లేని కుటుంబాలను గుర్తించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో వాస్తవంగా ఎంతమంది కుటుంబాలకు ఇళ్ల స్థలాలు అవసరమో కచ్చితంగా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఆర్టీజీఎస్‌, ఆవాస్ ప్లస్‌, హౌసింగ్‌, రెవెన్యూ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని అనుసంధానం చేయాలని సూచించారు.

వివిధ శాఖల డేటాను సమగ్రంగా పరిశీలించడం ద్వారా డూప్లికేషన్‌ను నివారించి నిజమైన అర్హులను గుర్తించాలని సీఎం చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత ఉండాలని స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో ప్రాథమిక లబ్ధిదారుల జాబితాలను ప్రచురించి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలని సూచించారు.

అభ్యంతరాలను పరిశీలించి అర్హత ఉన్నవారిని తుది జాబితాలో చేర్చడంతో పాటు, అనర్హులు లేదా డూప్లికేషన్‌ ఉన్న పేర్లను తొలగించాలని సీఎం ఆదేశించారు. తుది జాబితాలను పారదర్శకంగా ఖరారు చేసి, అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని చెప్పారు.

ఖాళీ లే అవుట్లను వినియోగించాలి

ఇప్పటికే ఉన్న హౌసింగ్ లే అవుట్లలో ఇళ్ల నిర్మాణం జరగకుండా ఖాళీగా ఉన్న భూమిని గుర్తించి అవసరానికి అనుగుణంగా పునర్వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. అవసరమైతే 2 లేదా 3 సెంట్ల ప్లాట్లుగా విభజించి అర్హులైన కుటుంబాలకు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు.

ఖాళీ స్థలాలను గుర్తించడం మాత్రమే కాకుండా, వాటిని అర్హులైన లబ్ధిదారులతో మ్యాపింగ్‌ చేయాలని చెప్పారు. లబ్ధిదారుడికి స్థలం కేటాయించిన తర్వాత నిర్మాణం పూర్తయ్యే వరకు అధికారులు పర్యవేక్షించాలని సీఎం సూచించారు. స్థలం కేటాయింపు, నిర్మాణ ప్రారంభం, నిర్మాణ పురోగతి, గృహ ప్రవేశం వరకు మొత్తం ప్రక్రియను ట్రాక్‌ చేసే విధంగా వ్యవస్థను రూపొందించాలని చెప్పారు.

కుప్పంలో సాచురేషన్‌ విధానంలో గృహ నిర్మాణం

కుప్పం నియోజకవర్గంలోనూ సాచురేషన్‌ విధానంలో గృహ నిర్మాణాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అర్హులైన కుటుంబాలను పూర్తిస్థాయిలో గుర్తించి, వారికి అవసరమైన గృహ సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ పథకాల ద్వారా ఇప్పటికే లబ్ధి పొందిన కుటుంబాలు, ఇంకా ఇల్లు లేని కుటుంబాలు, ఇళ్ల స్థలాలు ఉన్నా నిర్మాణం చేసుకోలేని కుటుంబాలను వేర్వేరుగా గుర్తించి అవసరమైన సహాయం అందించాలని అధికారులకు సూచించారు. సాచురేషన్‌ విధానం ద్వారా ఒక ప్రాంతంలో అర్హులైన కుటుంబాలందరికీ గృహ సదుపాయం కల్పించడమే లక్ష్యంగా పని చేయాలని చెప్పారు.

పరిశ్రమల ప్రాంతాల్లో టౌన్‌షిప్‌లు

గృహ నిర్మాణాన్ని కేవలం ఇళ్లకే పరిమితం చేయకుండా పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధితో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కేంద్ర సహకారంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పారిశ్రామిక టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని గృహ నిర్మాణ శాఖను ఆదేశించారు.

శ్రీసిటీతో పాటు ఇతర పారిశ్రామిక ప్రాంతాల్లో ఉద్యోగులు, కార్మికులు, ఇతర అవసరాల కోసం ప్రణాళికాబద్ధమైన టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని సీఎం పేర్కొన్నారు. పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులతో పాటు నివాస సదుపాయాలను కూడా సమగ్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఏపీఐఐసీతో సమన్వయం

ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌ల నిర్మాణానికి సంబంధించి ఏపీ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌ (ఏపీఐఐసీ)తో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించి, అక్కడ నివాస, రవాణా, మౌలిక వసతులను సమగ్రంగా అభివృద్ధి చేసే విధంగా ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధులను వినియోగించుకునే అవకాశాలను కూడా పరిశీలించాలని సీఎం చెప్పారు. పారిశ్రామిక ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు, అక్కడ పనిచేసే వారికి సరసమైన ధరల్లో లేదా ప్రభుత్వ ప్రణాళికల ద్వారా గృహ సదుపాయం కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు.

శాఖల మధ్య సమన్వయంతో లక్ష్యం సాధించాలి

2029 నాటికి రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి సురక్షితమైన, శాశ్వతమైన ఇల్లు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. హౌసింగ్‌ శాఖ ఒక్కటే ఈ లక్ష్యాన్ని సాధించలేదని, రెవెన్యూ, ఆర్టీజీఎస్‌, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, ఆర్థిక శాఖలతో పాటు స్థానిక సంస్థలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు.

లబ్ధిదారుల గుర్తింపు నుంచి ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రతి దశలో స్పష్టమైన బాధ్యతలు, కాలపరిమితులు ఉండాలని సీఎం ఆదేశించారు. నిర్మాణ పనుల్లో ఎదురయ్యే సమస్యలను స్థానిక స్థాయిలోనే పరిష్కరించేలా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు.

ప్రజలకు నేరుగా ఉపయోగపడే గృహ నిర్మాణ పథకాలను వేగవంతం చేసి, అర్హులైన కుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేయాలని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తి చేసేలా అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, హౌసింగ్‌ శాఖ, ఆర్థిక శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.