Amaravati: మదర్ థెరిసా నిస్వార్థ సేవలు స్ఫూర్తిదాయకం!
Amaravati: మదర్ థెరిసా జయంతి సందర్భంగా ఆమె నిస్వార్థ సేవలను సీఎం చంద్రబాబు స్మరించుకున్నారు. ఆమె చూపిన సేవా మార్గం అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
Amaravati: మదర్ థెరిసా నిస్వార్థ సేవలు స్ఫూర్తిదాయకం!
Amaravati: సాటివారిలోని బాధను తొలగించడమే నిజమైన దైవత్వమని నమ్మి, జీవితాంతం నిరుపేదలు, అనాథలు, అభాగ్యుల సేవకు అంకితమైన మహనీయురాలు మదర్ థెరిసా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. మదర్ థెరిసా జయంతి సందర్భంగా ఆమె సేవలను స్మరించుకుంటూ సీఎం సందేశం ఇచ్చారు...
పేదరికం, ప్రేమరాహిత్యం, అనారోగ్యం, అనాథత్వంతో బాధపడుతున్న నిస్సహాయులను అక్కున చేర్చుకుని వారికి ప్రేమను పంచిన మదర్ థెరిసా సేవలు ప్రపంచవ్యాప్తంగా మానవత్వానికి ప్రతీకగా నిలిచాయని పేర్కొన్నారు. ఎలాంటి భేదాలు లేకుండా బాధితులకు అండగా నిలవడం, వారి జీవితాల్లో ఆశను నింపడం ద్వారా ఆమె మానవతా విలువలకు కొత్త అర్థాన్ని చూపించారని తెలిపారు.
తన జీవితాన్ని పూర్తిగా సేవకే అంకితం చేసిన మదర్ థెరిసా.. కరుణ, ప్రేమ, దయ, సేవాభావాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారని చంద్రబాబు పేర్కొన్నారు. సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాల పట్ల బాధ్యతతో వ్యవహరించాలనే సందేశాన్ని ఆమె తన ఆచరణ ద్వారా ప్రపంచానికి చాటిచెప్పారని అన్నారు.
మానవ సేవే మాధవ సేవ అన్న భావనతో ముందుకు సాగిన ఆమె జీవితం నేటి తరానికి కూడా ఎంతో స్ఫూర్తిదాయకమని తెలిపారు. స్వార్థానికి అతీతంగా ఇతరుల కోసం జీవించడం, ఆపదలో ఉన్నవారికి చేయూతనివ్వడం ద్వారా సమాజంలో మానవత్వాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
మదర్ థెరిసా చూపిన సేవా మార్గాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ తమకు సాధ్యమైన రీతిలో పేదలు, బలహీనులు, అవసరంలో ఉన్నవారికి అండగా నిలవాలని చంద్రబాబు ఆకాంక్షించారు.




