AP: చీరాలలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా 'నేతన్న సేవలో' పథకం ప్రారంభం!
AP: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'నేతన్న సేవలో' నూతన సంక్షేమ పథకాన్ని ప్రారంభించింది.
AP: చీరాలలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా 'నేతన్న సేవలో' పథకం ప్రారంభం!
AP: ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగానికి ఊతమివ్వాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘నేతన్న సేవలో’ పేరుతో కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా చీరాలలో ఈ పథకం ప్రారంభం కానుంది. ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 71,536 చేనేత కుటుంబాలకు రూ.179 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనుంది. మేనిఫెస్టోలో హామీ లేకపోయినా చేనేత కుటుంబాల సంక్షేమం, వృత్తి పరిరక్షణ లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
రాష్ట్రంలో సంప్రదాయ చేనేత వృత్తి అనేక కుటుంబాలకు జీవనాధారం. అయితే ముడిసరుకు ధరల పెరుగుదల, మార్కెట్ పోటీ, పవర్‌లూమ్ ప్రభావం వంటి కారణాలతో ఈ రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో చేనేత కుటుంబాలకు ప్రత్యక్ష ఆర్థిక చేయూత అందించడం ద్వారా వృత్తిపై నమ్మకం పెంచడంతో పాటు యువతను కూడా చేనేత వైపు ఆకర్షించాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది.
కేవలం ‘నేతన్న సేవలో’ పథకంతోనే కాకుండా ఇప్పటికే పలు సంక్షేమ చర్యలను ప్రభుత్వం అమలు చేస్తోంది. చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు, పవర్‌లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. దీని ద్వారా 62,541 చేనేత కుటుంబాలు, 10,032 పవర్‌లూమ్ యూనిట్లు లబ్ధి పొందుతున్నాయి. ఈ పథకం కోసం ప్రభుత్వం ఏటా సుమారు రూ.150 కోట్లు వెచ్చిస్తోంది.
అదేవిధంగా 50 ఏళ్లు దాటిన 85 వేల మంది చేనేత కార్మికులకు నెలకు రూ.4 వేల పింఛన్ అందిస్తూ, ఇందుకోసం ఏటా రూ.420 కోట్లు ఖర్చు చేస్తోంది. మరోవైపు 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు రూ.79 కోట్ల క్యాష్ క్రెడిట్ సౌకర్యం కల్పించడం ద్వారా సహకార వ్యవస్థకు బలాన్నిస్తోంది.
చేనేత రంగాన్ని ఆధునికీకరించే దిశగా కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్కు, అమరావతి శాఖమూరులో చేనేత-హస్తకళల మ్యూజియం ఏర్పాటు వంటి కార్యక్రమాలు అమలులో ఉన్నాయి. అలాగే విశాఖపట్నంలో రూ.4,200 కోట్ల పెట్టుబడితో సుస్థిర టెక్స్‌టైల్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు కానుండడం రాష్ట్ర వస్త్ర పరిశ్రమకు కొత్త అవకాశాలను తెరుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చీరాల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వేటపాలెం మండలం కొత్తపేటలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ‘నేతన్న సేవలో’ పథకాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం జాండ్రపేటలో చేనేతల వర్క్‌షాప్‌ను సందర్శించి లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు, సూచనలు తెలుసుకోనున్నారు.
చేనేత అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు... తెలుగు సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక. అలాంటి రంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం, నేతన్న కుటుంబాలకు భరోసా కల్పించడం ద్వారా చేనేతకు మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ‘నేతన్న సేవలో’ పథకం చేనేత కుటుంబాలకు తక్షణ ఆర్థిక ఊరటనివ్వడమే కాకుండా, ఈ రంగానికి దీర్ఘకాలిక ప్రోత్సాహాన్ని అందించే చర్యగా మారుతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.




