AP: కలెక్టర్ల సదస్సులో విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధిపై సీఎం దిశానిర్దేశం!
AP: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు: 2027 నాటికి 100% అక్షరాస్యత సాధించాలి, పరిశ్రమల్లో స్థానిక యువతకే ఉద్యోగాలు దక్కేలా నైపుణ్య శిక్షణ అందించాలి.
AP: కలెక్టర్ల సదస్సులో విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధిపై సీఎం దిశానిర్దేశం!
AP: రాష్ట్రంలో పాలనను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. కలెక్టర్ల సదస్సులో పురపాలక, విద్య, వైద్యారోగ్యం, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. ఆయా అంశాల్లో జిల్లాల వారీగా చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
పురపాలక శాఖకు సంబంధించి స్వచ్ఛవాయు సర్వేక్షణ్‌లో గుంటూరు జాతీయ స్థాయిలో రెండో స్థానం సాధించడాన్ని సీఎం అభినందించారు. గుంటూరు, విజయవాడలోని వార్డులకు నేషనల్ క్లీన్ ఎయిర్ సిటీస్ విభాగంలో అవార్డులు లభించాయని తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలోని నగరాలు జాతీయ స్థాయిలో ఐదు అవార్డులు సాధించడంతో పాటు రూ.1.05 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని దక్కించుకున్నాయని పేర్కొన్నారు. గుంటూరు, ఏలూరు, విజయనగరం, విజయవాడ, నెల్లూరు, శ్రీకాకుళం, చిత్తూరు నగరాల్లో అత్యుత్తమ పనితీరు కనిపించిందని సీఎం తెలిపారు.
యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించడం నిరంతర ప్రక్రియగా కొనసాగాలని చంద్రబాబు స్పష్టం చేశారు. భవిష్యత్‌లో పరిశ్రమలకు అవసరమయ్యే నైపుణ్యాలు ఏమిటో ముందుగానే గుర్తించి, యువతకు వాటిపై శిక్షణ అందించాలని సూచించారు. ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు పరిశ్రమలను అనుసంధానం చేసి అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించాలని కలెక్టర్లను ఆదేశించారు.
ప్రధానమంత్రి స్కిల్ ఇండియా కార్యక్రమాల్లో భాగంగా పీఎం సేతు కార్యక్రమాన్ని విశాఖతో పాటు ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించి యువతకు మరిన్ని నైపుణ్యాలు కల్పించాలని సూచించారు. పరిశ్రమల సీఎస్ఆర్ నిధులను కూడా నైపుణ్యాభివృద్ధికి వినియోగించే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చినప్పుడు స్థానిక యువతకే ఉద్యోగ అవకాశాలు దక్కేలా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు.
నియోజకవర్గాల వారీగా జాబ్ ఫెయిర్లు నిర్వహించి, పరిశ్రమల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగాలపై యువతకు అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ఇప్పటివరకు 4.98 లక్షల మంది యువత నైపుణ్య పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. నైపుణ్యాభివృద్ధిపై ప్రజల్లో కూడా విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
విద్యా రంగంపై మాట్లాడుతూ 2027 నాటికి ‘అక్షర ఆంధ్ర’ కార్యక్రమం ద్వారా వంద శాతం అక్షరాస్యత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు తెలిపారు. ఏపీని ‘లిటరేట్, లెర్న్డ్ స్టేట్’గా మార్చాలని, విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతిక అంశాల్లోనూ నైపుణ్యం కల్పించాలని సూచించారు. పాఠశాల భవనాల భద్రతపై ఆడిటింగ్ నిర్వహించి, లోపాలను గుర్తించి సురక్షితంగా మార్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వైద్యారోగ్యంపై కూడా సీఎం ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ప్రజల ఆరోగ్యం అత్యంత ముఖ్యమైన అంశమని, ప్రతి నెలా ఒక రోజు ‘సంజీవని’ కార్యక్రమం ద్వారా వైద్యారోగ్య పరిరక్షణపై క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నానని తెలిపారు. టెక్నాలజీని వైద్య రంగంతో మరింతగా అనుసంధానం చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు.




