Amaravati: అమరావతి భవనాల ఇంటీరియర్ డిజైన్లపై సీఎం చంద్రబాబు సమావేశం!
Amaravati: అమరావతి అసెంబ్లీ, హైకోర్టు ఇంటర్నల్ డిజైన్లపై నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం. ప్రపంచస్థాయి ప్రమాణాలే లక్ష్యం.
Amaravati: అమరావతి భవనాల ఇంటీరియర్ డిజైన్లపై సీఎం చంద్రబాబు సమావేశం!
Amaravati: రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న కీలక భవనాల డిజైన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు నార్మన్ పోస్టర్స్ సంస్థ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. రాజధాని నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ భవనాల డిజైన్ల పురోగతిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
అమరావతిలో నిర్మిస్తున్న అసెంబ్లీ, హైకోర్టు సహా పలు ఐకానిక్ భవనాలకు నార్మన్ పోస్టర్స్ సంస్థ డిజైన్లను రూపొందించింది. ఇప్పటికే భవనాల నిర్మాణానికి సంబంధించిన ప్రధాన డిజైన్లు, ఆర్కిటెక్చరల్ అంశాలపై సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించింది. తాజాగా భవనాల అంతర్గత రూపకల్పనకు సంబంధించిన అంశాలపై కూడా సంస్థ సమగ్ర డిజైన్లను సిద్ధం చేసింది.
ఈ రోజు జరిగే సమావేశంలో ఇంటర్నల్ డిజైన్స్, ఇంటీరియర్ డిజైన్, భవనాల లోపలి నిర్మాణ శైలి, సౌకర్యాలు, ఆధునిక సాంకేతికత వినియోగం తదితర అంశాలకు సంబంధించిన పూర్తి డిజైన్లను నార్మన్ పోస్టర్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి సమర్పించనున్నట్లు సమాచారం. భవనాల బాహ్య రూపంతో పాటు అంతర్గత నిర్మాణం కూడా ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం వివిధ నిర్మాణ పనులను వేగవంతం చేస్తోంది. ఇప్పటికే కీలక మౌలిక వసతుల పనులకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం.. అసెంబ్లీ, హైకోర్టు, ఇతర ఐకానిక్ భవనాల నిర్మాణాన్ని కూడా నిర్ణీత ప్రమాణాలతో పూర్తి చేయాలని భావిస్తోంది.
ముఖ్యంగా అమరావతి భవనాలు రాష్ట్ర పరిపాలనకు ప్రతీకలుగా నిలిచేలా, ఆధునికతతో పాటు ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, చరిత్ర, ప్రత్యేకత ప్రతిబింబించేలా డిజైన్లలో మార్పులు, చేర్పులపై సీఎం చంద్రబాబు సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. నేటి సమావేశం అనంతరం భవనాల అంతర్గత డిజైన్లకు సంబంధించి తదుపరి కార్యాచరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.




