ప్రధాని పర్యటన సక్సెస్...టీం వర్క్‌కు సీఎం చంద్రబాబు ప్రశంసలు....

Amaravati: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవ సభ విజయవంతం కావడంపై సీఎం చంద్రబాబు హర్షం. మంత్రులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ప్రత్యేక అభినందనలు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 1 Aug 2026 9:56 PM IST
Amaravati
X

ప్రధాని పర్యటన సక్సెస్...టీం వర్క్‌కు సీఎం చంద్రబాబు ప్రశంసలు....

అమరావతి: అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం (భోగాపురం) ప్రారంభోత్సవం విజయవంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమం ఉత్తరాంధ్ర చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించారని ఆయన పేర్కొన్నారు. థింసా నృత్యంతో ప్రధానికి స్వాగతం పలకడం నుంచి బహిరంగ సభ ముగిసే వరకు ప్రతి అంశం సమన్వయంతో, అత్యంత ప్రణాళికాబద్ధంగా సాగిందని సీఎం ప్రశంసించారు.

విశాఖపట్నం నుంచి అమరావతికి చేరుకున్న అనంతరం ముఖ్యమంత్రి కార్యక్రమ నిర్వహణలో కీలక బాధ్యతలు చేపట్టిన మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగంతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమం విజయవంతం కావడానికి శ్రమించిన ప్రతి ఒక్కరినీ అభినందించారు. "గుడ్ జాబ్... ఎక్స్‌లెంట్ టీం వర్క్" అంటూ మంత్రులు, అధికారుల పనితీరును ప్రత్యేకంగా ప్రశంసించారు.

భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఉత్తరాంధ్ర ప్రజల నుంచి లభించిన అపూర్వ స్పందన తనను ఎంతో ఆనందానికి గురి చేసిందని సీఎం అన్నారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఎంతటి మద్దతు ఇస్తారో ఈ సభ మరోసారి నిరూపించిందన్నారు. వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం, కార్యక్రమాన్ని తమ ఇంటి పండుగలా భావించడం విశేషమని పేర్కొన్నారు.

ప్రజల రవాణా, భోజన వసతులు, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాల్లో అధికారులు సమర్థవంతంగా పనిచేశారని సీఎం అభినందించారు. ప్రత్యేక బస్సుల ద్వారా ప్రజలను సురక్షితంగా సభా ప్రాంగణానికి తరలించడం, తిరిగి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గమ్యస్థానాలకు పంపించడం, ట్రాఫిక్‌ను సమర్థంగా నియంత్రించడం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రజలు కూడా భోజన, రవాణా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు మంత్రులు సీఎంకు వివరించారు.

ఇలాంటి భారీ కార్యక్రమాల విజయానికి వ్యక్తిగత కృషి కంటే సమష్టి కృషే కీలకమని చంద్రబాబు స్పష్టం చేశారు. మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు, వివిధ శాఖల సిబ్బంది ఒకే లక్ష్యంతో కలిసి పనిచేయడం వల్లే ఈ స్థాయి విజయాన్ని సాధించగలిగామని అన్నారు. భవిష్యత్తులో నిర్వహించే రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో కూడా ఇదే సమన్వయం కొనసాగించాలని సూచించారు.

భోగాపురం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసిన అధికారులను ప్రత్యేకంగా సత్కరించి అవార్డులు అందజేయాలని సీఎం నిర్ణయించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే అధికారులను ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, సీనియర్ అధికారులు కృష్ణబాబు, వీరపాండ్యన్, ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ విశ్వనాథ్‌తో పాటు సీఎంవో అధికారులు పాల్గొన్నారు...

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story