Vijayawada: న్యాయవాదుల బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు మంత్రి మండిపల్లి ఆహ్వానం!

Vijayawada: అక్టోబర్ 3, 4న విజయవాడలో రాష్ట్రస్థాయి న్యాయవాదుల బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2026.

Hari Kishan  AP Bureau Chief
Published on: 2 Sept 2026 5:31 PM IST
Vijayawada
X

Vijayawada: న్యాయవాదుల బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు మంత్రి మండిపల్లి ఆహ్వానం!

Vijayawada: రాష్ట్రస్థాయి న్యాయవాదుల షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌–2026కు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని ది బెజవాడ బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు బార్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి టోర్నమెంట్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

విజయవాడలోని చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియంలో అక్టోబర్ 3, 4 తేదీల్లో రాష్ట్రస్థాయి అడ్వకేట్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నట్లు ప్రతినిధులు మంత్రికి వివరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన న్యాయవాదులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

న్యాయవృత్తిలో నిరంతరం ప్రజా సమస్యలు, న్యాయపరమైన అంశాలపై పనిచేసే న్యాయవాదులకు క్రీడలు ఉత్సాహాన్ని, మానసిక ఉల్లాసాన్ని అందించడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.

న్యాయవాదుల్లో క్రీడా ప్రతిభను ప్రోత్సహించడం, పరస్పర స్నేహభావాన్ని పెంపొందించడం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న న్యాయవాదుల మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు బార్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు, క్రీడాకారులకు అందించాల్సిన సౌకర్యాలు, మ్యాచ్‌ల నిర్వహణ తదితర అంశాలపై కూడా వారు మంత్రితో చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి టోర్నమెంట్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. న్యాయవాదులు వృత్తిపరమైన బాధ్యతలతో పాటు ఆరోగ్యం, క్రీడలపై కూడా దృష్టి సారించడం అభినందనీయమన్నారు. రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను నిర్వహించడం ద్వారా న్యాయవాదుల్లో క్రీడాస్ఫూర్తి మరింత పెంపొందుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యులు చలసాని అజయ్ బాబు, ది బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి. కిరణ్, ఈసీ సభ్యుడు టి. కిరణ్, స్పోర్ట్స్ సెక్రటరీ జి. రామ్ తేజ, ఆర్గనైజర్ రైసా తదితరులు పాల్గొన్నారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story