ఆర్టీసీ సేవల నాణ్యత, ఆదాయాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి..
Amaravati: ఏపీఎస్ఆర్టీసీ పనితీరు, ప్రయాణికుల సేవలు, ఆదాయ పెంపుపై ఎండీ కోన శశిధర్ సమీక్ష. స్త్రీ శక్తి, దివ్యాంగ శక్తి పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి.
ఆర్టీసీ సేవల నాణ్యత, ఆదాయాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) పనితీరును మరింత మెరుగుపర్చడం, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం, ఆదాయాన్ని పెంచడంతో పాటు వ్యయాలను నియంత్రించడంపై సంస్థ ఎండీ కోన శశిధర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆర్టీసీ హౌస్‌లో శనివారం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు...
సమావేశంలో వివిధ విభాగాల అధికారులు తమ శాఖల ప్రస్తుత కార్యకలాపాలు, పనితీరు, గణాంకాలు, సాధించిన పురోగతి, ఆదాయ వనరులు, నిర్వహణకు సంబంధించిన అంశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎండీకి వివరించారు. ఆయా విభాగాల పనితీరును సమీక్షించిన కోన శశిధర్.. సంస్థ లక్ష్యాలను సమర్థవంతంగా సాధించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఆర్టీసీ ఆస్తుల నిర్వహణలో నాణ్యత, బస్సుల అందుబాటు, వనరుల సమర్థ వినియోగం, నిర్వహణ వ్యయాల నియంత్రణ, ఆదాయాన్ని పెంపొందించే మార్గాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆదేశించారు. బస్సుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా, ప్రయాణికులకు అవసరమైన సమయంలో బస్సులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అదే విధంగా బస్‌స్టేషన్లలో ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, సేవలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఎండీ పేర్కొన్నారు. బస్‌స్టేషన్లలో పరిశుభ్రత, మౌలిక సదుపాయాలు, ప్రయాణికుల సౌకర్యాలపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని సూచించారు. ప్రయాణికుల సంతృప్తిని పెంచేలా సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సంస్థ అభివృద్ధితో పాటు ఉద్యోగుల సంక్షేమానికి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోన శశిధర్ స్పష్టం చేశారు. సూపర్ సిక్స్‌లో భాగమైన స్త్రీ శక్తి పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించేలా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే దివ్యాంగ శక్తి పథకం అమలులోనూ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
అన్ని విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించాలని ఎండీ అన్నారు. సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను సాధించే దిశగా అధికారులు, సిబ్బంది సమష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆర్టీసీ పనితీరును మరింత మెరుగుపరచడం, ప్రయాణికుల సంతృప్తిని పెంచడం, ఆదాయాన్ని పెంచడం, వ్యయాలను నియంత్రించడం, ఉద్యోగుల సంక్షేమాన్ని పరిరక్షించడం వంటి అంశాలకు సమగ్ర ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని కోన శశిధర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. శివ ప్రసాద్, ఐఎఫ్ఎస్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కె.ఎస్. బ్రహ్మానందరెడ్డి, జి.వి. రవి వర్మ, రాఘవ కుమార్, ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ఎన్. సుధాకర్‌తో పాటు వివిధ విభాగాల హెడ్‌లు పాల్గొన్నారు.




