AP: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి విస్తరించనున్న వర్షాలు విపత్తు సంస్థ!

AP: ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్ 14న పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, పిడుగులు పడే అవకాశం. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక.

Hari Kishan  AP Bureau Chief
Published on: 13 Sept 2026 6:50 PM IST
AP
X

AP: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి విస్తరించనున్న వర్షాలు విపత్తు సంస్థ!

AP: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు విస్తరించే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర విదర్భ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో రాజస్థాన్, గుజరాత్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వివరించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

సోమవారం అంటే సెప్టెంబర్ 14న మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. పిడుగులు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా చెట్ల కింద, హోర్డింగ్స్ వద్ద, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాల్లో నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. వర్షం, పిడుగులు, ఈదురుగాలుల సమయంలో అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ఇదిలా ఉండగా.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షపాతం నమోదైంది. శనివారం ఉదయం 8:30 గంటల నుంచి ఆదివారం ఉదయం 8:30 గంటల వరకు కృష్ణా జిల్లా పెనమలూరులో అత్యధికంగా 100.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో 97.6 మిల్లీమీటర్లు, పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 94.2 మిల్లీమీటర్లు, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో 90.8 మిల్లీమీటర్లు, బాపట్ల జిల్లా మార్టూరులో 90.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

అదే సమయంలో కోనసీమ జిల్లా అయినవిల్లిలో 89.6 మిల్లీమీటర్లు, పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో 88.4 మిల్లీమీటర్లు, ప్రకాశం జిల్లా అద్దంకిలో 85.4 మిల్లీమీటర్లు, కోనసీమ జిల్లా సఖినేటిపల్లిలో 84.6 మిల్లీమీటర్లు, గుంటూరు పశ్చిమలో 84.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

ఆదివారం ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగాయి. శ్రీకాకుళం జిల్లా మెట్టక్కివలసలో 34.1 మిల్లీమీటర్లు, తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో 33 మిల్లీమీటర్లు, నర్సన్నపేటలో 32.2 మిల్లీమీటర్లు, విజయనగరం జిల్లా మల్లంపేటలో 31.2 మిల్లీమీటర్లు, శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో 31 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

రానున్న 24 గంటల్లో వర్షాలు, పిడుగులు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అధికారుల సూచనలు పాటించాలని కోరింది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.