AP: అల్పపీడనంతో ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన!
AP: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, ఈదురుగాలుల హెచ్చరిక. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఆదేశం.
AP: అల్పపీడనంతో ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన!
AP: వాయువ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాగల 24 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలపడే అవకాశం ఉందని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. అల్పపీడనం ప్రభావంతో శనివారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
శనివారం శ్రీకాకుళం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు.
ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు, దక్షిణ కోస్తా తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు చెట్లు, హోర్డింగుల కింద నిలబడవద్దని సూచించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.
ఇప్పటికే శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు శ్రీకాకుళం జిల్లా ఎంఎస్ పల్లిలో 39.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనకాపల్లి పరవాడలో 17.7, కాకినాడ శంఖవరంలో 16.5, అల్లూరి జిల్లా రామరాజపాలెంలో 15.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి శ్రీకాకుళం, మన్యం, అల్లూరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.




