Amaravati: తాగునీటికే తొలి ప్రాధాన్యత..లోటు వర్షపాతం నేపథ్యంలో సీఎం కీలక ఆదేశాలు..

Amaravati: ఏపీలో నీటి ఎద్దడి నివారణకు తాగునీటికే తొలి ప్రాధాన్యం. పోలవరం ఎడమ కాలువ పనులను వచ్చే ఏడాది మార్చి నాటికి విశాఖ వరకు పూర్తి చేయాలని సీఎం ఆదేశం.

Hari Kishan  AP Bureau Chief
Published on: 14 Aug 2026 4:48 PM IST
Amaravati
X

Amaravati: తాగునీటికే తొలి ప్రాధాన్యత..లోటు వర్షపాతం నేపథ్యంలో సీఎం కీలక ఆదేశాలు..

Amaravati: రాష్ట్రంలో వర్షపాతం లోటుగా ఉన్న పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న ప్రతి నీటి వనరును సమర్థంగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. పట్టణాలు, గ్రామాల్లో తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యత ఇచ్చి.. ఆ తర్వాతే పారిశ్రామిక, ఇతర అవసరాలకు నీటిని కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రిజర్వాయర్లు, చెరువుల్లో ఉన్న నీటి నిల్వలతో పాటు భూగర్భ జలాలను కూడా ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు.

సచివాలయంలో శుక్రవారం జలవనరుల శాఖపై నిర్వహించిన సమీక్షలో పోలవరం, వెలిగొండ ప్రాజెక్టుల పురోగతితో పాటు రాష్ట్రంలోని 36 ప్రాధాన్యతా ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, నీటి విడుదల, తాగునీటి సరఫరా, జలధార–జలహారతి కార్యక్రమాలపై సీఎం సమగ్రంగా సమీక్షించారు. నీటి నిర్వహణ మొత్తం ‘వాటర్ మూమెంట్ ప్లాన్’కు అనుగుణంగానే సాగాలని స్పష్టం చేశారు.

పోలవరం పనులకు మరింత వేగం

రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటి వరకు ప్రాజెక్టులో 89.9 శాతం సివిల్ పనులు పూర్తయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. ఎడమ కాలువ పనులను యుద్ధప్రాతిపదికన కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈసీఆర్ఎఫ్ గ్యాప్-1, గ్యాప్-2 పనులను కూడా వేగవంతం చేసినట్లు వెల్లడించారు.

ఇటీవల గోదావరికి 14 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చినప్పటికీ ప్రాజెక్టు పనులకు ఎలాంటి అంతరాయం కలగకుండా కొనసాగించామని అధికారులు వివరించారు. డ్యామ్ సైట్ వద్ద రహదారులతో పాటు ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులను కూడా పూర్తి చేయాలని సీఎం సూచించారు.

పోలవరం ప్రాజెక్టు పరిసరాలను కేవలం నీటి ప్రాజెక్టుగా కాకుండా పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చేయాలని చంద్రబాబు సూచించారు. ప్రాజెక్టు సమీపంలోని గండి పోశమ్మ ఆలయాన్ని పరిరక్షిస్తూ.. స్థానిక ప్రజల సెంటిమెంట్‌కు ఎలాంటి భంగం కలగకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు.

మార్చి నాటికి విశాఖ వరకూ ఎడమ కాలువ

పోలవరం ఎడమ కాలువలో మిగిలిన పనులను వచ్చే ఏడాది మార్చి నాటికి విశాఖ వరకు పూర్తి చేయాలని సీఎం స్పష్టమైన లక్ష్యం నిర్దేశించారు. అప్పటి వరకు అనకాపల్లి వరకు ఉన్న నీటి వనరులు, రిజర్వాయర్లు, చెరువులను నీటితో నింపేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

పోలవరం కుడి, ఎడమ కాలువల్లో 17,500 క్యూసెక్కుల నీటి ప్రవాహానికి అనుగుణంగా పనులు చేపట్టాలని ఆదేశించారు. రెండు కాలువలకు ఆకర్షణీయమైన, ప్రజలకు సులభంగా గుర్తుండిపోయే పేర్లను సూచించాలని అధికారులకు చెప్పారు.

డేటా సెంటర్లపై దుష్ప్రచారానికి చెక్

రాష్ట్రంలో ఏర్పాటు కానున్న డేటా సెంటర్లకు భారీగా నీరు అవసరమవుతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. మొత్తం డేటా సెంటర్ల అవసరాలకు 3.5 టీఎంసీల నీరు సరిపోతుందని స్పష్టం చేశారు.

నీటి అవసరాలపై వాస్తవాలను ప్రజలకు వివరించాలని అధికారులను ఆదేశించారు. లోటు వర్షపాతం పరిస్థితుల్లో కూడా తాగునీటికి మొదటి ప్రాధాన్యత కొనసాగుతుందని, పారిశ్రామిక అవసరాలకు కూడా ఇబ్బంది కలగకుండా సమతుల్యంగా నీటి నిర్వహణ చేపడతామని సీఎం స్పష్టం చేశారు.

నీటి పొదుపుపై రైతులకు అవగాహన

ప్రస్తుత నీటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ సీజన్‌లో ఆరు తడి పంటలు సాగు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. నీటి లభ్యతను బట్టి పంటల ఎంపిక ఉండేలా రైతులను చైతన్యపరచాలని అధికారులను ఆదేశించారు.

భూగర్భ జలాలను పెంచే దిశగా జలధార–జలహారతి కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించాలని సూచించారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకించే చర్యలతో పాటు చెరువులు, ఇతర నీటి వనరుల పునరుద్ధరణపై దృష్టి పెట్టాలని చెప్పారు.

గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర, కృష్ణా డెల్టాకు భరోసా

రాష్ట్రానికి పుష్కలమైన నీటి వనరులు ఉన్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గోదావరి జలాలను అవసరానికి అనుగుణంగా ఉత్తరాంధ్రతో పాటు కృష్ణా డెల్టా ప్రాంతానికి తరలించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

నీటి లభ్యతను పెంచడం మాత్రమే కాకుండా.. ఒక ప్రాంతంలో అందుబాటులో ఉన్న నీటిని అవసరమైన మరో ప్రాంతానికి తరలించే సమగ్ర ప్రణాళిక ఉండాలని స్పష్టం చేశారు. నీటి వనరుల అనుసంధానంతో రాష్ట్రవ్యాప్తంగా సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు భద్రత కల్పించే దిశగా ముందుకు సాగాలని అధికారులకు సూచించారు.

విశాఖ–అమరావతి అంతర్గత జల రవాణా

విశాఖ నుంచి అమరావతి వరకు అంతర్గత జల రవాణా మార్గాలతో అనుసంధానించే అవకాశాలను పరిశీలించాలని సీఎం ఆదేశించారు. జల వనరులను కేవలం సాగు, తాగునీటి అవసరాలకే పరిమితం చేయకుండా రవాణా, పర్యాటకం, ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఉపయోగించుకునే విధంగా సమగ్ర ప్రణాళిక రూపొందించాలన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా జలవనరుల శాఖ ఆధీనంలో ఉన్న భూములను కూడా సద్వినియోగం చేసుకునే అవకాశాలపై అధ్యయనం చేయాలని సూచించారు.

వెలిగొండకు ప్రాధాన్యత

వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయడంతో పాటు నిర్వాసితుల సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్టు పూర్తితో ప్రయోజనం పొందే ప్రాంతాలకు నీటిని అందించడంతో పాటు నిర్వాసిత కుటుంబాల సమస్యలకు కూడా సమగ్ర పరిష్కారం చూపాలని ఆదేశించారు.

36 ప్రాజెక్టులకు నెలవారీ లక్ష్యాలు

రాష్ట్రంలో ప్రాధాన్యతా క్రమంలో చేపట్టనున్న 36 ప్రాజెక్టులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. ప్రాజెక్టుల వారీగా నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకుని.. ప్రతి నెల పురోగతిని సమీక్షించాలని ఆదేశించారు.

కేవలం పనులు జరుగుతున్నాయనే నివేదికలకు పరిమితం కాకుండా.. నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా భౌతిక పురోగతి, నిధుల వినియోగం, ఎదురవుతున్న సమస్యలు, పరిష్కార చర్యలను పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.

అన్నమయ్య ఆయకట్టుపై అధ్యయనం

అన్నమయ్య ప్రాజెక్టు దిగువన ఉన్న ఆయకట్టుకు నీటిని అందించే అవకాశాలపై కూడా సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులు, ప్రాజెక్టు సామర్థ్యం, ఆయకట్టు అవసరాలను పరిగణనలోకి తీసుకుని కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

రాష్ట్రంలో నీటి లభ్యతను పెంచడం, ఉన్న నీటిని పొదుపుగా వినియోగించడం, అవసరమైన ప్రాంతాలకు సమర్థంగా తరలించడం, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులను పూర్తి చేయడం.. ఈ నాలుగు అంశాలే ప్రస్తుత జల నిర్వహణలో కీలకంగా ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు.

ఈ సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ, చీఫ్ ఇంజినీర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story