Amaravati: అమరావతి అభివృద్ధికి యూకే సహకారం!

Amaravati: అమరావతి మరియు ఏపీలోని మున్సిపాలిటీల అభివృద్ధికి యూకే ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. సాంకేతికత, అర్బన్ ప్లానింగ్‌లో సహకారం అందించనున్నారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 25 Aug 2026 3:20 PM IST
Amaravati
X

Amaravati: అమరావతి అభివృద్ధికి యూకే సహకారం!

Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో పట్టణాభివృద్ధికి అంతర్జాతీయ సహకారం మరింత బలోపేతం కానుంది. యునైటెడ్ కింగ్‌డమ్ ప్రభుత్వంతో ఏపీ మున్సిపల్ శాఖ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. మౌలిక వసతులు, అర్బన్ ప్లానింగ్, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, అర్బన్ మొబిలిటీ వంటి రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఇరు ప్రభుత్వాలు అవగాహన ఒప్పందం చేసుకున్నాయి.

మంత్రి నారాయణ సమక్షంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, యూకే ప్రభుత్వ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ, తెలంగాణ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ విన్ ఒవెన్ హాజరయ్యారు. ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధి, ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి యూకే ప్రభుత్వం సాంకేతిక, ప్రణాళికా పరమైన సహకారం అందించనుంది.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. మౌలిక వసతులు, ప్రభుత్వ భాగస్వామ్యాలపై ఇరు ప్రభుత్వాల అధికారులు విస్తృతంగా చర్చలు జరిపినట్లు తెలిపారు. అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి యూకే ప్రభుత్వం సహకారం అందించనుందని చెప్పారు. ప్రపంచంలోని టాప్-5 నగరాల్లో ఒకటిగా అమరావతిని అభివృద్ధి చేయాలన్న లక్ష్యానికి ఈ ఎంఓయూ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

అర్బన్ ప్లానింగ్‌లో అత్యాధునిక విధానాలను అందిపుచ్చుకోవడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, పట్టణ రవాణా వ్యవస్థల ఆధునీకరణ, మౌలిక వసతుల అభివృద్ధిపై ఇరు దేశాల అధికారులు కలిసి పనిచేస్తారని మంత్రి వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అమరావతిని నిర్మించేందుకు ప్రపంచంలోని వివిధ దేశాల అనుభవాలను ఉపయోగించుకుంటున్నామని చెప్పారు.

రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో సుమారు రూ.40 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులను ఇప్పటికే ప్రారంభించామని నారాయణ తెలిపారు. రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పట్టణ రవాణా, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మౌలిక వసతుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రజలకు మెరుగైన పట్టణ జీవనం అందించడంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నగరాలను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

యూకే ప్రభుత్వంతో కుదిరిన ఈ ఒప్పందం ద్వారా అంతర్జాతీయ స్థాయి పట్టణ ప్రణాళిక, సాంకేతికత, రవాణా విధానాలను రాష్ట్రంలో అమలు చేసే అవకాశం ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. అమరావతి నిర్మాణంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పట్టణాభివృద్ధికి ఈ భాగస్వామ్యం కీలకంగా మారనుంది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story