AP: క్వాంటం రంగంలో ఏపీ విద్యార్థుల సత్తా.. జాతీయ స్థాయిలో మెడల్స్ కొల్లగొట్టిన యువత!
AP: ఎన్పీటీఈఎల్ (NPTEL) క్వాంటం కంప్యూటింగ్ కోర్సు పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. 4 గోల్డ్, 14 సిల్వర్ మెడల్స్ సాధించి టెక్నాలజీ రంగంలో రికార్డు సృష్టించారు.
AP: క్వాంటం రంగంలో ఏపీ విద్యార్థుల సత్తా.. జాతీయ స్థాయిలో మెడల్స్ కొల్లగొట్టిన యువత!
AP: దేశవ్యాప్తంగా ఈ కోర్సుకు 2,08,785 దరఖాస్తులు రాగా.. అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 1,04,220 దరఖాస్తులు రావడం విశేషం. దేశంలోని మిగిలిన ప్రాంతాల నుంచి 1,04,565 దరఖాస్తులు వచ్చాయి. పరీక్షకు ఏపీ నుంచి సుమారు 19 వేల మంది హాజరుకాగా.. మిగిలిన దేశం నుంచి 11 వేల మంది పరీక్ష రాశారు.
ఫలితాల్లోనూ ఏపీ విద్యార్థుల ఆధిపత్యం కొనసాగింది. రాష్ట్రం నుంచి 2,839 మంది ఉత్తీర్ణత సాధించగా.. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి 2,700 మంది ఉత్తీర్ణులయ్యారు. జాతీయ స్థాయిలో సాధించిన గోల్డ్, సిల్వర్ మెడల్స్‌లో ఏపీ విద్యార్థులు గణనీయమైన వాటాను దక్కించుకున్నారు. రాష్ట్రానికి చెందిన విద్యార్థులు నాలుగు గోల్డ్ మెడల్స్, 14 సిల్వర్ మెడల్స్ సాధించగా.. ఇతర ప్రాంతాల విద్యార్థులు నాలుగు గోల్డ్, 16 సిల్వర్ మెడల్స్ సాధించారు.
ముఖ్యంగా ఏపీకి వచ్చిన 14 సిల్వర్ మెడల్స్‌లో ఏడు మెడల్స్‌ను ఆర్జీయూకేటీ నూజివీడు విద్యార్థులు సాధించడం రాష్ట్ర విద్యా రంగానికి గర్వకారణంగా నిలిచింది. విశాఖకు చెందిన సీహెచ్ రామ సౌజన్య, విజయవాడకు చెందిన టి. సౌమ్యశ్రీ, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అనిల్ శ్రీనివాస్, రాజమహేంద్రవరానికి చెందిన యశ్వంత్ బీటెక్ విద్యార్థులుగా గోల్డ్ మెడల్స్ సాధించారు.
క్వాంటం కంప్యూటింగ్‌లో రాష్ట్ర యువతకు అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఏపీలో లక్ష మంది క్వాంటం నిపుణులను తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు. ఎన్పీటీఈఎల్ క్వాంటం స్కిల్ కోర్సుకు ఏపీ నుంచి భారీగా దరఖాస్తులు రావడంపై గతంలో సీఎం స్పందిస్తూ విద్యార్థుల ఆసక్తిని ప్రశంసించారు. గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించిన విద్యార్థులను స్వయంగా కలిసి అభినందిస్తానని కూడా ప్రకటించారు.
క్వాంటం కంప్యూటింగ్‌కు భవిష్యత్‌లో భారీగా ఉద్యోగ, పరిశోధన అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఐబీఎం, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, గూగుల్ వంటి సంస్థల్లో అవకాశాలు కల్పించేలా ఈ కోర్సు విద్యార్థులకు నైపుణ్యాన్ని అందిస్తోంది. ఇప్పటికే మెడల్స్ సాధించిన వారిలో ఆరుగురికి క్వాంటం కంప్యూటింగ్ రంగంలోని సంస్థల్లో ఉద్యోగాలు లభించాయి. మేధా టవర్స్‌లోని క్వాంటం కంప్యూటింగ్ సంస్థలో ముగ్గురు విద్యార్థులు ఉద్యోగాలు పొందారు.
క్వాంటం టెక్నాలజీ భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారుతున్న వేళ.. జాతీయ స్థాయి కోర్సులో ఏపీ విద్యార్థులు సాధించిన ఈ విజయాన్ని రాష్ట్రంలో క్వాంటం ఎడ్యుకేషన్‌కు లభిస్తున్న ఆదరణకు నిదర్శనంగా అధికారులు భావిస్తున్నారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభకు సరైన శిక్షణ, పరిశ్రమల అనుసంధానం తోడైతే క్వాంటం రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే కీలక కేంద్రంగా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.




