Amaravati: 25 భారీ ప్రాజెక్టులకు ఓకే.. 21,627 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు!
Amaravati: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 20వ SIPB సమావేశంలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన 25 పారిశ్రామిక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.
Amaravati: 25 భారీ ప్రాజెక్టులకు ఓకే.. 21,627 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు!
Amaravati: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి మరో భారీ అడుగు పడింది. రాష్ట్రంలో రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడులతో 25 భారీ పారిశ్రామిక ప్రాజెక్టులకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా 21,627 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన 20వ SIPB సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
డిసెంబరు నుంచి ఎస్క్రో ఖాతాల్లో ప్రోత్సాహకాలు
పరిశ్రమలకు ఇస్తున్న ప్రోత్సాహకాల విషయంలో ప్రభుత్వం మరింత పారదర్శక విధానాన్ని అమలు చేయనుంది. ఈ ఏడాది డిసెంబరు నుంచి పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతాల్లో జమ చేసేలా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పరిశ్రమలతో ఎస్క్రో ఖాతాలను అనుసంధానం చేసి ప్రోత్సాహకాలు అందించే విధానాన్ని అమలు చేయాలని సూచించారు...పరిశ్రమలను ఆకర్షించేందుకు ఇన్సెంటివ్‌లు అవసరమే అయినా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎంత మేరకు ప్రోత్సాహకాలు ఇవ్వగలమన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.
గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమల విస్తరణ
పారిశ్రామిక అభివృద్ధి కొన్ని నగరాలకే పరిమితం కాకూడదన్నది చంద్రబాబు ఆలోచన. గ్రామీణ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందేలా పారిశ్రామిక ప్రాజెక్టులను ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమలతో పాటు స్థానికంగా ఉపాధి, మౌలిక వసతులు, రవాణా, సేవారంగాలు అభివృద్ధి చెందేలా ఎకోసిస్టమ్‌ను నిర్మించాలన్నారు.
డేటా సెంటర్లపై అపోహలు వద్దు
ఉత్తరాంధ్రలో ఏర్పాటు అవుతున్న డేటా సెంటర్లపై వస్తున్న విమర్శలకు సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. కొందరు పనిగట్టుకుని కాలుష్యకారకాలుగా ప్రచారం చేస్తూ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
ఉత్తరాంధ్రలో ఏర్పాటు అవుతున్న అన్ని డేటా సెంటర్లకు కలిపి 3.5 టీఎంసీల నీరు సరిపోతుందని స్పష్టం చేశారు...డేటా సెంటర్లపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. పారిశ్రామిక ప్రాజెక్టుల వల్ల రాష్ట్ర ఎకోసిస్టమ్‌కు ఎంత విలువ జోడవుతోందో ఎప్పటికప్పుడు విశ్లేషించాలని ఆదేశించారు.
గ్రీన్ అమ్మోనియా నుంచి రోబోటిక్స్ వరకు
భవిష్యత్ పరిశ్రమలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. గ్రీన్ అమ్మోనియా, లిథియం బ్యాటరీలు, రోబోటిక్స్ వంటి అత్యాధునిక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక వ్యూహం రూపొందించాలన్నారు.
ఆయా రంగాల్లో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు అవసరమైన విధానాలు, ప్రోత్సాహకాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు...ఈ సమావేశంలో ఆమోదం పొందిన ప్రాజెక్టుల్లో డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, లిథియం బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్, బయోగ్యాస్, హాస్పిటాలిటీ, లాజిస్టిక్స్, ఆగ్రో ప్రాసెసింగ్ తదితర రంగాలకు ప్రాధాన్యం లభించింది.
ఒక్క ప్రాజెక్టుతో వేలాది ఉద్యోగాలు
కడప జిల్లా కొప్పర్తి క్లస్టర్‌లో ఏర్పాటు కానున్న AIL డిక్సన్ ఇండియా ప్రాజెక్టుకు రూ.450 కోట్ల పెట్టుబడితో పాటు ఏకంగా 7 వేల ఉద్యోగాలు రానున్నాయి. నెల్లూరు జిల్లా మనుబోలులో VPR మైనింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ పార్క్‌కు రూ.500 కోట్ల పెట్టుబడితో 2 వేల ఉద్యోగాలు కల్పించనున్నారు.
రెన్యూ ఏపీ గ్రీన్ డేటా సెంటర్‌కు అనకాపల్లి జిల్లాలో రూ.85,200 కోట్ల పెట్టుబడులు రానుండగా.. 1,880 మందికి ఉపాధి లభించనుంది. విశాఖ జిల్లాలో డేటా సెంటర్ హోల్డింగ్స్ ఇండియా రూ.58,743 కోట్లతో ఏర్పాటు కానుంది. దీనివల్ల 1,250 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. AM Intelligence Labsకు రూ.31,387 కోట్ల పెట్టుబడులు రానున్నాయి.
రక్షణ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం
రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న రక్షణ రంగ ప్రాజెక్టులన్నీ జాతికి గర్వకారణమని సీఎం చంద్రబాబు అన్నారు. పుట్టపర్తి సమీపంలో డిఫెన్స్, హిందూపురం సమీపంలో ఏరోస్పేస్ ప్రాజెక్టులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు...రక్షణ, ఏరోస్పేస్ రంగాలను భవిష్యత్ పారిశ్రామిక వృద్ధికి కీలక కేంద్రాలుగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
మూలపేట పోర్టు.. రాయలసీమ ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్
శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణాన్ని డిసెంబరులోగా పూర్తి చేసి ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. లాజిస్టిక్స్, ఆధునిక వేర్‌హౌసింగ్, కోల్డ్‌చైన్ ప్రాజెక్టులను పోర్టులతో అనుసంధానం చేయాలని సూచించారు.
రాయలసీమలో పండే ఉద్యాన ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లకు చేరేలా రోడ్డు, రైలు, పోర్టు కనెక్టివిటీని బలోపేతం చేయాలని అన్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గ్రావిటీపై విశాఖలోని పరిశ్రమలకు పుష్కలంగా నీటిని అందించేలా చర్యలు చేపడతామని సీఎం స్పష్టం చేశారు.
సెప్టెంబరులోగా 175 ఎంఎస్ఎంఈ పార్కులు
చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. రాష్ట్రంలో సెప్టెంబరు నాటికి మిగిలిన 37 ఎంఎస్ఎంఈ పార్కులను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. దీంతో మొత్తం 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక వాడలు అందుబాటులోకి రానున్నాయి.
అదే సమయంలో ‘వన్ ఫ్యామిలీ–వన్ ఎంట్రప్రెన్యూర్’ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని సీఎం సూచించారు. కుటుంబ స్థాయిలోనే పారిశ్రామిక ఆలోచనలను ప్రోత్సహించి స్వయం ఉపాధి, ఉపాధి కల్పనకు మార్గం వేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.
20 SIPB సమావేశాల్లో రూ.13.78 లక్షల కోట్ల పెట్టుబడులు
20వ SIPB సమావేశంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆమోదం పొందిన పెట్టుబడుల విలువ భారీగా పెరిగింది. మొత్తం 20 సమావేశాల్లో 363 పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. వీటి విలువ రూ.13.78 లక్షల కోట్లు. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు 10.86 లక్షల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.
ప్రభుత్వం కేవలం పెట్టుబడులకు అనుమతులు ఇవ్వడమే కాకుండా.. అవి వాస్తవరూపం దాల్చేలా పర్యవేక్షణ చేయాలని సీఎం ఆదేశించారు. గత ఏడాది నుంచి కుదిరిన పెట్టుబడి ఒప్పందాలు, SIPBలో ఆమోదం పొందిన ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
పర్యాటక రంగానికీ పారిశ్రామిక హంగులు
రాష్ట్రానికి వచ్చే పర్యాటకులను ఆకట్టుకునేలా హోటళ్లు, రిసార్టుల నిర్మాణంలో ప్రత్యేకత ఉండాలని సీఎం సూచించారు. ఆతిథ్య రంగంలో ఏర్పాటయ్యే భవనాలు కేవలం వసతి కేంద్రాలుగా కాకుండా పర్యాటక ఆకర్షణలుగా ఉండేలా చూడాలని అన్నారు. ఈ SIPB ఆమోదాలతో ఏపీ పారిశ్రామిక రంగంలో పెట్టుబడుల పరిమాణం మాత్రమే కాకుండా.. పెట్టుబడుల స్వభావంలోనూ మార్పు కనిపిస్తోంది.
సంప్రదాయ పరిశ్రమలతో పాటు డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, లిథియం బ్యాటరీలు, డిఫెన్స్, ఏరోస్పేస్, రోబోటిక్స్ వంటి భవిష్యత్ రంగాల వైపు రాష్ట్రం అడుగులు వేస్తోంది. పెట్టుబడులు కాగితాలకే పరిమితం కాకుండా భూమిపై పరిశ్రమలుగా మారి.. స్థానిక యువతకు ఉద్యోగాలు, గ్రామీణ ప్రాంతాలకు మౌలిక వసతులు, రాష్ట్రానికి కొత్త ఆర్థిక అవకాశాలు తీసుకురావడమే ఇప్పుడు ప్రభుత్వానికి అసలు సవాల్.




