Amaravati: ఆక్వా పరిశ్రమలపై పీసీబీ తనిఖీలు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు!

Amaravati: ఏపీలోని ఆక్వా ప్రాసెసింగ్ కేంద్రాల్లో పీసీబీ ప్రత్యేక తనిఖీలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నీటి నమూనాల సేకరణ, పర్యావరణ పరిరక్షణకు కఠిన చర్యలు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 1 Sept 2026 7:43 AM IST
Amaravati
X

Amaravati: ఆక్వా పరిశ్రమలపై పీసీబీ తనిఖీలు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు!

Amaravati: రాష్ట్రంలో ఆక్వా రంగం విస్తరిస్తున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ప్రత్యేక దృష్టి సారించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా ప్రాసెసింగ్ కేంద్రాల్లో ప్రత్యేక తనిఖీలు, నమూనాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆక్వా కేంద్రాల నుంచి వెలువడే వ్యర్థ జలాల వల్ల సహజ నీటి వనరులకు ఎలాంటి నష్టం జరుగుతోందన్న అంశంపై శాస్త్రీయంగా అధ్యయనం చేయనుంది.

ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ప్రాసెసింగ్ కేంద్రాల్లోని నీటి విడుదల వ్యవస్థల నుంచి పీసీబీ అధికారులు నమూనాలను సేకరించారు. సేకరించిన నీటి నమూనాలను ప్రయోగశాలలకు పంపించి శాస్త్రీయ పద్ధతుల్లో పరీక్షించనున్నారు.

నీటిలో కాలుష్య స్థాయిని అంచనా వేయడంతోపాటు, కాలుష్యానికి ప్రధాన కారణాలేమిటో గుర్తించనున్నారు. పరీక్షల ఫలితాల ఆధారంగా అవసరమైన నివారణ చర్యలను సూచించడంతోపాటు, నిబంధనలు పాటించేలా సంబంధిత యాజమాన్యాలకు అవగాహన కల్పించనున్నారు.

సోమవారం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, నెల్లూరు జిల్లాల పరిధిలోని ఆక్వా ప్రాసెసింగ్ కేంద్రాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించి నమూనాలు సేకరించారు.

మంగళవారం కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని ఆక్వా కేంద్రాల్లో ఇదే తరహాలో నమూనాల సేకరణ, తనిఖీలు చేపట్టనున్నారు. ప్రాసెసింగ్ కేంద్రాల్లో వ్యర్థాల నిర్వహణ విధానం, వ్యర్థ జలాల శుద్ధి ప్రక్రియ, నీటి విడుదల వ్యవస్థలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

నమూనాల్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, కరిగిన ఆక్సిజన్‌తోపాటు బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (BOD), కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (COD), ఘన వ్యర్థాల స్థాయిలను శాస్త్రీయంగా విశ్లేషించనున్నారు. ఈ పరీక్షల ద్వారా ఆక్వా ప్రాసెసింగ్ కేంద్రాల నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాల నాణ్యతపై స్పష్టమైన అంచనాకు వచ్చే అవకాశం ఉంది.

ఆక్వా పరిశ్రమల నుంచి శుద్ధి చేయకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా వ్యర్థ జలాలను విడుదల చేస్తే భూగర్భ జలాలతోపాటు నదులు, వాగులు, వంకలు, ఇతర సహజ నీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతోపాటు ప్రజల జీవనంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కాలుష్య కారకాలను నియంత్రించడం, వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడం, పర్యావరణ ప్రమాణాలను కచ్చితంగా పాటించేలా చేయడం లక్ష్యంగా పీసీబీ చర్యలు చేపడుతోంది.

కాలుష్య నియంత్రణ కేవలం తనిఖీలు, చర్యలకే పరిమితం కాకుండా ఆక్వా ప్రాసెసింగ్ కేంద్రాల యాజమాన్యాలకు అవగాహన కల్పించడంపైనా అధికారులు దృష్టి సారిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు అవసరమైన సాంకేతిక విధానాలు, వ్యర్థ జలాల శుద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై సూచనలు చేయనున్నారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ఆక్వా రంగం అభివృద్ధి చెందుతూనే పర్యావరణానికి హాని కలగకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణ, జల వనరుల సంరక్షణతోపాటు ఆక్వా రంగంలో స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటున్నారు. కాలుష్య నియంత్రణతో పాటు ఆక్వా రంగం దీర్ఘకాలికంగా అభివృద్ధి చెందేలా సమతుల్య విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story