Amaravati: యువతకు ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యం!

Amaravati: 10,060 పోస్టులతో ఏపీ జాబ్ క్యాలెండర్–2026కు గ్రీన్ సిగ్నల్. 2,991 డీఎస్సీ పోస్టులతో సహా 4 దశల్లో భర్తీ చేయనున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి.

Hari Kishan  AP Bureau Chief
Published on: 25 Aug 2026 11:07 AM IST
Amaravati
X

Amaravati: యువతకు ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యం!

Amaravati: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్–2026 విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో యువత భవిష్యత్‌కు భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు.

యువత కలలు కన్న భవిష్యత్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాకారం చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్–2026 ద్వారా ప్రభుత్వం మరో తీపికబురు అందించిందన్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను నాలుగు దశల్లో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో పలు శాఖలకు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని తెలిపారు.

జాబ్ క్యాలెండర్‌లో గ్రూప్–1, గ్రూప్–2 పోస్టులతో పాటు పోలీసు, ఫైర్ సర్వీసెస్, జైళ్లు, అటవీ, పశుసంవర్థక, ఎక్సైజ్, ఇంజినీరింగ్, విద్యుత్ తదితర శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ముఖ్యంగా విద్యా రంగంలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, డీఎస్సీ ద్వారా 2,991 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు అందించడంతో పాటు ఉపాధి అవకాశాలను విస్తృతం చేయడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కీలకమని, వారికి సరైన అవకాశాలు కల్పిస్తే రాష్ట్ర ప్రగతికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.

ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌ను యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చదువుతూ పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని, ఉద్యోగం పొందిన అనంతరం రాష్ట్ర ప్రజలకు అంకితభావంతో సేవలందించాలని ఆకాంక్షించారు.

నిరుద్యోగ యువతకు ఉద్యోగ భద్రత, మెరుగైన భవిష్యత్ కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని మంత్రి స్పష్టం చేశారు. జాబ్ క్యాలెండర్–2026కు సంబంధించిన పూర్తి వివరాలు, పోస్టుల వారీగా సమాచారం కోసం అభ్యర్థులు goir.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story