బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం.. ఏపీలో తొలి అడుగు కు శ్రీకారం

Amaravati: విజయవాడలో మంత్రి సవిత ఆధ్వర్యంలో బీసీ రక్షణ చట్టం ముసాయిదాపై కీలక సమావేశం. దేశంలోనే తొలిసారిగా బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తెస్తున్న ఏపీ ప్రభుత్వం.

Hari Kishan  AP Bureau Chief
Published on: 5 Aug 2026 3:49 PM IST
Amaravati
X

బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం.. ఏపీలో తొలి అడుగు కు శ్రీకారం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఎన్నికల హామీ మేరకు బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది. విజయవాడలో మంత్రి సవిత నేతృత్వంలో నిర్వహించిన కీలక సమావేశంలో బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని ముసాయిదా బిల్లుపై విస్తృతంగా చర్చించారు. మంత్రి సత్య కుమార్ యాదవ్, హోంమంత్రి వంగలపూడి అనిత వర్చువల్‌గా సమావేశంలో పాల్గొన్నారు. మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, ఎన్.ఎండీ. ఫరూక్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు.

సమావేశం అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ, దేశంలోనే తొలిసారిగా బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని ఆంధ్రప్రదేశ్‌లో తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక గుర్తింపును మరింత బలోపేతం చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని తెలిపారు. బీసీలను వేధించినా, జాతి లేదా కులవృత్తుల పేరుతో అవమానించినా ప్రతిపాదిత బీసీ రక్షణ చట్టం కింద శిక్షార్హమైన నేరంగా పరిగణించేలా నిబంధనలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ చట్టం కింద నమోదయ్యే కేసుల వేగవంతమైన విచారణ కోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే బీసీ సంఘాల నాయకులతో సమావేశాలు నిర్వహించి వారి సూచనలు సేకరించామని, ఇప్పుడు బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను కూడా ముసాయిదా బిల్లులో పొందుపరుస్తామని చెప్పారు. తుది నివేదికను త్వరలో జాతీయ బీసీ కమిషన్‌కు సమర్పించి, కేంద్ర ప్రభుత్వ సహకారంతో చట్టాన్ని అమల్లోకి తీసుకురావడానికి చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే బీసీలు పార్టీకి అండగా నిలిచారని, అందుకే వారి రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఎన్నికల్లో హామీ ఇచ్చామని చెప్పారు. దేశంలో అనేక చట్టాలు ఉన్నప్పటికీ బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం లేదని, ఆ లోటును ఏపీ ప్రభుత్వం భర్తీ చేయబోతుందని అన్నారు.గత రెండు సంవత్సరాలుగా ఈ చట్టం రూపకల్పనపై విస్తృత చర్చలు జరిపామని, ఇందుకోసం ప్రత్యేక సబ్ కమిటీని ఏర్పాటు చేసి పలు అంశాలను పరిశీలించామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. మంత్రులు, శాసనసభ్యుల అభిప్రాయాలతో పాటు అన్ని వర్గాల సూచనలను పరిగణనలోకి తీసుకుని డ్రాఫ్ట్ బిల్లును సిద్ధం చేస్తున్నామని, శాసనసభలో ప్రవేశపెట్టే ముందు జాతీయ బీసీ కమిషన్ సలహాలను కూడా తీసుకుంటామని చెప్పారు.

బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని, వాటిని 27 శాతానికి పెంచింది చంద్రబాబు నాయుడేనని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గత ప్రభుత్వం న్యాయపరమైన పోరాటం చేయకుండా బీసీ రిజర్వేషన్లు తగ్గించిందని విమర్శించారు. ప్రస్తుతం డెడికేటెడ్ బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసి బీసీల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. త్వరలోనే బీసీ రక్షణ చట్టం తుది రూపం దాల్చి శాసనసభ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది...

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story