వాక్ స్వాతంత్ర్యానికి హద్దులు.. సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ కళ్యాణ్ హెచ్చరిక
Amaravati: సోషల్ మీడియా వేధింపులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక సందేశం. బాధితుల కోసం డిప్యూటీ సీఎం కార్యాలయంలో ప్రత్యేక ఫిర్యాదుల వ్యవస్థ.
వాక్ స్వాతంత్ర్యానికి హద్దులు.. సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ కళ్యాణ్ హెచ్చరిక
Amaravati: ప్రజాస్వామ్యానికి సోషల్ మీడియా బలమైన వేదిక సోషల్ మీడియా నేటి సమాజంలో ప్రతి ఒక్కరి జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి, ప్రభుత్వానికి ప్రజా సమస్యలను తెలియజేయడానికి, ప్రజలతో ప్రజలు అనుసంధానం కావడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇది శక్తివంతమైన వేదికగా నిలిచింది.
అయితే ఈ స్వేచ్ఛను బాధ్యతతో వినియోగించాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న కొద్దీ దాని దుర్వినియోగం కూడా ఆందోళనకర స్థాయికి చేరుకుందని పేర్కొంటూ ఆయన కీలక సందేశాన్ని విడుదల చేశారు.
*భావ ప్రకటన స్వేచ్ఛకు రాజ్యాంగ పరిరక్షణ*
భావ ప్రకటన స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఈ హక్కును తాను గౌరవిస్తానని, రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా గౌరవిస్తుందని చెప్పారు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు, ప్రశ్నించే హక్కు, ప్రభుత్వ నిర్ణయాలతో విభేదించే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలకు స్థానం ఉంటుందని, నిర్మాణాత్మక విమర్శలను ప్రభుత్వం స్వాగతిస్తుందని వెల్లడించారు.
*స్వేచ్ఛ అంటే దుర్వినియోగం కాదు*
భావ ప్రకటన స్వేచ్ఛ అనేది అపరిమిత హక్కు కాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) ప్రకారం దేశ సమగ్రత, జాతీయ భద్రత, ప్రజా శాంతి, మర్యాద, నైతిక విలువలు, పరువు నష్టం, నేరాలకు ప్రేరేపించడం వంటి అంశాల్లో చట్టపరమైన పరిమితులు ఉన్నాయని వివరించారు. "ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూజ్ కాదు" అని స్పష్టమైన సందేశం ఇచ్చారు. విమర్శలకు స్వాగతమే కానీ వ్యక్తిగత దూషణలు, బెదిరింపులు, అసత్య ఆరోపణలు, ద్వేషపూరిత ప్రచారం మాత్రం చట్టవిరుద్ధమని హెచ్చరించారు.
*సోషల్ మీడియా దుర్వినియోగంపై ఆందోళన*
గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ల ద్వారా జరుగుతున్న దుర్వినియోగం తీవ్ర స్థాయికి చేరుకుందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అసభ్య పదజాలం ఉపయోగించడం, వ్యక్తిగత దూషణలు చేయడం, ఆధారాలు లేని ఆరోపణలు చేయడం, తప్పుడు ప్రచారాలు నిర్వహించడం, ఫోటోలను అసభ్యంగా మార్చడం, బెదిరింపులు, వేధింపులు వంటి చర్యలు పెరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు చేయడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.
*మహిళలు, మతాలపై దాడులు అసలు సమర్థనీయం కాదు*
మహిళల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు, వేధింపులు, అసభ్య పోస్టులు చట్టపరంగా తీవ్రమైన నేరాలని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అలాగే దేవుళ్లు, దేవతలు, మత విశ్వాసాలను ఉద్దేశపూర్వకంగా అవమానించే వ్యాఖ్యలు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ పరిధిలోకి రావని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.
*నిర్మాణాత్మక విమర్శలకు పూర్తి గౌరవం*
ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడం, వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం, విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యంలో సహజమని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేయడం, ద్వేషపూరిత ప్రసంగాలు చేయడం, సైబర్ వేధింపులకు పాల్పడడం, పరువునష్టం కలిగించే ప్రయత్నాలు చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు.
*నేరానికి కులం, మతం, రాజకీయ రంగు ఉండదు*
సోషల్ మీడియా నేరాలకు పాల్పడిన తర్వాత కులం, మతం, ప్రాంతం లేదా రాజకీయ పార్టీ పేరుతో తప్పించుకోవాలని ఎవరూ ప్రయత్నించవద్దని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. నేరానికి కులం లేదని, మతం లేదని, రాజకీయ పార్టీ కూడా లేదని స్పష్టం చేశారు. చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమేనని, తప్పు చేసిన వారిపై రాజకీయ అనుబంధాలు చూడకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
*బాధితులకు ప్రభుత్వం అండ*
సోషల్ మీడియా దుర్వినియోగం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. తమ సమస్యలను చెప్పుకోవడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఎవరూ ఒంటరిగా భావించాల్సిన అవసరం లేదని, ప్రతి నిజమైన ఫిర్యాదును ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు.
*డిప్యూటీ సీఎం కార్యాలయంలో ప్రత్యేక ఫిర్యాదు వ్యవస్థ*
సోషల్ మీడియా వేధింపులకు గురైన వారు స్క్రీన్షాట్లు, లింకులు, వీడియోలు వంటి డిజిటల్ ఆధారాలతో నేరుగా ఫిర్యాదు చేయడానికి ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వచ్చిన ప్రతి జెన్యూన్ ఫిర్యాదును సంబంధిత అధికారులకు పంపించి చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూస్తామని చెప్పారు.
*బాధ్యతగల పౌరుల సహకారం కోరిన పవన్*
పదేపదే ఫేక్ అకౌంట్ల ద్వారా దుర్వినియోగానికి పాల్పడుతున్న వ్యక్తుల వివరాలను ప్రభుత్వానికి అందించాలని బాధ్యతగల పౌరులకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాను పరిశుభ్రంగా ఉంచడం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
*కఠిన చట్టపరమైన చర్యలు*
సోషల్ మీడియా ద్వారా నేరాలకు పాల్పడిన వారిపై భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS), సమాచార సాంకేతిక చట్టం–2000తో పాటు ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావడానికీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అదే సమయంలో రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను పూర్తిగా పరిరక్షిస్తామని స్పష్టం చేశారు.
*బాధ్యతతో కూడిన స్వేచ్ఛే బలమైన ప్రజాస్వామ్యానికి పునాది*
ప్రతి ఒక్కరి మాటల్లో బాధ్యత, భాషలో గౌరవం, స్వేచ్ఛలో జవాబుదారీతనం ఉండాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. సోషల్ మీడియా మనుషులను కలిపే వేదికగా ఉండాలే తప్ప విడదీసే వేదికగా మారకూడదని సూచించారు. "మమ్మల్ని ప్రశ్నించండి.. విమర్శించండి.. మీ అభిప్రాయాన్ని చెప్పండి. కానీ గౌరవంతో చెప్పండి.. బాధ్యతతో చెప్పండి.. చట్టాన్ని గౌరవిస్తూ చెప్పండి. అప్పుడే మన ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది" అంటూ తన సందేశాన్ని ముగించారు..




