Amaravati: రూ.1,437 కోట్లతో రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులు!

Amaravati: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 65వ సీఆర్డీఏ సమావేశంలో అమరావతి 29 గ్రామాల్లో రూ.1,437 కోట్లతో మౌలిక వసతుల కల్పనతో పాటు పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.

Hari Kishan  AP Bureau Chief
Published on: 27 Aug 2026 9:24 PM IST
Amaravati
X

Amaravati: రూ.1,437 కోట్లతో రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులు!

AP: రాజధాని అమరావతిలోని 29 గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.1,437 కోట్లు ఖర్చు చేయాలని సీఆర్డీఏ 65వ అథారిటీ సమావేశం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. సమావేశ వివరాలను మంత్రి నారాయణ వెల్లడించారు.

ఇప్పటికే రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కోసం రూ.904 కోట్లు కేటాయించగా, తాజాగా మరో రూ.533 కోట్ల పనులకు అథారిటీ ఆమోదం తెలిపింది. రోడ్లు, డ్రైన్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి సరఫరా, వీధి దీపాలు తదితర సదుపాయాలను కల్పించనున్నారు. అమరావతి క్యాపిటల్ సిటీలో ఉన్న యూజీడీ వ్యవస్థను 29 రాజధాని గ్రామాల్లోనూ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

శాకమూరులో రూ.596 కోట్లతో సెంట్రల్ పబ్లిక్ లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్, ఆడిటోరియం, హెచ్ఆర్‌కు సంబంధించిన భవనాల నిర్మాణానికి అథారిటీ ఆమోదం తెలిపింది. రైతుల లేఅవుట్లలోని చిన్న రోడ్లను సీసీ రోడ్లుగా నిర్మించాలన్న ప్రతిపాదనకు బదులుగా బీటీ రోడ్లు వేయాలని నిర్ణయించారు. నేల స్వభావం, భవిష్యత్‌లో పెరగనున్న వాహన రాకపోకలను దృష్టిలో ఉంచుకుని సీఆర్ఆర్ఐ, ఐఐటీ ఖరగ్‌పూర్ అధ్యయనం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

అమరావతిలో డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటుకు డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు సీఆర్డీఏకు అనుమతి ఇచ్చారు. అలాగే ప్రైవేట్ రంగం ద్వారా అభివృద్ధి చేపట్టేందుకు మొత్తం 42 ఎకరాలను గుర్తించారు. పిచ్చుకలపాలెం, తుళ్లూరు, మందడం, కురగల్లు తదితర ప్రాంతాల్లో నివాసాలు, షాపులు, కార్యాలయాలు, ఇతర ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నారు.

ఇప్పటికే హోటళ్లు, పాఠశాలలు తదితర ప్రాజెక్టులకు భూములు కేటాయించిన సంస్థలు అదనపు భూమి కోరితే కొత్త విధానం ప్రకారం కేటాయించనున్నారు. ప్రస్తుత కనీస ధరకు కనీసం 250 శాతం ధర చెల్లించేలా నిబంధన విధించారు. ప్రస్తుతం ఎకరా కనీస ధర రూ.4.1 కోట్లు ఉండగా, అదనపు భూమిని ఎకరాకు కనీసం రూ.10.25 కోట్లకు కేటాయించనున్నారు.

ప్రస్తుతం ల్యాండ్ పూలింగ్ జరుగుతున్న గ్రామాల్లో భూములు ఇస్తున్న రైతు కుటుంబాలకు రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ చేయాలని అథారిటీ నిర్ణయించింది. 2026 జనవరి 1కి ముందు తీసుకున్న రుణాలకు ఇది వర్తించనుంది.

మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌కు అమరావతిలోని స్టోరేజ్ ట్యాంకుల నుంచి తాగునీరు అందించేందుకు కూడా ఆమోదం లభించింది. ప్రస్తుతం 30 ఎంఎల్‌డీ అవసరం ఉండగా, భవిష్యత్ 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 80 ఎంఎల్‌డీ వరకు సరఫరా చేసేలా ప్రణాళిక రూపొందించనున్నారు. కిలోలీటర్‌కు రూ.10 చొప్పున నీటిని సరఫరా చేయనున్నారు.

గ్రీన్ ఎనర్జీ మౌలిక వసతుల అభివృద్ధికి ఐఓసీఎల్‌తో ఎంఓయూ కుదుర్చుకునేందుకు సీఆర్డీఏకు అనుమతి ఇచ్చారు. అమరావతిలో డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి 8.5 ఎకరాలు కేటాయించనున్నారు. తాడికొండ, కంతేరు ప్రాంతాల్లో ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్‌కు అవసరమైన భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించేందుకు అథారిటీ అనుమతి ఇచ్చింది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story