AP: నేపాల్ వరదల్లో ఏపీ యాత్రికులు.. సీఎం చంద్రబాబు సమీక్ష!
AP: నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల రక్షణపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. 34 మంది సురక్షితంగా ఉన్నారని, మిగిలిన ఏడుగురి కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు.
AP: నేపాల్ వరదల్లో ఏపీ యాత్రికులు.. సీఎం చంద్రబాబు సమీక్ష!
AP: నేపాల్‌లో సంభవించిన భారీ వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసుల పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు. ఇప్పటివరకు చేపట్టిన సహాయక చర్యలు, అక్కడి పరిస్థితి, ఏపీకి చెందిన యాత్రికుల క్షేమ సమాచారంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులందరినీ సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని సీఎం స్పష్టం చేశారు.
మానస సరోవర్ యాత్రకు వెళ్లిన ఏపీకి చెందిన పలువురు యాత్రికులు నేపాల్ వరదల్లో చిక్కుకున్నారని అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటివరకు రాష్ట్రానికి చెందిన 41 మంది వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించామని, వారిలో 34 మంది సురక్షితంగా ఉన్నారని తెలిపారు. మరో ఏడుగురి ఆచూకీ తెలియాల్సి ఉందని, వారి కోసం నిరంతరం గాలింపు, సమాచార సేకరణ కొనసాగుతోందని చెప్పారు.
కర్నూలు, ఆదోని ప్రాంతాలకు చెందిన నలుగురు యాత్రికులు టిబెట్‌లో సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. వారితో ఇప్పటికే మాట్లాడినట్లు చెప్పారు. తిరుపతి ప్రాంతానికి చెందిన 28 మంది యాత్రికులు ఖాట్మండూలో క్షేమంగా ఉన్నారని, వారితోనూ ఆర్టీజీఎస్ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు వివరించారు. అయితే చిత్తూరు, విజయవాడ, కాకినాడ, గుంటూరు తదితర ప్రాంతాలకు చెందిన ఏడుగురి ఆచూకీ ఇంకా తెలియలేదని తెలిపారు.
ఆచూకీ లభ్యం కాని ఏడుగురిలో ముగ్గురు ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మానస సరోవర్ యాత్రకు వెళ్లినవారని అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుతం వారి ఫోన్లు అందుబాటులో లేకపోవడంతో వారిని గుర్తించేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. బాధిత కుటుంబాలతో అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, అందుబాటులోకి వస్తున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి చేరవేస్తున్నట్లు చెప్పారు.
నేపాల్‌లో పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఖాట్మండూ, చైనాలోని భారత రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. రహదారులు, విమాన మార్గాలు దెబ్బతినడంతో కొంతమంది యాత్రికులు ప్రస్తుతం అక్కడే ఉండాల్సి వస్తోందని, మార్గాలు పునరుద్ధరించిన వెంటనే వారిని తరలించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
నేపాల్‌లో చిక్కుకున్న ప్రతి ఒక్కరి క్షేమం కోసం అన్ని మార్గాల్లో సమన్వయం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆచూకీ తెలియని ఏడుగురి వివరాలను నిరంతరం ట్రాక్ చేయాలని, వారి కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయాలు, నేపాల్ అధికారులతో సమన్వయం మరింత పెంచాలని ఆదేశించారు.
రహదారి, విమాన మార్గాల పునరుద్ధరణతో పాటు అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించి యాత్రికులను సురక్షితంగా తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్న ఏపీ వాసులను వీలైనంత త్వరగా స్వస్థలాలకు చేర్చడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేయడంలో ఎలాంటి జాప్యం ఉండకూడదని ఆదేశించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ తాజా వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.




